అదనపు ఆదాయ వనరుల పెంపుపై దృష్టి పెట్టండి
ABN , Publish Date - May 23 , 2026 | 04:41 AM
రాష్ట్ర ఆర్థిక పురోగతిని పరుగులు పెట్టించడం, ఈ ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులూ....
ఆర్థిక వనరుల సమీకరణ క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో భట్టి
ఖజానాకు గండికొట్టేవారిపై కఠినంగా వ్యవహరించండి: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, మే 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక పురోగతిని పరుగులు పెట్టించడం, ఈ ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులూ దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఆయన అధ్యక్షతన ఆర్థిక వనరుల సమీకరణ మంత్రివర్గ ఉప సంఘం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కమిటీ సభ్యులైన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అదనపు ఆదాయ మార్గాల అన్వేషణ, వివిధ శాఖల ప్రగతిపై మంత్రుల బృందం అధికారులతో కలిసి లోతుగా సమీక్షించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్ అంచనాలకనుగుణంగా నిధుల సమీకరణ ఉండాలని భట్టి స్పష్టం చేశారు. బడ్జెట్ లక్ష్యాలను సాధించడానికి అధికారులు లీకేజీలను పూర్తిగా అరికట్టాలని, అందుబాటులో ఉన్న అన్ని రకాల ఆదాయ వనరులనూ పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోవాలని ఆదేశించారు. నిర్దేశించుకున్న గడువు ప్రకారమే ఆదాయాన్ని పెంపొందించడానికి కృషి చేయాలన్నారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ఈ భేటీ ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని క్రమం తప్పకుండా హాజరు కావాలన్నారు. రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్న అక్రమార్కులపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర క్యాబినెట్ గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు.. సవరించిన భూముల మార్కెట్ విలువలు మే 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయని అధికారులు మంత్రులకు వివరించారు. దీని ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. పరిశ్రమల శాఖకు సంబంధించిన ‘హిల్ట్ పాలసీ’ మార్గదర్శకాలు సిద్ధమయ్యాయని, ఈ ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయని తెలిపారు.