బడ్జెట్ సమావేశాల తర్వాతే పరిషత్ ఎన్నికలు!
ABN , Publish Date - Feb 24 , 2026 | 05:18 AM
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు బడ్జెట్ సమావేశాల తర్వాతే నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.
ఏప్రిల్ చివరి వారంలో జరిగే అవకాశం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశాన్ని మరోసారి పార్లమెంటులో లేవనెత్తుదాం
అసెంబ్లీ సమావేశాలు ముగియగానే కార్యాచరణ
రాష్ట్ర మంత్రివర్గ భేటీలో నిర్ణయం
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు బడ్జెట్ సమావేశాల తర్వాతే నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆలోపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం మరోసారి ప్రయత్నించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని నిర్ణయించింది. సచివాలయంలో సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన రాష్ట్ర మంత్రివర్గం.. పరిషత్ ఎన్నికలపైనా చర్చించింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు చట్ట పరంగా 42 శాతం రిజర్వేషన్ కల్పించాకే ఈ ఎన్నికలకు వెళ్లాలన్న అభిప్రాయానికి వచ్చింది. ఈ అంశంపై మరోసారి పార్లమెంటులో పోరాట కార్యాచరణను చేపట్టాలని నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్లపై విపక్షాల అభిప్రాయాలనూ తీసుకొని కార్యాచరణ నిర్ణయించాలని మంత్రివర్గం తీర్మానించింది. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే రాష్ట్ర క్యాబినెట్ సమావేశమై, కార్యాచరణను ఖరారు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పరిషత్ ఎన్నికలు ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారంలో జరిగే అవకాశం ఉంటుంది.
వరికి ప్రత్యామ్నాయంపై చైతన్యం కలిగిద్దాం
రైతుల నుంచి సేకరించిన ధాన్యం నిల్వలు ప్రభుత్వం వద్ద పేరుకుపోతున్న నేపథ్యంలో ఈ అంశంపైనా చర్చ జరిగింది. ఈ పరిస్థితి అన్ని రాష్ట్రాల్లోనూ నెలకొని ఉందని అధికారులు సీఎం, మంత్రులకు వివరించారు. ఈ నేపథ్యంలో రైతులను వరికి ప్రత్యామ్నాయంగా ఇతర లాభసాటి పంటలకు మళ్లించాలన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఇప్పటికిప్పుడు రైతులను ఇతర పంటలకు మళ్లించడం సాధ్యం కాదని, రానున్న వ్యవసాయ సీజన్‌లో ప్రత్యామ్నాయ పంటలకు మళ్లాల్సిన ఆవశ్యకతపై వారిలో చైతన్యం తీసుకురావాలని మంత్రివర్గ సభ్యులు నిర్ణయించారు. దీనికి సంబంధించి వివరాలు ఇవ్వాల్సిందిగా అధికారులకు సూచించారు.