Share News

వీబీజీ రామ్‌జీ చట్టాన్ని వ్యతిరేకించాలిV

ABN , Publish Date - Jun 28 , 2026 | 03:40 AM

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రామ్‌జీ చట్టం-2025 సమాఖ్య స్ఫూర్తికి విరుద్థంగా రాష్ట్రాల రాజ్యాంగబద్థమైన హక్కులను హరించేలా ఉందని రాష్ట్ర క్యాబినెట్‌ సబ్‌ కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది.

వీబీజీ రామ్‌జీ చట్టాన్ని వ్యతిరేకించాలిV

  • క్యాబినెట్‌ సబ్‌ కమిటీ నిర్ణయం..సిఫారసుల రూపకల్పన

  • 2న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం

హైదరాబాద్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రామ్‌జీ చట్టం-2025 సమాఖ్య స్ఫూర్తికి విరుద్థంగా రాష్ట్రాల రాజ్యాంగబద్థమైన హక్కులను హరించేలా ఉందని రాష్ట్ర క్యాబినెట్‌ సబ్‌ కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. గ్రామీణ పేదల ఉపాధిహక్కు, రాష్ట్రాల పరిపాలనా అధికారాలు, ఆర్థిక స్వయం ప్రతిపత్తిపై ప్రతికూల ప్రభావంచూపేలా ఈ చట్టంలోని నిబంధనలున్నాయని, వాటిని న్యాయపరంగా, చట్టపరంగా వ్యతిరేకించాలని నిర్ణయించింది. ఈమేరకు సిఫారసులను రూపొందించి, వాటిపై జూలై 2న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది. శనివారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అధ్యక్షతన వీబీజీ రామ్‌జీ చట్టం-2025 ప్రభావాలపై క్యాబినెట్‌ సబ్‌ కమిటీ రెండో సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు సీతక్క, తుమ్మల, వివేక్‌ పాల్గొన్నారు. వీబీజీ రామ్‌జీ అమలులో రాష్ట్ర ప్రభుత్వాలు 40శాతం వరకు ఆర్థికభారం భరించాల్సి వస్తున్నప్పటికీ, పనుల ఎంపిక, ప్రణాళిక, ఆమోదం, అమలు, పర్యవేక్షణ వంటి కీలక అంశాల్లో రాష్ట్రాలకు నిర్ణయాధికారం కల్పించకపోవడం తీవ్ర అభ్యంతరకరం అని క్యాబినెట్‌ సబ్‌కమిటీ అభిప్రాయపడింది. నిధులబాధ్యత రాష్ట్రాలపై మోపుతూ, అధికారాలను పూర్తిగా కేంద్రంవద్దే కేంద్రీకరించడం రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తికి విరుద్థమని సబ్‌కమిటీ సభ్యులు పేర్కొన్నారు. కాగా గ్రామీణ పేదల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపే 60 రోజుల ఉపాధి విరామం నిబంధన ఆచరణ సాధ్యంకాదని మంత్రు లు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనుల స్వభావం, వాతావరణ పరిస్థితులు, పేద కుటుంబాల జీవనాధారాన్ని దృష్టిలో ఉంచుకుంటే 60రోజులపాటు ఉపాధి లేకుండా ఉండటం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఈ నిబంధనవల్ల లక్షలాది నిరుపేద కూలీ కుటుంబాలు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 60 రోజుల విరామ కాలంలోనూ కూలీలకు ఉపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేకచట్టం తీసుకురావచ్చా అనే అంశంపైనా సమావేశంలో విస్తృతంగా చర్చించారు. అయితే కేం ద్రం రూపొందించిన వీబీజీ రామ్‌జీ చట్టానికి భిన్నం గా రాష్ట్రం ప్రత్యేక చట్టం అమలుచేస్తే కేంద్రం ఉపాధిహామీ పథకానికి సంబంధించిన నిధులను నిలిపివేసే అవకాశం ఉందని అధికారులు వివరించారు. దీంతో న్యాయపరమైన అన్ని కోణాలను పరిశీలించి ముందుకు వెళ్లాలని సమావేశం నిర్ణయించింది.


కేంద్రానికి పలు డిమాండ్‌లు

కొత్త చట్టం వల్ల రాష్ట్రానికి కలిగే అదనపు ఆర్థిక భారాన్ని పూర్తిగా కేంద్వ్రం భరించాలని డిమాండ్‌ చేయాలని క్యాబినెట్‌ సబ్‌ కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్థి శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తో జరిగే సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలు, సూచనలు, సవరణల ప్రతిపాదనలను స్పష్టంగా వినిపించాలని నిర్ణయించారు. కేంద్రానికి పంపాల్సిన అధికారిక అభిప్రాయాలు, సవరణల సిఫార్సులను ఖరారు చేశారు. అనంతరం పలు కార్మిక సంఘాలు, పౌరసంఘాలు, ప్రజాసంఘాల ప్రతినిధులతో క్యాబినెట్‌ సబ్‌కమిటీ ప్రత్యేకంగా సమావేశమై వీబీజీ రామ్‌ జీ చట్టంపై వారి అభ్యంతరాలు, సూచనలు, ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను తెలుసుకుంది. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు కొనసాగించడంతో పాటు, అవసరమైతే న్యాయస్థానాలను కూడా ఆశ్రయించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగాలని క్యాబినెట్‌ సబ్‌కమిటీ నిర్ణయించింది.

Updated Date - Jun 28 , 2026 | 03:40 AM