Share News

26 నుంచి బడ్జెట్‌ సమావేశాలు?

ABN , Publish Date - Feb 20 , 2026 | 01:31 AM

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 26వ తేదీ నుంచి 15 రోజుల పాటు బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది.

26 నుంచి బడ్జెట్‌ సమావేశాలు?

  • 15 రోజుల పాటు శాసనసభ

  • 28న సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టే చాన్స్‌

  • పరిషత్‌ ఎన్నికలపై తర్జనభర్జన

  • 23న జరిగే క్యాబినెట్‌లోనే స్పష్టత

హైదరాబాద్‌, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 26వ తేదీ నుంచి 15 రోజుల పాటు బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. తొలి రోజున గవర్నర్‌ ప్రసంగం, మరుసటి రోజు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉండనుంది. అనంతరం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఈ నెల 28వ తేదీన రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే, పరిషత్‌ ఎన్నికల అంశంలో ప్రభుత్వ తర్జనభర్జన కొనసాగుతుండడంతో బడ్జెట్‌ సమావేశాల అంశంపై స్పష్టత రావడం లేదు. మార్చి 10వ తేదీ లోపు పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి, ఆ తర్వాత బడ్జెట్‌ సమావేశాలకు వెళ్లాలన్న ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆయా అంశాలపై తుది నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి, పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం ఇచ్చిన ఉత్సాహంతో పరిషత్‌ ఎన్నికలకూ వెళ్లాలని సీఎం రేవంత్‌రెడ్డి భావించారు. కానీ, మార్చి 14వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలోచనలో పడ్డారు. అయితే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి మార్చి 10 కల్లా పూర్తి చేస్తే పదో తరగతి పరీక్షలకు ఎలాంటి అడ్డం ఉండదనే అభిప్రాయాలు ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పరిషత్‌ ఎన్నికలను ఏప్రిల్‌ నెలకు వాయిదా వెయ్యాలా ? లేక పరీక్షలకు అడ్డు కాకుండా జాగ్రత్తలు తీసుకుని మార్చి 10 లోపున ఎన్నికల ప్రక్రియ ముగించాలా ? అన్న అంశాలను పరిశీలిస్తున్నారు. ఎన్నికలను వాయిదా వేసిన పక్షంలో ఫిబ్రవరి 26 నుంచి బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించాలన్న భావనలో ప్రభుత్వం ఉందంటున్నారు. ఈ నెల 23న జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం వెలువడే అవకాశం అధికంగా ఉంది.

Updated Date - Feb 20 , 2026 | 01:31 AM