మార్చి 16 నుంచి అసెంబ్లీ...20న బడ్జెట్
ABN , Publish Date - Feb 24 , 2026 | 05:30 AM
శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 16 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే నెల 20న 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి త్వరలో స్పెషల్ డ్రైవ్
మార్చి 1లోపు ఎల్‌అండ్‌టీ నుంచి మెట్రోరైలు స్వాధీనం
22 శాతం తగ్గింపు ధరకు స్వాధీనం చేసుకోనున్న సర్కారు
హెచ్‌ఎండీఏ పరిధిలోకి కొత్తగా నాలుగు గ్రామాలు
జీహెచ్‌ఎంసీ పరిధిలో రోడ్ల నిర్వహణకు 3145 కోట్లు
మంజీరా నీటి సరఫరా పథకానికి రూ.722 కోట్లు
కోర్ అర్బన్‌లో ప్రకటనల పాలసీకి ఆమోదం
కోహెడలో పండ్ల మార్కెట్‌కు 223 ఎకరాలు
ప్రభుత్వ కార్యాలయాలు, సహకార బ్యాంకులు, టీజీవో, రాజకీయ పార్టీల కార్యాలయాలకు భూ కేటాయింపులు
ఇంజనీరింగ్ కాలేజీలు, దేవాలయాలు, భూములు కోల్పోయిన నిర్వాసితులకు కూడా..
డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌గా టీవీవీపీ మార్పు
వివిధ శాఖలకు కొత్తగా 573 పోస్టుల మంజూరు
డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టుల అప్‌గ్రెడేషన్..రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 16 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే నెల 20న 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలోకి నాలుగు గ్రామాలు.. కోర్ అర్బన్‌లో ప్రకటన పాలసీకి ఆమోదం. నియోపోలిస్ ప్రాంతంలో తాగునీటి మౌలిక వసతుల కల్పన.. హైదరాబాద్ మహానగరంలో రహదారుల నిర్వహణకు రూ.3145 కోట్ల నిధుల కేటాయింపు. పండ్ల మార్కెట్లకు, ఇంజనీరింగ్ కళాశాలల నిర్మాణానికి, దేవాలయాలకు, రాజకీయ పార్టీల కార్యాలయాలకు, భూములు కోల్పోయిన నిర్వాసితులకు భూములు కేటాయిపు. ఇలాంటి పలు కీలక నిర్ణయాలను రాష్ట్ర మంత్రివర్గం సోమవారం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో సమావేశమైన మంత్రివర్గం పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశం అనంతరం ఈ వివరాలను సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి మీడియాకు వెల్లడించారు.
22 శాతం తగ్గింపు ధరకు మెట్రో స్వాధీనం..
హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందని, ప్రస్తుతం ఉన్న 69 కిలోమీటర్ల మెట్రో వ్యవస్థను ఎల్‌అండ్‌టీ సంస్థ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించిందని మంత్రి పొంగులేటి తెలిపారు. వెంటనే అందుకు అవసరమైన చర్యలు ప్రారంభించేలా నిర్ణయం తీసుకుంటామన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ స్వాధీనం, సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. సబ్ కమిటీ ఇచ్చిన నివేదికపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. అవసరమైతే రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ అంశంపై చర్చించాలని నిర్ణయించింది. స్వాధీనానికి సంబంధించి రుణభారం సహా మొత్తం రూ.15 వేల కోట్లను ప్రభుత్వం ఎల్‌అండ్‌టీకి చెల్లించి ఫేజ్-1 ప్రాజెక్టు స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంటూ సబ్ కమిటీ తమ నివేదికను క్యాబినెట్ ముందుంచిందని మంత్రి పేర్కొన్నారు. స్వాధీనం ప్రక్రియ అంతా మార్చి-1లోపు పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం మెట్రో ఆస్తుల విలువ దాదాపు రూ.19 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశామని, దాదాపు 22 శాతం తగ్గింపు ధరకు ప్రభుత్వం మెట్రో ఫేజ్-1 ను సొంతం చేసుకుంటుందని తెలిపారు. ఇక మెట్రో ఫేజ్-2 విస్తరణ పనులను వేగంగా ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టనున్న రెండోవిడత విస్తరణకు మొత్తం మెట్రో నెట్‌వర్క్ ఒకే సంస్థ ఆధ్వర్యంలో ఉండాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మెట్రో ఫేజ్-1 నిర్వహిస్తున్న ఎల్‌అండ్‌టీ మెట్రో ఫేజ్-2 విస్తరణ చేపట్టేందుకు విముఖత ప్రదర్శించింది. మెట్రో ఫేజ్-2లో భాగంగా 5 కొత్త కారిడార్లలో 76.4 కిలోమీటర్లు, ఫేజ్-2లో 3 కారిడార్లలో 86.1 కి.మీ.ల మెట్రో విస్తరణ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి పంపించింది. తాజాగా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంతో మెట్రో విస్తరణ వేగవంతం కానుంది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం..
క్యూర్ ఏరియాలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వద్ద నిర్మించిన షాపులను వేలం వేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రాంతాల్లోనూ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టుకోవడానికి ప్రయత్నించాలని చర్చించింది. దీంతోపాటు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా 300 మెగావాట్ల విద్యుత్తు వినియోగించే డేటా సెంటర్లకు రెన్యువబుల్ ఎనర్జీ డిస్ర్టిబ్యూషన్ లైసెన్స్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటికే హడ్కో నుంచి తీసుకున్న రూ.5వేల కోట్లు రుణం తీసుకోవాలన్న ప్రతిపాదననూ ఆమోదించింది. ఇక కరీంనగర్ జిల్లా మహదేవ్‌పూర్ మండలం కన్నెపల్లి గ్రామ సమీపంలోని గోదావరి నుంచి 4.5 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు ఉద్దేశించిన ముక్తేశ్వర ఎత్తిపోతల పథకానికి మొత్తం రూ.1657 కోట్లు ఖర్చవుతాయన్న అంచనాలను ఆమోదించింది. ఇందులో ఈపీసీ కింద 1251 కోట్ల పనులకు కొత్తగా టెండర్లు పిలవాలని నిర్ణయించింది.
క్యాబినెట్ ఆమోదించిన నిర్ణయాలు..
అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొహెడ గ్రామంలో ప్రంచస్థాయి పండ్ల మార్కెట్ నిర్మాణం కోసం 223 ఎకరాల భూమి కేటాయింపు.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి గ్రామంలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం కోసం సర్వే నంబరు 840లో 3.12 ఎకరాలు కేటాయింపు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వరంగల్ జిల్లా సహకార బ్యాంకు, ఘనపూర్ బ్రాంచ్ నిర్మాణం కోసం ఘనపూర్ గ్రామం సర్వే నంబరు 750/1లో 413 గజాల స్థలం కేటాయింపు.
భూపాలపల్లి బ్రాంచ్ నిర్మాణం కోసం కొంపల్లి గ్రామం, సర్వే నంబరు 170లో 500 గజాల కేటాయింపు.
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు జీవో నంబరు 167 ప్రకారం భూ కేటాయింపులకు క్యాబినెట్ పచ్చజెండా ఊపింది.
కోకాపేటలో మెట్రో వాటర్ వర్క్స్ విభాగం చేపట్టే మౌలిక వసతుల నిర్మాణాలకు భూ బదలాయింపు.
సైదాబాద్ మండలం గడ్డి అన్నారంలో టీజీవో కార్యాలయ నిర్మాణం కోసం 600 గజాల సలం కేటాయింపు.
విశాఖ ఇండస్ర్టీస్‌కు నల్లగొండ జిల్లా కుక్కడం గ్రామంలో 1.36 ఎకరాల స్థలం కేటాయింపు.
మెదక్ జిల్లా శెట్టిపల్లి కలాన్‌లో ఎల్దుర్తి వ్యవసాయ సహకార సంఘం తరపున రైస్‌మిల్లు, గోదాము నిర్మాణం కోసం 5 ఎకరాల కేటాయింపు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో కోల్పోతున్న రక్షణ భూములు 42 ఎకరాలకు ప్రత్యామ్నాయంగా కాప్రా మండలం జవహర్‌నగర్‌లో 153 ఎకరాల కేటాయింపు.
శంషాబాద్ మండలంలో టీజీఐఐసీకి, భూముల కోల్పోయిన నిర్వాసితుల కోసం భూముల కేటాయింపు.
మహబూబాబాద్‌లో జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం కోసం 70 ఎకరాల కేటాయింపు.
ఖమ్మం జిల్లా దామసాలపురం గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించే వేంకటేశ్వర స్వామి ఆలయం కోసం 20 ఎకరాలు.
నల్లగొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, మెదక్, నిజామాబాద్, భద్రాది కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల్లో 21 సమీకృత రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవనాల నిర్మాణం కోసం అవసరమైన భూముల కేటాయింపు.
రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో పురపాలక శాఖ, పర్యాటక శాఖ, హోంశాఖలకు కేటాయించిన భూములను మూసీ రివర్‌ఫ్రంట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు బదలాయింపు.
శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం కోసం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్‌లో 36 ఎకరాల కేటాయింపు.
శామీర్‌పేట మండలం, తూముకుంటలో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ కోసం 8 ఎకరాలు.
ఎన్‌హెచ్ కార్యాలయం నిర్మాణం కోసం ఖైరతాబాద్‌లో ఎకరం, హెచ్‌ఎండీఏ రిసోర్స్ మొబిలైజేషన్ కోసం కొండాపూర్‌లో 17 ఎకరాలు, హకీంపేట్‌లో 8.10 ఎకరాల కేటాయింపు.
నిమ్స్ విస్తరణలో భూమి కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా ఇంటి స్థలాల కేటాయింపు.
కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గ్రీన్‌ఫీల్డ్ మినీ స్టేడియం నిర్మాణం కోసం 5 ఎకరాల కేటాయింపు.
హెచ్‌ఎండీఏ పరిధిలోకి నాలుగు గ్రామాలు..
హెచ్‌ఎండీఏ పరిధిలోకి కొత్తగా నాలుగు గ్రామాల (వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలంలోని యవాపూర్, చిట్టిగూడ, మోమిన్‌పేట మండలంలోని టేకులపల్లి, ఎన్కతల)ను చేరుస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీలో రహదారుల నిర్వహణకు రూ.3145 కోట్ల (సీఆర్‌ఎంపీ రెండో దశ) పాలనా అనుమతులకు ఆమోదం, మంజీరా వాటర్ సప్లై పథకం కోసం రూ.722 కోట్ల పరిపాలనా అనుమతులకు పచ్చజెండా ఊపింది. దీంతోపాటు కోర్ అర్బన్ ప్రాంతంలో ప్రకటనల ద్వారా ఆదాయాన్ని రాబట్టుకునేందుకు జీహెచ్‌ఎంసీ ప్రతిపాదించిన నూతన ప్రకటనల పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
క్యాబినెట్ ఆమోదించిన కొత్త పోస్టుల వివరాలు..
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఇటీవల కొత్తగా 14 నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేశారు. వీటికి ఒక్కోదానికి 31 చొప్పున వివిధ క్యాటగిరీల్లో కలిపి 434 పోస్టుల మంజూరును క్యాబినెట్ ఆమోదం.
శాసనసభ సచివాలయంలో వివిధ క్యాటగిరీలకు సంబంధించి 9 కొత్త పోస్టుల మంజూరు.
పురపాలక-పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజీ బోర్డు(హెచ్‌ఎండబ్ల్యూఎ్‌సఎ్‌సబీ)కు 130 మేనేజర్ పోస్టుల మంజూరు. వీటిని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
రాష్ట్ర ఆర్థిక శాఖ పరిధిలోని వర్క్స్ అకౌంట్స్ విభాగంలో 27 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టులను డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్-1గా అప్‌గ్రేడ్
మూడు కార్పొరేషన్లకు సమ్మతి..
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) పరిధిలోని ప్రాంతాలను మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం అఽధికారిక ముద్ర వేసింది. ఈ నెల 11న జారీ చేసిన ఉత్తర్వుల (జీఓ-55)కు మంత్రివర్గం సమ్మతి తెలిపింది. ఆరు జోన్లు, 30 సర్కిళ్లు, 150 వార్డులతో నూతన జీహెచ్‌ఎంసీ, మూడు జోన్లు, 15 సర్కిళ్లు, 76 వార్డులతో సైబరాబాద్, మూడు జోన్లు, 15 సర్కిళ్లు 74 వార్డులతో మల్కాజ్‌గిరి మునిసిపల్ కార్పొరేషన్‌లను ఏర్పాటు చేస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయానికి సోమవారం మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
టీవీవీపీకి డైరెక్టరేట్ హోదా..
తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌కేర్ (డీఎ్‌సహెచ్)గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డీఎ్‌సహెచ్ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఇన్నాళ్లూ అటానమస్ వ్యవస్థగా ఉన్న టీవీవీపీకి ప్రభుత్వ విభాగం హోదా లభించనుంది. ఉమ్మడి రాష్ట్రంలో 1986లో అటానమస్ బాడీగా ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఏర్పడింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ వైద్య విధాన పరిషత్‌గా పేరు మార్చారు. ప్రస్తుతం టీవీవీపీ పరిధిలో కమ్యునిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటళ్లు, జిల్లా హాస్పిటళ్లు కలిపి మొత్తంగా 184 హాస్పిటళ్లు పనిచేస్తున్నాయి.
573 కొత్త పోస్టులకు ఆమోదం
రాష్ట్రంలోని వివిధ శాఖల్లో కలిపి కొత్తగా 573 పోస్టుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరో 27 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను అప్‌గ్రేడ్ చేసింది.
సీఆర్‌ఎంపీ ఫేజ్-2కు గ్రీన్‌సిగ్నల్!
మహానగరంలో రహదారుల నిర్మాణం, మెరుగైన నిర్వహణకు ఉద్దేశించిన సమగ్ర రహదారుల నిర్వహణ కార్యక్రమం (సీఆర్‌ఎంపీ) ఫేజ్-2కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.3145 కోట్లతో 1142.54 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం, నిర్వహణకు ప్రతిపాదనలు రూపొందించారు. ఇందులో మొదటి దశలోని 744.220 కి.మీలతోపాటు.. కొత్తగా 398.32 కి.మీలను చేర్చారు. ఇక వాటర్‌బోర్డుకు రూ.1004 కోట్ల పనులకు రాష్ట్ర క్యాబినెట్ అనుమతులిచ్చింది. మంజీరా ఫేజ్-1, ఫేజ్-2ను ఆధునీకరణ చేయడానికి రూ.722కోట్ల పనులకు, గండిపేట కాండూట్ పునరుద్దరణకు రూ.282కోట్ల పనులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది.