Share News

విద్యా సంస్థల్లో రోహిత్‌ వేముల చట్టం

ABN , Publish Date - Mar 23 , 2026 | 05:23 AM

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, విద్యాలయాల్లో కులవివక్ష నివారణ, నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురాబోతోంది.

విద్యా సంస్థల్లో రోహిత్‌ వేముల చట్టం

  • కులవివక్ష నివారణ కోసమే..

  • నేడు క్యాబినెట్‌ ముందుకు బిల్లు

  • తల్లిదండ్రుల బాగోగులు చూడని ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో కోత

  • 15శాతం లేదా రూ.10 వేలు కటింగ్‌

  • ఇందుకోసం కొత్త చట్టం

  • జీహెచ్‌ఎంసీ సహా 5 బిల్లులు

  • గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలపైనా చర్చ

  • నేటి సాయంత్రం మంత్రివర్గ భేటీ

హైదరాబాద్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, విద్యాలయాల్లో కులవివక్ష నివారణ, నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురాబోతోంది. కుల, మత, జాతిపరమైన వివక్ష తలెత్తకుండా చర్యలు తీసుకోబోతోంది. ఇందుకోసం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టనుంది. 2016లో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి రోహిత్‌ వేముల పేరుతో ఈ చట్టాన్ని తీసుకురానున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. హెచ్‌సీయూలో రెండు విద్యార్థి సంఘాల మధ్య చెలరేగిన ఘర్షణ కారణంగా రోహిత్‌ వేముల అనే విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2016 జనవరి 17న జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విద్యార్థి రాజకీయాలతోపాటు సామాజిక, రాజకీయాల్లో తీవ్రమైన చర్చకు దారితీసింది. అంతేకాకుండా విద్యాసంస్థల్లో దళితులు, పీడిత వర్గాలపై వివక్ష ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. రోహిత్‌ వేముల సహా మరో ముగ్గురు విద్యార్థులు క్లాసులకు హాజరు కావచ్చునని, కానీ.. మెస్‌కు, హాస్టల్‌కు రాకూడదంటూ బహిష్కరించడంతో వివాదం మొదలైంది. బహిష్కరణకు గురైన ఆ విద్యార్థులంతా హాస్టల్‌ బయటే అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ సమీపంలో చిన్న గుడారం వేసుకుని ‘వెలివాడ’గా దానికి నామకరణం చేసి, అక్కడే నిరసన ప్రారంభించారు. సుదీర్ఘ పోరాటం అనంతరం రోహిత్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రోహిత్‌ మృతి నేపథ్యంలో విద్యాసంస్థల్లో, విశ్వవిద్యాలయాల్లో కులవివక్ష నిర్మూలనకు చట్టం తీసుకురావాలని, దానికి ‘రోహిత్‌ వేముల చ ట్టం’ అని పేరు పెట్టాలనే డిమాండ్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ పార్టీ రోహిత్‌ వేముల చట్టాన్ని తీసుకువస్తామని ప్రకటించింది. ఆ మేరకే చట్టానికి రూపకల్పన చేసింది.


దీని అమలు కోసం సోమవారం సాయంత్రం అసెంబ్లీలోని కమిటీ హాలులో నిర్వహించే క్యాబినెట్‌ సమావేశంలో చర్చించనున్నారు. క్యాబినెట్‌లో ఆమోదించుకున్నాక ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే బిల్లు పెట్టి సభ ఆమోదం తీసుకోనున్నారు. ఈ చట్టంలో ప్రధానంగా విద్యాసంస్థల్లో వివక్ష నివారణ, విద్యార్థులకు సైకలాజికల్‌ కౌన్సెలింగ్‌ అందించడం, విద్యార్థుల హక్కుల రక్షణకు ప్రత్యేక కమిటీలు, వివక్షకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు, యూనివర్సిటీల్లో సమానత్వ వాతావరణం కల్పించడం అనే అంశాలు ఉన్నట్టు సమాచారం. కాగా, కన్న తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యతను విస్మరించి.. అనాథలుగా వదిలేసే ప్రభుత్వ ఉద్యోగుల జీతం నుంచి 15 శాతం లేదా రూ.10 వేలు కోత విఽధించేలా కూడా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురాబోతోంది. ఇందుకోసం ‘తెలంగాణ ఎంప్లాయీస్‌ అకౌంటబిలిటీ అండ్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ పేరెంటల్‌ సపోర్ట్‌ యాక్ట్‌ (టీ-ఈఏఎంపీఎస్‌)- 2026’అనే కొత్త బిల్లును రూపొందించింది. రసోమవారం జరగనున్న మంత్రివర్గ భేటీలో ఈ బిల్లుపై చర్చించి ఆమోదించనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. అలాగే గిగ్‌ వర్కర్ల కోసం రూపొందించిన బిల్లు, జీహెచ్‌ఎంసీ సహా మునిసిపల్‌ శాఖకు చెందిన రెండు బిల్లులు, జీఎస్టీకి సంబంధించిన ఒక బిల్లు కలిపి 5బిల్లులపై క్యాబినెట్‌లో చర్చించి, ఆమోదించనున్నట్టు తెలిసింది.


గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల అంశంపైనా..

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల వ్యవహారం కూడా క్యాబినెట్‌లో చర్చకు రానుంది. గవర్నర్‌ కోటా కింద కోదండరాం, మంత్రి అజారుద్దీన్‌ పేర్లను గతంలోనే ప్రతిపాదించారు. ఇటీవల సుప్రీంకోర్టులోనూ వీరి నియామకానికి సంబంధించి ప్రభుత్వానికి కొంత అనుకూల నిర్ణయం వచ్చింది. మరోసారి గవర్నర్‌కు ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లను పంపాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇదే సమయంలో తెలంగాణ గవర్నర్‌గా ఉన్న జిష్ణుదేవ్‌ వర్మ వేరే రాష్ట్రానికి వెళ్లగా, రాష్ట్రానికి ఇటీవల శివప్రతాప్‌ శుక్లా రావడంతో మరోసారి ఈ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ఆయనకు పంపాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. దీనిపై క్యాబినెట్‌లో చర్చించి, ఒక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది.

Updated Date - Mar 23 , 2026 | 05:25 AM