ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలపై క్యాబినెట్ భేటీలోనే నిర్ణయం
ABN , Publish Date - Jun 21 , 2026 | 05:38 AM
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు అంతర్రాష్ట్ర బదిలీలు కోరుకుంటున్న 891 మంది ఉద్యోగుల అంశంపై తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో....
ఏపీ నుంచి తెలంగాణకు రావాలనుకుంటున్న 891 మంది ఉద్యోగులు
హైదరాబాద్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు అంతర్రాష్ట్ర బదిలీలు కోరుకుంటున్న 891 మంది ఉద్యోగుల అంశంపై తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో ఆమోదం పొందాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ అంశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్దకు చేరినప్పటికీ.. త్వరలో జరిగే క్యాబినెట్ సమావేశం ఎజెండాలో దీనిని పెట్టే అవకాశముంటుందని వివరించాయి. 891 మంది ఉద్యోగులు ఏపీ నుంచి తెలంగాణకు అంతర్రాష్ట్ర బదిలీలు కోరుకుంటున్నారని, దీనిపై స్పందనేమిటో తెలియజేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన అనంతరం కొంత మంది తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులు కూడా ఏపీలో పని చేస్తున్నారు. ఇలాంటివారిని పరస్పర అంగీకారంతో అంతర్రాష్ట్ర బదిలీలు చేద్దామంటూ ఇరు రాష్ట్రాలు గతంలో ఒప్పందం చేసుకున్నాయి. కానీ, ఈ సమస్య ఇంకా పరిష్కారం కావడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. తాజాగా పదోన్నతులు, రిటైర్మెంట్లు, ఉద్యోగుల నిరాసక్తి వంటి అంశాలను పరిశీలించిన మీదట 891 మంది ఉద్యోగులు తెలంగాణకు రావాలనుకుంటున్నారని ఏపీ సీఎస్ తెలంగాణకు తెలియజేశారు. ఈ విషయాన్ని పరిశీలించి, తెలంగాణ అభిప్రాయాలు/ఆమోదాన్ని తెలపాలని తెలంగాణ సీఎ్‌సను కోరారు.