రూ.1,935 కోట్ల రోడ్ల పనులు రద్దు!
ABN , Publish Date - Jun 22 , 2026 | 05:13 AM
ఆర్ అండ్ బీ పరిధిలో ప్రతిపాదించిన పలు రోడ్ల నిర్మాణంపై పునరాలోచన కొనసాగుతోంది. దాదాపు రూ.1,935.5కోట్ల విలువైన 410 రోడ్ల పనులను రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అటవీ శాఖ అనుమతులు, భూసేకరణ సమస్యలు, తేలని కోర్టు కేసులు..
చాలాకాలంగా అపరిష్కృతంగా ఎల్‌వోఏలు, టెండర్ అగ్రిమెంట్లు
దీంతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేందుకు ముందుకురాని కాంట్రాక్టర్లు
ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించిన రహదారులు, భవనాల శాఖ
హైదరాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): ఆర్ అండ్ బీ పరిధిలో ప్రతిపాదించిన పలు రోడ్ల నిర్మాణంపై పునరాలోచన కొనసాగుతోంది. దాదాపు రూ.1,935.5కోట్ల విలువైన 410 రోడ్ల పనులను రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలాకాలం నుంచి అవి టెండర్ల దశలోనే ఉండడం, అటవీ అనుమతులు రాకపోవడం, కోర్టు కేసులు ఇతరత్రా పలు కారణాల నేపథ్యంలో ఆయా రోడ్ల పనులు చేపట్టలేమని కాంట్రాక్టర్లు కూడా ప్రభుత్వానికి తేల్చిచెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆర్ అండ్ బీ పరిధిలోని మొత్తం పనులు, పలు కారణాలతో నిలిచిపోయిన వాటి వివరాలతో పాటు కొన్ని పనులను రద్దు చేయాలంటూ వచ్చిన విజ్ఞప్తుల గురించి వివరిస్తూ.. తాజాగా ఆర్ అండ్ బీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీనిపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 2023 డిసెంబర్ 7కు ముందు, తరువాత నుంచి కలిపి రూ.13,799.7కోట్ల పనులకు అనుమతులు వచ్చాయి. అయితే వీటన్నింటిలో కలిపి ఎస్టిమేషన్, టెండర్‌లు, అగ్రిమెంట్‌లు, లెటర్ ఆఫ్ అవార్డులు(ఎల్‌వోఏ) కాకపోవడంతో పాటు ఇప్పటికీ పనులు పూర్తికానివి దాదాపు 4,872.83 కోట్ల విలువైన 582 పనులు ఉన్నాయి. మరోవైపు ఇలాంటి సమస్యలతో పాటు ఇతరత్రా కారణాలతో తాజాగా రూ.1,935.5 కోట్ల పనులను రద్దు చేయాలని కాంట్రాక్టర్ల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. అయితే శాఖలో జరుగుతున్న ప్రస్తుత పనులను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు, ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడ్‌లో(హ్యామ్) కొన్ని రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో రద్దు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించిన పనులను మళ్లీ కొత్తగా హ్యామ్‌లో చేర్చుతారా అన్నది తెలియాల్సి ఉంది. కాగా రద్దు చేయాలని విజ్ఞప్తులు వచ్చిన 410పనుల్లో అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలోనే దాదాపు 42వరకు ఉండగా.. అత్యల్పంగా ములుగు, భూపాలపల్లి, గద్వాలలో 1 చొప్పున ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. మిగిలిన జిల్లాల్లోనూ ఏయే రోడ్లను రద్దు చేయాలనే వివరాలను అందులో పొందుపర్చారు.