Share News

20న మంత్రివర్గం భేటీ

ABN , Publish Date - Mar 19 , 2026 | 04:15 AM

రాష్ట్రప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను గతేడాదితో పోలిస్తే మరింత పెంచనున్నట్టు తెలిసింది. 2025-26 బడ్జెట్‌ కంటే 5శాతం .....

20న మంత్రివర్గం భేటీ

  • 2026-27 బడ్జెట్‌పై చర్చ, ఆమోదం

  • అదే రోజున ఉభయ సభల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

  • 3.29- 3.30 లక్షల కోట్ల మధ్య బడ్జెట్‌ ?

హైదరాబాద్‌, మార్చి 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను గతేడాదితో పోలిస్తే మరింత పెంచనున్నట్టు తెలిసింది. 2025-26 బడ్జెట్‌ కంటే 5శాతం మేర పెంచాలని ఇదివరకు అనుకున్న ప్రభుత్వం.. ప్రస్తుతం ఆ మొత్తాన్ని 8ు మేర పెంచాలనే ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. దీంతో రూ.3.29 లక్షల కోట్ల నుంచి రూ.3.30 లక్షల కోట్ల వరకు 2026-27 బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ బడ్జెట్‌కు ఆమోదం తెలపడానికి రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 20న సమావేశం కానుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో శుక్రవారం ఉదయం 9.30 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. 2026-27 బడ్జెట్‌కు మంత్రివర్గం ఈ భేటీలో ఆమోదం తెలపనుంది. అనంతరం అదేరోజు(20న) ఉదయం 11 గంటల ప్రాం తంలో అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనమండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. కాగా, ఈసారి బడ్జెట్‌ రూపకల్పనలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించినట్టు తెలిసింది. రాష్ట్ర వాస్తవ రాబడులు, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, పన్నుల వాటాలను పక్కాగా అంచ నా వేసి, బడ్జెట్‌ను తీర్చిదిద్దిందని సమాచారం. 2025-26 బడ్జెట్‌ రూ.3,04,965 కోట్లు కాగా దీనిని మరో 8ు మేర పెంచి కొత్త బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిసింది. పారా అథ్లెట్లకు ఈసారి బడ్జెట్‌లో ప్రాధాన్యమిచ్చినట్లు సమాచారం. వీరికి ఇళ్ల స్థలాలు, ఇతరత్రా ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలిసింది. అర్చకుల జీత భత్యాలను కూడా ప్రభుత్వం పెంచే అవకాశాలు ఉన్నాయి. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు, హెచ్‌ఐవీ, ఫైలేరియా బాధితులు తదితర వర్గాలకు ప్రస్తుతం ఇస్తున్న రూ.2,016 పెన్షన్‌ను రూ.2,516కు పెంచే అవకాశముంది. ఇందుకోసం బడ్జెట్‌లో అదనపు కేటాయింపులు చేసినట్టు చెబుతున్నారు.

Updated Date - Mar 19 , 2026 | 04:15 AM