Share News

Telangana Cabinet Meeting: మేడారంలో రేపు క్యాబినెట్‌ భేటీ

ABN , Publish Date - Jan 17 , 2026 | 06:16 AM

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన ములుగు జిల్లా మేడారంలో ఈనెల 18న క్యాబినెట్‌ సమావేశం కానుంది.

Telangana Cabinet Meeting: మేడారంలో రేపు క్యాబినెట్‌ భేటీ

  • జాతర ఏర్పాట్లు, కీలక పథకాలపై చర్చ

  • ఆ రోజు రాత్రి అక్కడే బస.. 19న అభివృద్ధి పనుల ప్రారంభం

హైదరాబాద్‌/వరంగల్‌/సిరిసిల్ల, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన ములుగు జిల్లా మేడారంలో ఈనెల 18న క్యాబినెట్‌ సమావేశం కానుంది. సమ్మక్క-సారలమ్మ జాతరను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం.. అక్కడక్యాబినెట్‌ భేటీ నిర్వహించి గిరిజన సంక్షేమం పట్ల తన నిబద్ధతను చాటుకోవాలనుకుటోంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు మేడారంలోని హరిత హోటల్‌లో ఈ సమావేశం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. జాతరకు జాతీయ హోదా సాధించడం, నిధుల విడుదల, భక్తుల సౌకర్యాలపై క్యాబినెట్‌లో ప్రధానంగా చర్చించనున్నారు. అంతేకాకుండా చిన్న కాళేశ్వరం (ముక్తేశ్వర్‌) ఎత్తిపోతల పథకం సవరణ అంచనాలపై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మునిసిపల్‌ ఎన్నికల కోసం బీసీ కమిషన్‌ ఖరారు చేసిన రిజర్వేషన్లకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర బడ్జెట్‌పై సమీక్షతో పాటు ‘రైతు భరోసా’, ఆరు గ్యారెంటీల అమలు పురోగతిపై సమీక్షించనున్నారు. ఖమ్మం జిల్లా పాలేరులో 18న జరిగే కాంగ్రెస్‌ సభ, ఖమ్మం జిల్లా కేంద్రంలో జరుగనున్న సీపీఐ శతాబ్ది ఉత్సవాల వేడుకల్లో పాల్గొని సాయంత్రం 4 గంటలకు రేవంత్‌రెడ్డి మేడారం చేరుకోనున్నారు. క్యాబినెట్‌ భేటీ ముగిశాక స్థానిక గిరిజన నేతలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. అనంతరం రాత్రి అక్కడే బసచేసి, 19న ఉదయం అమ్మవార్లను దర్శించుకుని అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. అనంతరం హైదరాబాద్‌ చేరుకుని అదేరోజు సాయంత్రం దావోస్‌ పర్యటనకు బయలుదేరనున్నారు.


ఏర్పాట్లను పరిశీలించిన సీతక్క

క్యాబినెట్‌ భేటీకి జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి సీతక్క శుక్రవారం పరిశీలించారు. ములుగు జిల్లా కలెక్టర్‌ టీఎస్‌ దివాకర, ఎస్పీ సుధీర్‌ రామ్‌నాథ్‌ కేకన్‌లతో సీతక్క దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అలాగర మంత్రి సీతక్క శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని భీమేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, కోడె మొక్కు చెల్లించుకున్నారు. వేములవాడలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆమె వెంట ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jan 17 , 2026 | 06:16 AM