మీ సమస్య తీర్చితే మాకు సమస్య!
ABN , Publish Date - Jun 21 , 2026 | 05:09 AM
రాష్ట్రంలో భూభారతి చట్టం అమల్లోకి వచ్చినా రైతుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. కొత్త చట్టంతో తమ భూ సమస్యలు త్వరితగతిన పరిష్కారమవుతాయని భూ యజమానులు ఎంతో ఆశ పడ్డారు.
భూములపై హక్కులు నిర్ణయించలేం.. మీరు చెప్పినవన్నీ విన్నా.. బయోమెట్రిక్ వేయలేం
సాంకేతిక సమస్యలు, న్యాయపరమైన చిక్కుల భయంతో వాయిదాలు వేస్తున్న కలెక్టర్లు
పొరపాటు జరిగితే కోర్టుల చుట్టూ తిరగాలన్న కారణంతో ఫైళ్లు పెండింగ్‌లో పెడుతున్న వైనం
భూభారతి అమల్లోకి వచ్చినా రైతులకు నిరాశే
హైదరాబాద్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూభారతి చట్టం అమల్లోకి వచ్చినా రైతుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. కొత్త చట్టంతో తమ భూ సమస్యలు త్వరితగతిన పరిష్కారమవుతాయని భూ యజమానులు ఎంతో ఆశ పడ్డారు. కానీ, వారికి నిరాశే మిగులుతోంది. సాంకేతిక సమస్యలు, న్యాయపరమైన చిక్కులు ఉండడంతో భూ సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టర్లే జంకుతున్నారు. భూములపై హక్కులు నిర్ణయించేందుకు వెనకడుగు వేస్తున్నారు. 70 శాతం అధికారాలు కలెక్టర్ల చేతిలో ఉన్నా.. ఒకసారి కలెక్టర్ తన బయోమెట్రిక్ (వేలిముద్ర) వేస్తే, ఆ రికార్డు శాశ్వతంగా ఫ్రీజ్ అవుతుంది. భవిష్యత్తులో ఆ భూమిపై ఏ చిన్న పొరపాటు బయటపడినా ఐటీ చట్టం, రెవెన్యూ చట్టాల ప్రకారం కలెక్టరే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ భయంతోనే కలెక్టర్లు నిర్ణయాలు తీసుకోవడం లేదు. రైతుల బాధలన్నీ వింటున్నారు. క్షేత్ర స్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నారు. అయినా, ఏదో ఒక భయంతో ఫైళ్లు పక్కన పెట్టేస్తున్నారు. ఈ తరహా జాప్యం వల్లే సంగారెడ్డి జిల్లాలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయారు. కంగ్టి మండలం గాజులపహాడ్‌కు చెందిన రైతు మాధవరావుకు 8.25 ఎకరాల భూమి ఉంది. గతంలో సాదాబైనామా లావాదేవీల్లో జరిగిన తప్పు వల్ల రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియలో రైతుకు తెలియకుండానే ఆయన భూమి ఇతరుల పేరుతో బదిలీ అయింది. దీన్ని సవరించాలని.. రైతు కుటుంబం తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్, కలెక్టర్ వరకు అందరినీ కలిశారు. కింది స్థాయి అధికారులు నివేదిక ఇచ్చినా.. బయోమెట్రిక్ వేస్తే, తాము సివిల్ వివాదాల్లో ఇరుక్కుంటామనే భయంతో ఉన్నతాధికారులు నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. చివరికి ఒత్తిడి తట్టుకోలేకపోయిన మాధవరావు ఆత్మహత్య చేసుకున్నారు. రైతు కమిషన్ కూడా ఈ కుటుంబాన్ని పరామర్శించి, కేసు వివరాలను ప్రభుత్వానికి నివేదించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో ఉదంతాలు..
చట్టం అమల్లోకి వచ్చాక 2025 జూన్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ప్రతి మండలంలో వందలాది మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. నేటికీ అవి కలెక్టర్ల లాగిన్ నుంచి బయట పడడం లేదని రైతులు వాపోతున్నారు. హనుమకొండ జిల్లా మట్టెవాడ, పైడిపల్లి పరిధిలో సర్వీస్ ఇనాం భూములు, తప్పుడు సర్వే నంబర్ల సవరణ కోసం వందల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. రాజేందర్ అనే 63 ఏళ్ల వృద్ధుడు 10 గుంటల భూమికి సంబంధించి 1991 నుంచి పాస్ పుస్తకం కోసం ఎదురు చూస్తున్నారు. కొత్త చట్టం వచ్చాక రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు పెట్టుకున్నారు. సరిహద్దులు స్పష్టంగా లేవంటూ కలెక్టర్ నిర్ణయం తీసుకోకుండా పక్కన పెట్టేశారని రాజేందర్ వాపోయారు. యాదాద్రి, జనగాం జిల్లాల్లో ఈ చలానా స్కాం బయట పడిన తర్వాత కలెక్టర్లు మరింత భయాందోళనకు గురవుతున్నట్లు ఓ అధికారి ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. ఫైళ్లను నిశితంగా పరిశీలించాలనే సాకుతో నెలల తరబడి పెండింగ్‌లో పెడుతున్నట్లు చెప్పారు. తెలంగాణలో భూ సంబంధిత చట్టాలపై సరైన అవగాహన లేక కొందరు కలెక్టర్లు.. కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుందనే భయంతో మరికొందరు భూ సమస్యల జోలికి వెళ్లడం లేదని తెలిపారు. ఇప్పుడు వేలిముద్రతో ఆమోదం తెలిపితే.. భవిష్యత్తులో విజిలెన్స్, ల్యాండ్ ట్రైబ్యునళ్ల ముందు నిలబడాల్సిన పరిస్థితి ఉంటుందనే భయంతో నిర్ణయాలను వాయిదా వేసే ధోరణి అవలంబిస్తున్నారని చెప్పారు.
అధికారులను భయపెడుతున్న చట్టాలు
భూభారతి పోర్టల్ ద్వారా దరఖాస్తులను పరిష్కరించేటప్పుడు కలెక్టర్లు కేవలం కొత్త చట్టం నిబంధనలే కాకుండా దశాబ్దాల కిందటి పాత చట్టాలను కూడా పరిశీలించాల్సి ఉంది. వాటి మధ్య ఉన్న వైరుధ్యాలు కలెక్టర్లను గందరగోళంలో పడేస్తున్నాయి. భూభారతి-2025 చట్టం ప్రకారం.. మార్పులు, చేర్పులు చేసే పూర్తి డిజిటల్ అధికారం కలెక్టర్, ఆర్డీవో స్థాయి అఽధికారుల లాగిన్‌లకు పరిమితం చేశారు. కలెక్టర్ బయోమెట్రిక్ వేస్తే ఆ రికార్డుకు ఆయనే అంతిమ జవాబుదారీ. ఇక రెండో చట్టం.. అగ్రి ల్యాండ్ కన్వర్షన్ యాక్ట్. దీనిప్రకారం వ్యవసాయ భూములను వ్యవసాయేతరంగా మార్చే క్రమంలో పాత రికార్డుల్లోని వివరణలు, భూభారతి డిజిటల్ మ్యాపింగ్‌తో సరిపోలడం లేదు. చట్టబద్ధంగా కన్వర్షన్ ఇచ్చే అంశంపై సీసీఎల్‌ఏ ఇచ్చిన మార్గదర్శకాల్లోనూ స్పష్టత లేదు. ఇక మూడో చట్టం 22ఏ (నిషేధిత భూముల జాబితా), ఇనాం రద్దు చట్టం. గత ప్రభుత్వ హయాంలో పొరపాటున 22ఏ జాబితాలో చేరిన పట్టా భూములను తొలగించాలంటే.. ఇటు రిజిస్ట్రేషన్ చట్టం, అటు పాత ఇనాం భూముల నిబంధనలను పరిశీలించాలి. ఈ రెండు చట్టాల లింకేజీలపై అవగాహన లేక కలెక్టర్లు పైళ్లను పెండింగ్‌లో పెడుతున్నారు. ఇక నాలుగోది ఐటీ యాక్ట్. బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది ఐటీ చట్టం పరిధిలోకి వస్తుంది. డిజిటల్ సంతకం లేదా వేలిముద్ర ద్వారా ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల పేరుతో బదిలీ చేస్తే.. అది నేరపూరిత నిర్లక్ష్యం కిందకు వస్తుంది. దీంతో భూ సమస్యల పరిష్కారంలో నిర్ణయాలు తీసుకునేందుకు కలెక్టర్లు జంకుతున్నారనే విమర్శలు ఉన్నాయి. వివాదాస్పద భూములపై నిర్ణయం తీసుకొని, కోర్టుల చుట్టూ తిరగడం కంటే వాటిని ముట్టుకోకపోవడమే మంచిదనే భావనలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.