నిబంధనలు పాటిస్తేనే క్రషర్లకు అనుమతి
ABN , Publish Date - Jun 20 , 2026 | 04:55 AM
రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చిపెట్టే కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం
హైదరాబాద్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చిపెట్టే కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మన వనరులే మన పెట్టుబడి అని పేర్కొన్నారు. ఆదాయ వనరుల సమీకరణ మంత్రివర్గ ఉప సంఘం శుక్రవారం సచివాలయంలో సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో కలిసి భట్టి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా చట్టపరమైన నిబంధనలు, పర్యావరణ నియమాలను పాటించే క్రషర్లకే ఇకపై అనుమతులు ఇవ్వాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. అలాగే నది ఇసుకతో పోలిస్తే తక్కువ ధరకే లభించే రోబో శాండ్ (ఎమ్-శాండ్) వినియోగాన్ని ప్రోత్సహించాలని కమిటీ భావించింది. పొరుగు రాష్ట్రాలకు ఇసుకను ఎగుమతి చేయడంపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులకు సూచించారు. లోయర్ మానేరు, అప్పర్ మానేరు, మేడిగడ్డ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పూడికతీత పనులను ఈ సందర్భంగా కమిటీ సమీక్షించింది. మరోవైపు, గోవా, కేరళ వంటి రాష్ట్రాల తరహాలో మన రాష్ట్రంలోనూ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి, తద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు రాష్ట్ర జీఎ్‌సడీపీని పెంచాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ముఖ్యంగా టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, హెల్త్ టూరిజం విభాగాల్లో ప్రగతి సాధించాలని, వారాంతాల్లో హెలికాప్టర్ టూరిజాన్ని పెంచేలా చూడాలని అధికారులను ఆదేశించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ పరిధిలో కొత్త పర్యటక ప్రాజెక్టులు చేపట్టాలన్నారు. టూరిజం ఆస్తులను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) మోడల్‌లో అభివృద్ధి చేసి సంపద సృష్టించేందుకు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి క్యాబినెట్‌కు సమర్పించాలని చెప్పారు. రాష్ట్రంలో భూముల విలువల సవరణ చేయడం వల్ల రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని అధికారులు కమిటీకి వివరించారు.