ధరణి అక్రమాలపై సమగ్ర విచారణ
ABN , Publish Date - Jul 18 , 2026 | 05:32 AM
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ‘ధరణి’ పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రత్యేక బృందం ఏర్పాటు.. బాధ్యులు ఎంతటివారైనా కఠిన చర్యలు.. క్యాబినెట్ నిర్ణయం
వర్షాభావంపై పరిశీలనకు బృందాన్ని పంపాలని కేంద్రానికి లేఖ
తాగు, సాగునీరు, విద్యుత్తు, వ్యవసాయంపై ప్రత్యేక కార్యాచరణ
ఎల్‌నినో ప్రభావంపై చిన్నారెడ్డి సారథ్యంలో నివేదిక తయారీ
20న ఉమ్మడి జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో సమావేశాలు
ఇంజనీరింగ్ పనులన్నింటికీ ఇకపై ఏకీకృత టెండర్ల విధానం
మునిసిపల్ కో-ఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్‌జెండర్లకు అవకాశం
పంచాయతీల నిధులు ట్రెజరీలకు బదులు బ్యాంకుల్లో జమ
శంషాబాద్ దగ్గర్లో రైల్ హబ్.. ‘ముక్తేశ్వర్’ పూర్తికి చర్యలు
ధర్మపురి డిగ్రీ కళాశాలకు 29 పోస్టుల మంజూరు
హైదరాబాద్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ‘ధరణి’ పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం వివిధ శాఖల అధికారులు, నిపుణులతో ప్రత్యేక విచారణ బృందాన్ని (ఎస్‌ఈటీ) ఏర్పాటు చేయనుంది. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న దుర్భర పరిస్థితులపై కేంద్రానికి లేఖ రాసి, ఇక్కడి పరిస్థితుల అధ్యయనానికి కేంద్ర బృందాన్ని పంపాల్సిందిగా కోరాలని నిర్ణయించారు. దీంతోపాటు రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, అనుసరించాల్సిన ప్రణాళిక, ఏకీకృత టెండర్లు, పురపాలికల్లో ట్రాన్స్‌జెండర్లకు కో-ఆప్షన్ సభ్యులుగా అవకాశం, పంచాయతీల నిధులను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే అవకాశం వంటి పలు ప్రధాన అంశాలపై మంత్రివర్గం చర్చించి.. నిర్ణయాలు తీసుకుంది. సమావేశం ముగిసిన అనంతరం క్యాబినెట్ నిర్ణయాలను సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావుతో కలిసి మీడియాకు వివరించారు. 2020 అక్టోబరు 29న ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో జరిగిన భూముల రిజిస్ట్రేషన్లు, రికార్డుల మార్పులు, వ్యవసాయ భూములు, అసైన్డ్, ప్రభుత్వ భూముల బదలాయింపులు సహా అనుమానాస్పద లావాదేవీలన్నింటినీ లోతుగా పరిశీలించాలని మంత్రివర్గం నిర్ణయించిందని పొంగులేటి తెలిపారు.
ఇప్పటికే చేపట్టిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో 10 వేలకు పైగా అనుమానాస్పద లావాదేవీలున్నట్లు ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. అందుకే భూముల లావాదేవీలకు సంబంధించిన డిజిటల్ రికార్డులు, లాగిన్ వివరాలు, రికార్డుల్లో చేసిన మార్పులు, అధికారుల అనుమతులు, భూముల వర్గీకరణ మార్పులు, లబ్ధిదారుల వివరాలను సమగ్రంగా పరిశీలించాలని మంత్రివర్గం నిర్ణయించిందని పేర్కొన్నారు. ధరణి నుంచి ప్రస్తుత భూభారతి వరకు ఈ సమగ్ర విచారణ జరుగుతుందని అన్నారు. ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్(ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్)’ పాత్రతో పాటు పోర్టల్ నిర్వహణ సంస్థ ఎంపిక, టెండర్ ప్రక్రియ, వెండర్‌కు కాంట్రాక్టు కేటాయింపు, పోర్టల్ రూపకల్పన, సిస్టమ్ ఆర్కిటెక్చర్, డేటా భద్రతలో ఉన్న లోపాలపై విచారణ జరపాలని క్యాబినెట్ నిర్ణయించిందన్నారు. ధరణిలో పోర్టల్ తర్వాత కొన్ని మాడ్యూల్స్‌ను మార్చి రైతులకు ఉపయోగంగా ఉండేలా తమ ప్రభుత్వం భూభారతిని అమల్లోకి తెచ్చిందన్నారు. అయితే ఆనాటి సాఫ్ట్‌వేర్ రూపకల్పన చేసిన పోర్టల్‌లోని లోపాలతో ఇప్పటికీ అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. అందుకే ధరణి వ్యవహారంలో బాధ్యులు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించిందని చెప్పారు.
కేంద్ర బృందాన్ని ఆహ్వానిద్దాం..
రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపించాలని, ఎల్‌నినో కంటింజెన్సీ ప్రణాళికల అమలుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామన్నారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో దాదాపు 40 శాతం వర్షపాతం లోటు ఉందన్నారు. తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్తు సరఫరాపై వెంటనే ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారని చెప్పారు. రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నందున... అన్ని శాఖలు ముందస్తు చర్యలకు సిద్ధంగా ఉండాల్సిందిగా ఆదేశించారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి.. తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజల ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని మంత్రివర్గం ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఒక్క నిమిషం కూడా విద్యుత్తు కోత లేకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయించిందన్నారు. అందుకు అవసరమైన విద్యుత్తు ఉత్పత్తితో పాటు కొనుగోలుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అన్ని ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు కేటాయించాలని నిర్ణయించామన్నారు. ఎక్కువ నీరు అవసరమయ్యే పంటల సాగును నివారించి, తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు క్యాబినెట్ విజ్ఞప్తి చేసిందని చెప్పారు. దీంతోపాటు ఎల్‌నినో ప్రభావంపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు, సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ చిన్నారెడ్డి సారథ్యంలో వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలతో వ్యవసాయ రంగంపై ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక నివేదికను రూపొందించాల్సిందిగా మంత్రివర్గం సూచించిందని తెలిపారు. అన్ని జిల్లాల్లో క్షేత్ర స్థాయి పరిస్థితులు, వెంటనే చేపట్టాల్సిన చర్యలను తెలుసుకునేందుకు అత్యవసర సమీక్ష సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ నెల 20న ఉమ్మడి జిల్లాల వారీగా జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు చెప్పే విషయాలను పరిగణనలోకి తీసుకుని, పంటలు వేసుకోవాలంటూ రైతులకు క్యాబినెట్ విజ్ఞప్తి చేసిందన్నారు.
ఇక ఏకీకృత టెండర్ల విధానం..
ప్రభుత్వం చేపట్టే ఇంజనీరింగ్ పనుల్లో పరిపాలన అనుమతులతో పోలిస్తే.. అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నట్లు క్యాబినెట్ గుర్తించిందని మంత్రి పొంగులేటి తెలిపారు. అంచనా వ్యయానికి, వాస్తవ వ్యయానికి పొంతన కుదరటం లేదన్నారు. పనులు సకాలంలో పూర్తి కాక, సవరించిన అంచనాలతో పని పూర్తయ్యేవరకు ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరిగిపోతోందని అన్నారు. అందుకే పనుల అప్రైజల్ నుంచి ప్రాజెక్టు ప్రపోజల్, భూసేకరణ, టెండర్లు, బిల్లుల చెల్లింపు వంటి విధివిధానాలన్నింటికీ ఏకీకృత(యూనిఫైడ్) టెండర్ విధానాన్ని రూపొందించాలని క్యాబినెట్ నిర్ణయించిందన్నారు. ఇంజనీరింగ్ టెండర్ల కోసం విధివిధానాలతో ఉన్న జీవో 94లో అవసరమైన మార్పులు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ జీఓను ఆధారంగా చేసుకుని, ఒక్కో శాఖ, ఒక్కో ఇంజనీరింగ్ విభాగం తమకు అనుకూలంగా జీవోలు ఇచ్చి, టెండర్లను ఆహ్వానిస్తున్నాయని, అందుకే రాష్ట్రంలో ఏకీకృత విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించామని వివరించారు. సీఎస్ ఆధ్వర్యంలో వీటన్నింటి సమగ్ర సమీక్షకు ఉన్నతస్థాయి కమిటీ(హై లెవెల్ కమిటీ)ని ఏర్పాటు చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా బిల్లును తయారు చేసి, అసెంబ్లీలో ఆమోదించుకుని, ప్రత్యేక చట్టం చేస్తామన్నారు.
క్యాబినెట్ తీసుకున్న ఇతర నిర్ణయాలు..
రాష్ట్రంలోని మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో ఉన్న ఐదేసి కో-ఆప్షన్ సభ్యుల్లో ఒక పదవిని ట్రాన్స్‌జెండర్లకు కేటాయించాలని నిర్ణయం. ఇందుకోసం తెలంగాణ మునిసిపాలిటీస్ చట్టం-2019ను సవరించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం.
గ్రామపంచాయతీల నిధుల నిర్వహణకుగాను అందే నిధులను ఇకపై ట్రెజరీల్లో కాకుండా.. సమీపంలో ఉన్న జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో జమ చేసుకునేలా ప్రతిపాదించిన సవరణ బిల్లుకు ఆమోదం.
ముక్తేశ్వర్ ఎత్తిపోతల పథకం (చిన్న కాళేశ్వరం)ను పూర్తి చేయడానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం. గోదావరి నదిపై కన్నెపల్లి నుంచి 4.50 టీఎంసీల నీటిని ఎత్తిపోసి మంథని నియోజకవర్గంలో 45 వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు వీలుగా ఈ పథకాన్ని పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయం. ఇప్పటికే పూర్తయిన పనులను అంచనా వేసుకుని, ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన పనులకు ఆమోదం.
హైదరాబాద్ నుంచి ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలకు ప్రతిపాదించిన మూడు హైస్పీడ్ రైల్ (హెచ్‌ఎస్ఆర్) కారిడార్ల అలైన్‌మెంట్లు, స్టేషన్ల స్థానాలను ఆర్‌అండ్‌బీ విభాగం రాష్ట్ర క్యాబినెట్‌కు వివరించిందని మంత్రి పొంగులేటి తెలిపారు. శంషాబాద్ సమీపంలో రైల్ హబ్‌ను ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయించిందన్నారు. హైదరాబాద్-పుణె-ముంబైకి ఒక రూట్, హైదరాబాద్-బెంగుళూరుకు మరో రూట్, హైదరాబాద్-అమరావతి-తిరుపతి-చెన్నై ఇంకో రూట్ బుల్లెట్ రైళ్లకు కేంద్రం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ నియోజకవర్గమైన ధర్మపురిలోని డిగ్రీ కాలేజీకి 29 పోస్టులను మంజూరు చేస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపిందని పొంగులేటి పేర్కొన్నారు.