Share News

వీబీ జీ రామ్‌జీకి ఆమోదం

ABN , Publish Date - Jul 03 , 2026 | 06:06 AM

యూపీఏ ప్రభుత్వం అప్పట్లో ప్రవేశపెట్టిన ‘మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం’ స్థానంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వికసిత్‌ భారత్‌ - గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవికా మిషన్‌ గ్రామీణ్‌..

వీబీ జీ రామ్‌జీకి ఆమోదం

  • కానీ.. రాష్ట్ర హక్కుల పరిరక్షణకు న్యాయ పోరాటం

  • కేంద్రం ఒంటెత్తు పోకడతో దీనిని తీసుకొచ్చింది

  • గత్యంతరం లేక, కూలీలకు ఉపాధి కల్పించే యోచనతో

  • రాష్ట్రంలోనూ వీబీ జీరామ్‌జీ అమలుకు నోటిఫికేషన్‌

  • టీచర్లు, లెక్చరర్లు, సిబ్బందికీ మధ్యాహ్న భోజనం, అల్పాహారం

  • టిమ్స్‌, వరంగల్‌ ఆస్పత్రులకు 6,278 పోస్టుల మంజూరు

  • మూసీ ఫేజ్‌1కు రూ.7,345 కోట్లతో పాలన అనుమతులు

  • 2 జవహర్‌ నవోదయ విద్యాలయాలకు భూకేటాయింపులు

  • డిస్కమ్‌లు పీఎఫ్‌సీ నుంచి తీసుకునే రూ.9 వేల కోట్ల రుణానికి పూచీకత్తు ఇవ్వడానికి ప్రభుత్వం సమ్మతి

  • సింగరేణి, రాజస్థాన్‌ విద్యుత్‌ సంస్థల ఉమ్మడి వెంచర్‌కు ఓకే

  • ఆదిలాబాద్‌, ములుగులో కాంగ్రెస్‌ పార్టీ ఆఫీసులకు స్థలాలు

  • సీఎం రేవంత్‌ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ భేటీలో నిర్ణయం

హైదరాబాద్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): యూపీఏ ప్రభుత్వం అప్పట్లో ప్రవేశపెట్టిన ‘మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం’ స్థానంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వికసిత్‌ భారత్‌ - గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవికా మిషన్‌ గ్రామీణ్‌(వీబీజీ-రామ్‌జీ)’ పథకంపై సుప్రీం కోర్టు తలుపు తట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 1 నుంచి అమల్లోకి తెచ్చిన ఈ పథకాన్ని రాష్ట్రంలోనూ అమలు చేయడానికి నోటిఫికేషన్‌ ఇవ్వాలని నిర్ణయిస్తూనే.. న్యాయపరంగా పోరాడాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.సాయంత్రం 4 గంటల నుంచి సుదీర్ఘంగా సాగిన క్యాబినెట్‌ భేటీలో పలు అంశాలపై చర్చించారు. అనంతరం.. క్యాబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి మంత్రులు పొంగులేటి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎమ్మెల్సీ శంకర్‌ నాయక్‌.. మీడియాకు వెల్లడించారు.


గతంలో మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం కూలీలకు ఉపాధి భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో, అన్ని రాష్ట్రాలూ ఆమోదించేలా దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తే.. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు, పేదవాళ్లు, కూలీల అభిప్రాయాలకు భిన్నంగా ఆ పథకం పేరును ‘వీబీజీ-రామ్‌జీ’గా మార్చి.. ఎవరెన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా ఒంటెత్తు పోకడతో ఈ నెల 1 నుంచి అమలు చేస్తోందన్నారు. పేదల హక్కులను హరించే విధంగా తీసుకొచ్చిన ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రప్రభుత్వం ఈ ఏడాది జనవరిలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపించిందని.. ‘ఉపాధి హామీ’ పథకంలో మార్పులు చేయొద్దని కేంద్రాన్ని కోరిందని గుర్తుచేశారు. అయినప్పటికీ.. ఒక్క లైను, ఫుల్‌ స్టాప్‌, ఒక్క కామా కూడా మార్చకుండా కేంద్రం ‘వీబీజీ-రామ్‌జీ’ పథకాన్ని అమల్లోకి తెచ్చిందని ధ్వజమెత్తారు. ఈ చట్టంలో పొందుపర్చిన నిబంధనలపై మంత్రివర్గం నిరసన తెలిపిందని.. దీనిపై అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం మంత్రి ఉత్తమ్‌ అధ్యక్షతన ఒక క్యాబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని మోపేలా సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా, ఏకపక్షంగా వీబీజీ-రామ్‌జీ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని క్యాబినెట్‌ సబ్‌ కమిటీ వెల్లడించిందన్నారు. కమిటీ చేసిన పలు సిఫారసులపై మంత్రివర్గం చర్చించిందని.. ఇతర రాష్ట్రాలన్నీ ఈ కొత్త చట్టానికి ఆమోదం తెలిపాయా లేదా అనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకుందని వెల్లడించారు. అన్ని రాష్ట్రాలూ ఈ కొత్త చట్టం అమలుకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారని వివరించారు. గత్యంతరం లేని పరిస్థితిలో ఉపాధి హామీ కూలీలకు పని కల్పించే ఆలోచనతో... ఈ కొత్త చట్టాన్ని 2026 జూలై 1 నుంచి రాష్ట్రంలో అమల్లోకి తెచ్చేందుకు నోటిఫికేషన్‌ జారీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. అదేసమయంలో.. రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడానికి న్యాయపరంగా పోరాటం చేయాలని, కొత్త చట్టంలో విధించిన నిబంధనలపై సుప్రీం కోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుందని చెప్పారు. పార్లమెంట్‌లోనూ కేంద్రం తీరును నిలదీయాలని క్యాబినెట్‌ నిర్ణయించిందన్నారు.


క్యాబినెట్‌ ఇతర నిర్ణయాలు

  • రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో అందించే అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి కూడా అందించాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. దాదాపు లక్షన్నర మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి పథకాన్ని వర్తింపజేయనుంది.

  • కొత్తగా అందుబాటులోకి వస్తున్న టిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో పెద్దఎత్తున నియామకాలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. సనత్‌నగర్‌, ఎల్‌.బి.నగర్‌, అల్వాల్‌ టిమ్స్‌తో పాటు వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో డాక్టర్లు, వైద్య సిబ్బంది పోస్టులను మంజూరు చేసింది. రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు వీలుగా మొత్తం 6,278 పోస్టుల మంజూరుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందులో 1,494 రెగ్యులర్‌ పోస్టులు, 549 కాంట్రాక్ట్‌ పోస్టులు, 4,235 ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులకు అనుమతించారు. ఈ ఆస్పత్రులను నిమ్స్‌ తరహాలో అభివృద్ధి చేయాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. ఇక్కడ అందించే వైద్య సేవలకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి ఎల్‌వోసీ(లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌)లను కూడా ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.

  • మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టులో భాగంగా ఫేజ్‌-1 పనులకు మంత్రివర్గం పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. తొలి దశలో 21 కిలోమీటర్ల పొడవున అభివృద్ధికి రూ.7,345.12 కోట్ల విలువైన పనుల మంజూరుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. హిమాయత్‌సాగర్‌ నుంచి ఈసీ... ఉస్మాన్‌సాగర్‌ నుంచి మూసీ నదుల ప్రవాహాలు ప్రారంభమయ్యే చోటు నుంచి బాపు ఘాట్‌ వరకూ ఈ పనులను చేపడతారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ పనులు, నిర్వహణ కోసం నూతనంగా 147 పోస్టులను సృష్టించడంతో పాటు ఇతర శాఖల నుంచి అవసరమైన సిబ్బంది డిప్యూటేషన్‌కు రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే.. ఈ ప్రాజెక్టు చేపట్టడానికి రూ.4500 కోట్ల రుణాన్ని ఆసియన్‌ డెవల్‌పమెంట్‌ బ్యాంకు నుంచి తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. 2027 డిసెంబరుకల్లా తొలిదశ పనులు పూర్తిచేయాలని నిర్ణయం తీసుకుంది.


  • వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం బొల్లికుంట గ్రామంలో నిత్యావసర వస్తువుల గోదాముల నిర్మాణానికి 50 ఎకరాలను, రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండలం కర్కాలపహాడ్‌ గ్రామంలో 10 ఎకరాలను తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు మార్కెట్‌ రేట్‌ ప్రకారం కేటాయించేందుకు ఆమోదం తెలిపింది.

  • జవహర్‌ నవోదయ విద్యాలయాలకు రెండు చోట్ల ప్రభుత్వం స్థలాలను కేటాయించింది. మహబూబ్‌నగర్‌ జిల్లా పెద్దాయిపల్లి గ్రామంలో 20.18 ఎకరాలు, సూర్యాపేట జిల్లా కోదాడలో 19.12 ఎకరాల ప్రభుత్వ భూమిని క్యాబినెట్‌ కేటాయించింది. అలాగే, జగిత్యాల జిల్లా చల్‌గల్‌ గ్రామంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని క్యాబినెట్‌ నిర్ణయించింది.

  • డిస్కమ్‌లు వర్కింగ్‌ క్యాపిటల్‌ కింద పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎ్‌ఫసీ) నుంచి తీసుకునే రూ.9 వేల కోట్ల రుణానికి పూచీకత్తు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. పూచీకత్తు ఇవ్వడం వల్ల వడ్డీ రేట్లలో ఉపశమనం ఉంటుందని, పూచీకత్తు ఇవ్వకపోతే వడ్డీభారం ఉంటుందని అధికారులు నివేదించగా... దీనిపై చర్చించిన మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

  • సింగరేణి, రాజస్థాన్‌ విద్యుత్‌ సంస్థల మధ్య జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ జేవీలో భాగంగా మంచిర్యాల జిల్లా జైపూర్‌లో 800 మెగావాట్ల సూపర్‌ క్రిటికల్‌ ప్లాంట్‌ను సింగరేణి కట్టనుంది. దీనికి బదులుగా రాజస్థాన్‌లో 1500 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ రాజస్థాన్‌ విద్యుత్‌ సంస్థ నిర్మించనుంది. జేవీలో భాగంగా ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేసి, దాని మార్గదర్శకాలు సిద్ధం చేయనున్నారు. ఇక మార్క్‌ఫెడ్‌ ద్వారా వివిధ పంటల కొనుగోలు కోసం తీసుకునే రుణం కోసం పూచీకత్తు ఇవ్వాలని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆదిలాబాద్‌, ములుగు జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాల కోసం స్థలాలు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.

Updated Date - Jul 03 , 2026 | 06:07 AM