Share News

హ్యామ్‌కు గ్రీన్‌సిగ్నల్‌

ABN , Publish Date - May 29 , 2026 | 03:50 AM

రోడ్లు-భవనాలు, పంచాయతీరాజ్‌ శాఖల పరిధిలో హైబ్రిడ్‌ యాన్యునిటీ మోడ్‌ (హ్యామ్‌) విధానంలో చేపట్టాలని నిర్ణయించిన రోడ్ల పనులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

హ్యామ్‌కు గ్రీన్‌సిగ్నల్‌

  • క్యాబినెట్‌లో ఆమోదించిన మార్పులతో జీవో విడుదల

హైదరాబాద్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): రోడ్లు-భవనాలు, పంచాయతీరాజ్‌ శాఖల పరిధిలో హైబ్రిడ్‌ యాన్యునిటీ మోడ్‌ (హ్యామ్‌) విధానంలో చేపట్టాలని నిర్ణయించిన రోడ్ల పనులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ పనులలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటే 14.5 శాతం అధిక ధరలను (ఎక్సెస్‌) కాంట్రాక్టర్లు తమ టెండర్లలో కోట్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇటీవల జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఈ పనులకు సంబంధించి 5 కీలక సవరణలు చేయాలని నిర్ణయించారు. ఆ మార్పులతో తాజాగా జీవో ఎంఎ్‌స-21ని ప్రభుత్వం జారీ చేసింది. సవరణల్లో భాగంగా మొదట ఈ పనుల్లో ప్రతిపాదించిన పెట్రోలింగ్‌ వాహనాలు, అంబులెన్స్‌లను రద్దు చేసి, రాష్ట్రంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ‘డయల్‌-100’ సేవలను హ్యామ్‌ ప్రాజెక్టుకు అనుసంధానం చేయాలని నిర్ణయించారు. రోడ్ల పనుల్లో భాగంగా కాంట్రాక్టర్లు చెల్లించే జీఎస్టీని వారికి వెంటనే రీయింబర్స్‌చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్కారు నిర్ణయించిన ధరల కంటే ఐదు శాతం మించకుండా మరోసారి టెండర్లను ఆహ్వానించనున్నారు. ఆ మేరకు వచ్చే టెండర్లను టెండర్‌ కమ్‌ ఎవాల్యుయేషన్‌ కమిటీ పరిశీలించి ఖరారు చేస్తుంది. టెండర్లు ఖరారైన కాంట్రాక్టర్లతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. ఆర్‌ అండ్‌ బీలో రూ.13,006 కోట్లు, పంచాయతీరాజ్‌లో రూ.6 వేల కోట్లు కలిపి మొత్తం రూ.19 వేల కోట్లతో హ్యామ్‌ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. జూన్‌ రెండు, మూడో వారాల్లో ఈ పనులను మొదలుపెడతారు. పనుల ప్రారంభోత్సవాల సందర్భంగా ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క నియోజకవర్గాలైన నల్లగొండ, ములుగులో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ సభలకు సీఎం రేవంత్‌రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Updated Date - May 29 , 2026 | 03:50 AM