Share News

విద్యుత్‌ వినియోగంలో రాష్ట్రం రికార్డు

ABN , Publish Date - Mar 11 , 2026 | 04:38 AM

రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఈ నెల 9న అత్యధికంగా 335.89 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం నమోదైంది.

విద్యుత్‌ వినియోగంలో రాష్ట్రం రికార్డు

  • ఒక్కరోజులోనే 335.89 మిలియన్‌ యూనిట్లు!

హైదరాబాద్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఈ నెల 9న అత్యధికంగా 335.89 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం నమోదైంది. గడచిన 12ఏళ్లలో ఒక్కరోజులో ఇంత పెద్దమొత్తంలో కరెంటు వాడటం ఇదే తొలిసారి. ఇంతకుముందు, ఈ నెల 3న కూడా రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ గరిష్ఠ స్థాయికి చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆ రోజు 325.56 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగించగా, 6 రోజుల్లోనే డిమాండ్‌ మరింత పెరగడం గమనార్హం. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలు, ఫ్యాక్టరీలు పెరగడం ఒక కారణమైతే.. వేసవిలో ఉష్ణోగ్రతలు అధికం కావడం, వ్యవసాయ రంగంలో విద్యుత్‌ వినియోగం పెరగడం వల్లే డి మాండ్‌ ఒక్కసారిగా పెరిగిందని ప్రభుత్వం అంచనా వేసింది. మున్ముందు కరెంట్‌ వాడకం 350 మిలియన్‌ యూనిట్ల వరకు వెళ్లే అవకాశం ఉందని, కోతలు లేకుండా సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని విద్యుత్‌ సంస్థలు ప్రకటించాయి. ఇంతటి భారీ డిమాండ్‌ ఉన్నప్పటికీ, ఎక్కడా అంతరాయం లేకుండా సమర్థంగా విద్యుత్‌ పంపిణీ చేస్తున్న సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అభినందించారు.

Updated Date - Mar 11 , 2026 | 04:38 AM