మూడోక్లాసు బుడతడు.. ఒక్కరోజూ డుమ్మా కొట్టకుండా బడికెళ్లాడు!
ABN , Publish Date - Apr 24 , 2026 | 03:51 AM
బడులకు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులైతేనేమి.. కార్యాలయాలకువెళ్లే ఉద్యోగులైతేనేమి.. సెలవు ఎప్పుడు దొరుకుతుందా? డుమ్మా కొట్టే అవకాశం...
రోజూ బడికి వెళ్లొచ్చేందుకు 5 కి.మీ. నడక
విద్యాసంవత్సరంలో 100 హాజరు నమోదు
చదువుపట్ల తొమ్మిదేళ్ల విద్యార్థి నితేశ్ మక్కువ
బాలుడికి సైకిల్ బహూకరించిన ఉపాఽధ్యాయుడు
బొంరా్‌సపేట్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): బడులకు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులైతేనేమి.. కార్యాలయాలకువెళ్లే ఉద్యోగులైతేనేమి.. సెలవు ఎప్పుడు దొరుకుతుందా? డుమ్మా కొట్టే అవకాశం ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తుంటారు! చిన్న అవకాశం వస్తే చాలు సెలవు పెట్టేస్తారు. అయితే ఆ మూడో తరగతి బుడతడు మాత్రం ఈ విద్యాసంవత్సరంలో ఒక్కరోజూ డుమ్మా కొట్టకుండా బడికి వెళ్లాడు. బహుశా ఇంటికి సమీపంలోనే బడి ఉందేమో అనుకునేరు! అతడు ఉంటున్న తండాకు, బడికి మధ్య దూరం 2.5 కి.మీ! అంటే బడికి వెళ్లొచ్చేందుకు 5 కి.మీ నడుస్తాడన్నమాట! రోజూ ఇంతదూరం నడుస్తున్నా ఆ బాలుడు, విద్యాసంవత్సరంలో ఒక్కటంటే ఒక్క సెలవు తీసుకోకుండా బడికి వెళ్లాడు. వికారాబాద్ జిల్లా బొంరా్‌సపేట్ మండలంలోని ఏర్పుమళ్ల పాఠశాలకు చెందిన నితేశ్ (9) అనే బాలుడిదీ ఘనత. అతడి స్వగ్రామం సీత్యానాయక్ తండా. రోజూ బడికి వెళ్లి 100శాతం హాజరు నమోదు చేసుకున్నాడు. చదువుపట్ల బుడ్డోడి మక్కువకు ఆ బడిలోని ఉపాధ్యాయుడు సర్దార్ ముచ్చటపడ్డారు. నితేశ్ కోసం ఓ సైకిల్ కొన్నారాయన. ప్రధానోపాధ్యాయుడు వెంకట్‌రెడ్డి, మరో ఉపాధ్యాయుడు ప్రశాంత్, సర్పంచ్ బందెయ్య, పంచాయతీ కార్యదర్శి రమేశ్, ఉప సర్పంచ్ సమక్షంలో నితేశ్‌కు సైకిల్ బహూకరించారు.