క్యాబినెట్ ఎజెండా.. ఇక డిజిటల్
ABN , Publish Date - Jun 16 , 2026 | 05:12 AM
పరిపాలనలో సాంకేతికత వినియోగాన్ని కొత్తపుంతలు తొక్కించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే కొంత మేర సాంకేతికతను వినియోగిస్తుండగా...
మంత్రి మండలి భేటీల్లో సాంకేతికత
‘క్యాబినెట్’ పేరుతో యాప్ లేదా ప్రత్యేక విధానం రూపకల్పన
డిజిటల్ రూపంలో మంత్రులకు ఎజెండాలు
హైదరాబాద్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): పరిపాలనలో సాంకేతికత వినియోగాన్ని కొత్తపుంతలు తొక్కించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే కొంత మేర సాంకేతికతను వినియోగిస్తుండగా.. దానిని క్యాబినెట్ సమావేశాల నిర్వహణలో కూడా ఉపయోగించుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందులో భాగంగా క్యాబినెట్ సమావేశాలను ఇకపై ఈ- ఫైలింగ్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం ‘క్యాబినెట్’ పేరుతో ఒక యాప్‌ను రూపొందించటం లేదా మరో ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని భావిస్తున్నారు. ఈ నెల 18న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగనున్నట్లు తెలిసింది. ఆ భేటీ నుంచే ఈ- ఫైలింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇప్పటివరకు 35 క్యాబినెట్ సమావేశాలు జరిగాయి.
డిజిటల్ రూపంలో ఎజెండాలు.!
క్యాబినెట్ సమావేశాల సమయంలో మంత్రులకు ‘అత్యంత రహస్యం’అని పేర్కొంటూ ఎజెండా పేపర్లను సీల్డ్ కవర్‌లో ఉంచి అందిస్తున్నారు. వాటిని సమావేశానికి వెళ్లిన తరువాత మాత్రమే తెరుస్తారు. సమావేశంలో వాటిపై చర్చించిన తరువాత ఆ పేపర్లను అధికారులు తీసుకుంటారు. ఇక నుంచి అలా కాకుండా డిజిటల్ ఫైలింగ్ విధానంలో మంత్రులకు ఎజెండాలను అందిస్తారు. సమావేశానికి వెళ్లే ముందే ఎజెండా మంత్రులకు చేరుతుంది. సమావేశం సమయంలో వాటిని చూసేందుకు అవకాశం ఉంటుంది. డిజిటల్‌గా ఎజెండాలను ఓపెన్ చేసేందుకు ప్రత్యేక లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఇస్తారు. అయితే, ఈ- ఫైలింగ్ కోసం ప్రత్యేక యాప్‌ను తీసుకురావాలా లేదంటే మంత్రుల పేరుతో కొత్త మెయిల్ ఐడీలను తయారుచేసి వాటికి ఫైళ్లను పంపాలా, మరో కొత్త విధానాన్ని రూపొందించాలా? అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇందుకోసం ఇప్పటికే ఈ విధానాలను అమలుచేస్తున్న పలు రాష్ట్రాల నుంచి వివరాలు సేకస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ సమావేశాల్లో మంత్రులకు ట్యాబ్‌లను ఇచ్చి, వాటికే క్యాబినెట్ ఫైళ్లను పంపుతున్నట్లు సమాచారం. ఏపీలోనూ సీఎం సహా మంత్రులంతా ట్యాబ్‌లు, ఈ - గవర్నెన్స్ విధానాన్నే అనుసరిస్తున్నట్టు తెలిసింది. ఆ బాటలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా నడవాలని నిర్ణయించింది. క్యాబినెట్ ఎజెండాలు, నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లన్నింటినీ డిజిటల్ రూపంలో భద్రపరిచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
తుమ్మిడిహెట్టి, మెట్రో రైలే కీలకాంశాలు..
18న జరిగే క్యాబినెట్ సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశను ప్రభుత్వం టేకోవర్ చేసుకునే అంశంపై చర్చించనున్నారు. రెండో దశకు అనుమతి రావాలంటే మొదటి దశను ప్రభుత్వం టేకోవర్ చేసుకోవాల్సి ఉంది. అందుకు సంబంఽధించిన వ్యవహారాలన్నీ పూర్తవ్వగా, చివరి దశలో కేంద్రం తిరకాసుతో టేకోవర్ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో రెండో దశ నిర్మాణం, మొదటి దశ టేకోవర్ అంశాలపై క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వానాకాలం సీజన్ సాగు అంశాలతోపాటు సాగునీటి ప్రాజెక్టుల గురించి కూడా చర్చించనున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి అనుమతి సాధించే విషయంపై ప్రధానంగా చర్చిస్తారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలపైనా చర్చించనున్నట్టు తెలిసింది. జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిన నేపథ్యంలో మూడింటికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలా? వేర్వేరుగా నిర్వహించాలా అనే అంశంపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపైనా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరిన్ని కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.