Share News

సుప్రీం కోర్టు తలుపు తడదామా?

ABN , Publish Date - Apr 23 , 2026 | 04:49 AM

కాళేశ్వరం విచారణ కమిషన్‌ నివేదిక ఆధారంగా కేసీఆర్‌, హరీశ్‌రావుపై తదుపరి చర్యలు తీసుకోరాదని హైకోర్టు వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలా...

సుప్రీం కోర్టు తలుపు తడదామా?

  • హైకోర్టు తీర్పుపై ఏం చేస్తే బాగుంటుంది?

  • క్యాబినెట్‌లో చర్చించాకే తదుపరి అడుగులు

  • న్యాయవాది సింఘ్వితో ఉత్తమ్‌ చర్చలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం విచారణ కమిషన్‌ నివేదిక ఆధారంగా కేసీఆర్‌, హరీశ్‌రావుపై తదుపరి చర్యలు తీసుకోరాదని హైకోర్టు వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలా? తదుపరి అడుగులు ఎలా ఉండాలి? అనే అంశాలపై క్యాబినెట్‌లో చర్చించాకే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం క్యాబినెట్‌ సమావేశం జరగనుంది. ఇప్పటికే నిర్దేశించుకున్న అజెండాలో అదనంగా హైకోర్టు తీర్పు అంశం చర్చకు రానుంది. ఈ వ్యవహారంలో ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వితో బుధవారం మంత్రి ఉత్తమ్‌ ఫోన్‌లో చర్చలు జరిపారు. గురువారం నాటి క్యాబినెట్‌ సమావేశానికి ముందే తీర్పు కాపీపై అధ్యయనం చేసి, తదుపరి ఏం చర్యలు తీసుకోవాలనే దానిపై తగిన సూచనలు ఇవ్వాలని సింఘ్వీని కోరారు. సింఘ్వి సూచన మేరకు సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేసే అంశంపై క్యాబినెట్‌లో చర్చించి, ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ కాలవ్యవధిని ఆర్నెల్లపాటు పొడిగించి... న్యాయస్థానం సూచించిన సాంకేతిక అంశాలకు లోబడి, కేసీఆర్‌, హరీశ్‌రావు, ఎస్‌కే జోషి, స్మితా సభర్వాల్‌కు నోటీసులు అందించి క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు అవకాశం ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అయితే, తొలుత కాళేశ్వరంపై నివేదికను కేసీఆర్‌కు నోటీసు ఇవ్వకుండానే సమర్పించాలని యోచించిన కమిషన్‌, ఆ తర్వాత నోటీసు ఇచ్చి.. కేసీఆర్‌ విజ్ఙప్తి మేరకు ఇన్‌కెమెరాలో క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసింది. విచారణ సందర్భంగా ఎటువంటి అభ్యంతరాలు తెలపకుండా, నివేదిక అనంతరం అభ్యంతరాలు తెలపడంపై న్యాయనిపుణులతో ప్రభుత్వం చర్చించే అవకాశాలున్నాయి.

Updated Date - Apr 23 , 2026 | 04:50 AM