Share News

గిగ్‌ వర్కర్లకు సర్కారు ‘మే-డే’ గిఫ్ట్‌

ABN , Publish Date - May 02 , 2026 | 05:05 AM

రాష్ట్రంలోని గిగ్‌ వర్కర్ల కోసం ప్రభుత్వం రూపొందించిన ‘తెలంగాణ ప్లాట్‌ఫామ్‌ బేస్డ్‌ గిగ్‌ వర్కర్స్‌-2026’ బిల్లు శుక్రవారం (మే-డే) నుంచి అమల్లోకి వచ్చింది..

గిగ్‌ వర్కర్లకు సర్కారు ‘మే-డే’ గిఫ్ట్‌

  • అమల్లోకి గిగ్‌ వర్కర్ల చట్టం.. బిల్లుకు గవర్నర్‌ ఆమోదం

హైదరాబాద్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గిగ్‌ వర్కర్ల కోసం ప్రభుత్వం రూపొందించిన ‘తెలంగాణ ప్లాట్‌ఫామ్‌ బేస్డ్‌ గిగ్‌ వర్కర్స్‌-2026’ బిల్లు శుక్రవారం (మే-డే) నుంచి అమల్లోకి వచ్చింది. ఈ బిల్లుకు గవర్నర్‌ శివప్రతా్‌పశుక్లా ఆమోదముద్ర వేయడంతో.. రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని గిగ్‌ వర్కర్లకు చట్టబద్ధత కలగనుంది. ఈ చట్టం అమలుకు అవసరమైన విధివిధానాలు, మార్గదర్శకాల రూపకల్పన కోసం ప్రభుత్వం త్వరలోనే కమిటీని ఏర్పాటు చేయనుంది. వారం, పది రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తిచేసి మార్గదర్శకాలకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది గిగ్‌వర్కర్లు (ఓలా, ఊబర్‌, స్విగ్గీ, జొమాటో, ఇతరత్రా యాప్‌ బేస్డ్‌ సంస్థల్లో పనిచేస్తున్నవారు) ఉన్నారు. వీరందరికి సామాజిక భద్రత, బీమా లాంటి సౌకర్యాలేమీ ఉండట్లేదు. ఈ నేపథ్యంలో.. వారికి పని భద్రత, ప్రమాద, ఆరోగ్య బీమా, గిగ్‌ వర్కర్ల కోసం సంక్షేమ బోర్డు, రియల్‌ టైమ్‌ డేటా వెరిఫికేషన్‌ వ్యవస్థ, పని ప్రదేశాల్లో విశ్రాంతి గదుల ఏర్పాటు, ఫిర్యాదుల పరిష్కారం, కార్మికుల నమోదు కోసం ఏర్పాటు సహా పలు సౌకర్యాలను కల్పించేందుకు రాష్ట్ర సర్కారు ఈ చట్టాన్ని రూపొందించింది. దీని అమలుకు సంబంధించి రాష్ట్రంలోని స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్‌ సహా ఇతర యాప్‌ బేస్డ్‌ అగ్రిగేటర్లకు చెందిన కార్మిక సంఘాలతో కార్మికశాఖ మంత్రి, అధికారులు ప్రత్యేకంగా భేటీ కానున్నారు.

Updated Date - May 02 , 2026 | 05:05 AM