Share News

శాఖల్లోని భూములు టీజీఐఐసీకి బదిలీ?

ABN , Publish Date - Aug 14 , 2026 | 05:53 AM

ప్రభుత్వ శాఖల పరిధిలోని భూములను టీజీఐఐసీ (తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌)కి బదిలీ చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది.

శాఖల్లోని భూములు టీజీఐఐసీకి బదిలీ?

  • ఇప్పటికే భూ వివరాలతో ప్రభుత్వానికి నివేదిక

  • పాలిటెక్నిక్‌ కాలేజీలూ ‘శక్తి’ డిపార్ట్‌మెంట్‌ పరిధిలోకే

  • నేడు క్యాబినెట్‌ భేటీలో చర్చించే అవకాశం

హైదరాబాద్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ శాఖల పరిధిలోని భూములను టీజీఐఐసీ (తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌)కి బదిలీ చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే, వివిధ శాఖల కింద ఉన్న నిరుపయోగ భూములన్నింటినీ టీజీఐఐసీ పరిధిలోకి తీసుకురానుంది. తద్వారా పారిశ్రామిక అవసరాలు, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన భూములను నేరుగా టీజీఐఐసీ నుంచే కేటాయించుకునేందుకు వీలుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖల పరిధిలో ఎన్ని భూములు ఉన్నాయి? వాటిని ఏ అవసరాలకైనా వాడుతున్నారా? ఎవరికైనా లీజుకు ఇచ్చారా? అనే వివరాలను ప్రభుత్వం ఆరా తీసినట్లు తెలిసింది. వ్యవసాయ శాఖ సమీక్షలోనూ ఆ శాఖకు అనుబంధంగా ఉన్న విభాగాలన్నింటిలో ఉన్న భూముల వివరాలను ప్రభుత్వానికి నివేదించాలంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం సీఎం రేవంత్‌ అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ భూములను టీజీఐఐసీకి కేటాయించే అంశంపై చర్చించి, ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం విద్యా శాఖ పరిధిలో ఉన్న పాలిటెక్నిక్‌ కాలేజీలను ‘శక్తి’ (స్కిల్‌ హ్యూమన్‌ క్యాపిటల్‌ అండ్‌ నాలెడ్జ్‌ ట్రైనింగ్‌ ఇనీషియేటివ్స్‌) శాఖ పరిఽధిలోకి తీసుకొచ్చే అంశంపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ, ఏటీసీ, ఐటీఐలను కూడా ఇప్పటికే శక్తి శాఖ కిందకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. పాలిటెక్నిక్‌ కాలేజీలను ఈ శాఖ కిందకు తీసుకువస్తే ఈ ఇనిస్టిట్యూషన్స్‌ అన్నీ ఒకే గొడుగు కింద ఉంటాయని, తద్వారా వాటి అభివృద్ధికి త్వరితగతిని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.


ఆ రెండు ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు

రాష్ట్రంలోని గూడెందొడ్డి, గట్టు ఎత్తిపోతల పథకాల సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకునేలా క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నారు. గూడెందొడ్డి సామర్థ్యం పెంపుపై సమగ్ర అధ్యయనం చేసేందుకు కన్సల్టెన్సీని నియమించే అంశంపైనా క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారంతోపాటు సుందిళ్లలోనూ లోపాలున్నాయని తేలిందని బుధవారం సీఎం రేవంత్‌ నిర్వహించిన నీటి పారుదల శాఖ సమీక్షలో మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. ఈ అంశంపై క్యాబినెట్‌లో కీలకంగా చర్చించనున్నారని తెలిసింది. కాగా రాష్ట్రంలో ధాన్యం ఎక్కువగా పండే నిజామాబాద్‌, నల్గొండ, సూర్యాపేట, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో సైలో బ్యాగ్‌ నిర్మాణాల కోసం మహిళా సంఘాలకు భూములను కేటాయించే అంశంపైనా నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే మెట్రో ఫేజ్‌-1 స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణ, రెండో దశ విస్తరణ అంశాలపై చర్చించనున్నారు. చట్టసభల్లోకి వెళ్లేందుకు వయసు తగ్గింపు, నిషేధిత భూముల అంశానికి చెందిన 22ఏ, అసెంబ్లీ సమావేశాల నిర్వహణతోపాటు మరికొన్ని అంశాలు క్యాబినెట్‌లో చర్చకు రానున్నాయని తెలిసింది.

Updated Date - Aug 14 , 2026 | 05:55 AM