Share News

మేలో ముహూర్తం..! న్నికల టీమ్‌ ఏర్పాటు దిశగా అడుగులు

ABN , Publish Date - Apr 07 , 2026 | 05:41 AM

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణపై కాంగ్రెస్‌ అధిష్ఠానం దృష్టి పెట్టనుందా? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతోపాటు మంత్రుల శాఖల్లోనూ భారీగా మార్పులు చోటు చేసుకోనున్నాయా....

మేలో ముహూర్తం..! న్నికల టీమ్‌ ఏర్పాటు దిశగా అడుగులు

  • ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత రాష్ట్ర క్యాబినెట్‌ పునర్వ్యవస్థీకరణ

  • మంత్రుల శాఖల్లో భారీ మార్పులు.. పలు కీలక శాఖల్లోనూ..

  • ఒకరిద్దరిని తప్పిస్తారని ప్రచారం.. బీసీ కోటాలో డిప్యూటీగా పీసీసీ చీఫ్‌!?

  • పొన్నంకు టీపీసీసీ చీఫ్‌? పార్టీ, ప్రభుత్వ పదవుల్లోనూ భారీ ప్రక్షాళన!

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణపై కాంగ్రెస్‌ అధిష్ఠానం దృష్టి పెట్టనుందా? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతోపాటు మంత్రుల శాఖల్లోనూ భారీగా మార్పులు చోటు చేసుకోనున్నాయా? కొత్త వారికీ చోటు దక్కే అవకాశం ఉందా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి కాంగ్రెస్‌ వర్గాలు. ఆ వర్గాల సమాచారం ప్రకారం.. రాష్ట్ర క్యాబినెట్లోనూ, ప్రభుత్వ, పార్టీ పదవుల్లోనూ మే నెలలో భారీ ప్రక్షాళన చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వినూత్న పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం.. మూసీ ఆధునీకరణ, మెట్రో విస్తరణ తదితర అభివృద్ధి ప్రాజెక్టులను పట్టాలపైకి ఎక్కించాలని భావిస్తోంది. వీటికితోడు సంక్షేమ కార్యక్రమాలపైనా దృష్టి పెట్టింది. ఇక, రాబోయే ఎన్నికలనాటికి తమ ప్రభుత్వ ప్రోగ్రెస్‌ రిపోర్టును ప్రజల ముందు ఉంచాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. గత పదేళ్ల పాలనకు, తమ ఐదేళ్ల పాలనకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజల ముందు ఉంచాలని ఆలోచిస్తోంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను దూకుడుగా ముందుకు తీసుకెళ్లే విషయంలో క్యాబినెట్‌ పాత్ర కీలకమే. దీనికితోడు, అసెంబ్లీ ఎన్నికలకు ఇక రెండున్నరేళ్లే సమయం ఉంది. పోలింగ్‌కు ఏడాది ముందే ఎన్నికల వాతావరణం వచ్చేస్తుంది. అంటే, గట్టిగా పని చేయడానికి ఉన్నది కేవలం ఏడాదిన్నర సమయమే. ఈ నేపథ్యంలో, క్యాబినెట్లో భారీ ప్రక్షాళనకు పూనుకోనున్న అధిష్ఠానం.. ఎన్నికల టీమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెబుతున్నారు. ప్రక్షాళన తర్వాత ఏర్పాటు కానున్న మంత్రివర్గం.. ఎన్నికల వరకూ కొనసాగనుందని తెలుస్తోంది. ప్రభుత్వం చేపట్టనున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత దూకుడుగా, సమర్థంగా నిర్వహించేలా ఈ టీమ్‌ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


భారీ ప్రక్షాళన..!

గడిచిన రెండున్నరేళ్లలో మంత్రుల పనితీరు, వారి శాఖల నిర్వహణలో పురోగతి, పలువురు మంత్రులపై వచ్చిన ఆరోపణలు వంటి అంశాలపై వివిధ మార్గాల్లో అధిష్ఠానం ఇప్పటికే నివేదికలు తెప్పించుకుంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో పునర్వ్యవస్థీకరణను పక్కకు పెట్టింది. ఫలితాల తర్వాత సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులతో అధిష్ఠానం భేటీ కానుంది. పునర్వ్యవస్థీకరణ, శాఖల మార్పులు, ప్రభుత్వ, పార్టీ పదవుల నియామకం తదితర అంశాలపై చర్చించి నిర్ణయానికి రానుంది. క్యాబినెట్‌ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి.. ప్రస్తుత క్యాబినెట్లో కీలక మంత్రుల శాఖలను మార్చి.. వారికి వేరే శాఖలను అప్పగించనున్నట్లు తెలుస్తోంది. పలు కీలక శాఖల మంత్రులు వాటి నిర్వహణలో విఫలమయ్యారన్న అభిప్రాయం అధిష్ఠానంలో ఉంది. అలాగే, పలువురు మంత్రులపై అవినీతి ఆరోపణలు, మరికొందరి తీరు సరిగా లేకపోవడం తదితరాలు ఇప్పటికే తెప్పించుకున్న నివేదికల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రుల శాఖల్లో భారీ మార్పులు ఉండే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వీటిలో పలువురు కీలక మంత్రుల శాఖలూ ఉన్నట్లు తెలుస్తోంది. పనితీరు బాగాలేని ఒకరిద్దరు మంత్రులను తప్పించేందుకూ అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఆ స్థానంలో కొత్తవారికి అవకాశం దక్కుతుంది. ప్రస్తుత మంత్రివర్గంలో ఒక బెర్త్‌ ఖాళీ ఉండగా.. రెడ్డి, ఎస్టీ బంజారా సామాజిక వర్గాల నుంచి దీనికి గట్టి పోటీ నెలకొని ఉంది.


ప్రధానంగా మునుగోడు, ఇబ్రహీంపట్నం, పరిగి ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌ రెడ్డి పోటీ పడుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హమీ మేరకు తనను క్యాబినెట్లోకి తీసుకోవాలంటూ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పలు వేదికలపై మాట్లాడారు. అయితే, నల్లగొండ జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. మరో వైపు, ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి పార్టీ ఎమ్మెల్యే బాలూ నాయక్‌.. ఎస్టీ కోటా, సీనియర్‌ నేత హోదాలో మంత్రి పదవిని ఆశిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్‌గా మహబూబాబాద్‌ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్‌ను అధిష్ఠానం ఎంపిక చేసినా.. ఇంతవరకు ఆ పోస్టుకు ఎన్నిక నిర్వహించలేదు. మంత్రివర్గ విస్తరణలో అదృష్టాన్ని పరీక్షించుకుందామన్న ఆలోచనతోనే ఆయన తన ఎన్నికను వాయిదా వేయించుకున్నట్లు చెబుతున్నారు. ఇక, బీసీ వర్గం నుంచి ఒకరిని డిప్యూటీ సీఎంగా తీసుకునే ఆలోచనను అధిష్ఠానం చేస్తున్నట్లు చెబుతున్నారు. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ను బీసీ కోటాలో డిప్యూటీ సీఎంగా తీసుకునే ప్రతిపాదన ఉన్నట్లుగా జోరుగా ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే.. మంత్రి పొన్నం ప్రభాకర్‌ను పార్టీలోకి తీసుకుని టీపీసీసీ చీఫ్‌ బాధ్యతలు అప్పగించే ప్రతిపాదన ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే, స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న చర్చా ఉంది. అదే జరిగితే, స్పీకర్‌ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారన్నదీ ఆసక్తికరమే. వివిధ కార్పొరేషన్ల చైర్మన్ల నియామకంలోనూ భారీ ప్రక్షాళనే చేపట్టనున్నట్లు తెలుస్తోంది. టీపీసీసీలోనూ ఇంతవరకు కొత్త కార్యనిర్వాహక అధ్యక్షుల నియామకం జరగలేదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అధిష్ఠానం భారీగా ప్రక్షాళన చేపట్టనున్నట్లు చెబుతున్నారు. ఇన్ని సమీకరణల మధ్య అధిష్ఠానం నిర్ణయాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

Updated Date - Apr 07 , 2026 | 06:49 AM