Share News

మక్కల టెండర్లు రద్దు

ABN , Publish Date - May 21 , 2026 | 03:39 AM

మార్క్‌ఫెడ్‌ గోదాముల్లో నిల్వ ఉన్న 3.80 లక్షల టన్నుల మక్కలను బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు గత నెలలో పిలిచిన టెండరును ప్రభుత్వం రద్దు చేసింది.

మక్కల టెండర్లు రద్దు

  • తక్కువకు ఇవ్వొద్దని సర్కారు నిర్ణయం

  • బిడ్డర్లు కోట్‌ చేసిన ధరకు ఇస్తే మార్క్‌ఫెడ్‌కు రూ.380కోట్ల నష్టం

హైదరాబాద్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): మార్క్‌ఫెడ్‌ గోదాముల్లో నిల్వ ఉన్న 3.80 లక్షల టన్నుల మక్కలను బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు గత నెలలో పిలిచిన టెండరును ప్రభుత్వం రద్దు చేసింది. టెండరు ఏజెన్సీలు సిండికేటుగా ఏర్పడి తక్కువ ధర కోట్‌ చేయటంతో... భారీగా నష్టం జరిగే అవకాశం ఉందని గ్రహించి ఈ ఫైలును ఆర్థికశాఖ తిరస్కరించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మొక్కజొన్నల కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,400ఉండగా... బిడ్డర్లు కేవలం రూ.1,400 చొప్పున కోట్‌ చేశారు. ఆ ధరకు ఇస్తే రూ.380 కోట్లు నష్టపోవాల్సి వస్తుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ప్రభుత్వ ఆదేశాలతో మూడోసారి టెండరు నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు మార్క్‌ఫెడ్‌ అధికారులు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి 2025-26 ఖరీఫ్‌ సీజన్‌లో రైతుల నుంచి కనీస మద్దతు ధరకు (రూ.2,400 చొప్పున) కొనుగోలు చేసిన 3,80,187 టన్నుల మక్కలను టెండరు పద్ధతిలో విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత మార్చి నెలలో గోదాముల వారీగా టెండర్లు పిలిచింది. అయితే, టెండర్‌ ఏజెన్సీలన్నీ సిండికేటుగా ఏర్పడి.. బిడ్లు దాఖలు చేయలేదు. ఆతర్వాత ఏప్రిల్‌ 14 న మార్క్‌ఫెడ్‌ రెండోసారి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈసారి గోదాముల వారీగా కాకుండా 5 లాట్లుగా (ఒక్కో లాటుకు 76 వేల టన్నులు) విభజించి టెండరు నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో సిండికేట్‌ మళ్లీ రంగంలోకి దిగింది. ఐదు ఏజెన్సీలు కూటమి కట్టి... ఒక్కో లాటుకు ఒక్కో ఏజెన్సీ మాత్రమే బిడ్డు దాఖలు చేసేలా జాగ్రత్తలు తీసుకుంది. సింగిల్‌ బిడ్‌ దాఖలు చేశారనే విమర్శ రాకుండా ఉండేందుకు... కాస్త తక్కువ ధరతో మరొక సపోర్ట్‌ బిడ్‌ దాఖలు చేశారు. ఈ లెక్కన 5 లాట్లకు 10 బిడ్లు దాఖలయ్యాయి. సగటున క్వింటాలుకు రూ.1,400 చొప్పున బిడ్డింగ్‌ వేశారు. అయితే, ఈ 5 ఏజెన్సీల్లో రెండు ఏజెన్సీలు గతంలో ధాన్యం టెండర్లలో పాల్గొని, ధాన్యం ఎత్తకుండా రైస్‌ మిల్లర్ల నుంచి ఎక్కువ సొమ్ము వసూలు చేసి ప్రభుత్వానికి కుచ్చుటోపీ పెట్టినవే కావడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. టెండర్లలో పాల్గొన్న ఏజెన్సీలపై ఫిర్యాదులు రావటం, తక్కువ ధర కోట్‌ చేయడం, మార్కెట్లో ధర ఎక్కువగా ఉండడం, ఎమ్మెస్పీ కంటే రూ.వెయ్యి తక్కువగా నమోదు చేయడంతో ఫైలు ముందుకు పోలేదు. కాగా, తక్కువ ధరకు మక్కలు కొట్టేయాలనే ఆలోచనతో ఉన్న వ్యాపారులు గురువారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో సమావేశం కానున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.

Updated Date - May 21 , 2026 | 03:39 AM