భూభారతిలో యూజర్ చార్జీలు
ABN , Publish Date - May 06 , 2026 | 07:15 AM
వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు, ఇతర సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన భూభారతిలో యూజర్ చార్జీలు వసూలు మొదలైంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు ఉన్నా..
మంగళవారం నుంచే అమల్లోకి..
15 పేజీల లోపున్న డాక్యుమెంట్‌కు రూ.500
ఆపైన పేజీలుంటే రూ.1000 వరకు చార్జీ
దీనితో సాంకేతికత సమస్య తలెత్తి రిజిస్ట్రేషన్లకు ఇబ్బంది
హైదరాబాద్, మే 5 (ఆంధ్ర జ్యోతి): వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు, ఇతర సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన భూభారతిలో యూజర్ చార్జీలు వసూలు మొదలైంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు ఉన్నా.. అధికారులు మంగళవారం నుంచి అమల్లోకి తెచ్చారు. రిజిస్ట్రేషన్ల కోసం 15 పేజీలలోపు ఉన్న డాక్యుమెంట్‌కు రూ.500, ఆపైన పేజీలుంటే రూ.1,000 వరకు చార్జీల కింద చెల్లించాలి. ఇతర సేవలకు సంబంధించి కూడా విడివిడిగా చార్జీలను నిర్ణయించారు. గత ఏడాది ఏప్రిల్ 14న భూభారతి పోర్టల్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దాని ద్వారా రెవెన్యూ సేవలన్నీ ఏకీకృతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంగళవారం నుంచి యూజర్ చార్జీలను అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో.. చాలాచోట్ల సాంకేతిక సమస్య తలెత్తి రిజిస్ట్రేషన్లకు ఇబ్బంది తలెత్తింది. పెండింగ్‌లో ఉన్న డాక్యుమెంట్లకు యూజర్ చార్జీ చెల్లించలేదని.. రిజిస్ట్రేషన్లు జరిగే సమయంలో డెఫిసిట్ డాక్యుమెంట్లను క్లియర్ చేయాలని సందేశం చూపడం మొదలుపెట్టింది. ఇవన్నీ సరిదిద్దాకే రిజిస్ట్రేషన్లు కొనసాగాయని ఓ అధికారి వెల్లడించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పలు రకాల సేవలకు సంబంధించి ఇప్పటికే యూజర్ చార్జీలు అమల్లో ఉన్నాయి. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు ఎప్పటి నుంచో వసూలు చేస్తున్నారు. అయితే భూభారతి అమల్లోకి వచ్చాక ఇప్పటివరకు యూజర్ చార్జీలను వసూలు చేయలేదు. ఈ క్రమంలో పాత ఉత్తర్వులను అమలు చేయాలని హైపవర్ కమిటీ ఇటీవల నిర్ణయించింది. ఈ మేరకు మే 5వ తేదీ నుంచి సీసీఎల్‌ఏ అధికారులు యూజర్ చార్జీలను అమల్లోకి తీసుకొచ్చారు.
భూభారతి పోర్టల్‌తో పారదర్శకతను పెంచుతూనే కొన్ని నిర్దిష్ట సేవలకు ప్రభుత్వం నామమాత్రపు రుసుము విధించింది. భూమికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. ల్యాండ్ స్టేటస్ సెర్చ్‌కి సంబంధించి సర్వే నంబరు, పట్టాదారు పాస్‌పుస్తకం, నిషేధిత జాబితా, మార్కెట్ విలువలు చూసుకోవడం పూర్తిగా ఉచితం. ఆన్‌లైన్‌లో ఆర్వోఆర్ డిజిటల్ డాక్యుమెంట్లు కావాలన్నా (సర్టిఫైడ్‌కాపీ), ఈసీ కావాలన్నా డౌన్‌లోడు చేసుకునేందుకు రూ.20 నుంచి రూ.100 వరకు చార్జీ పడుతుంది. భూమి హక్కుల మార్పిడికి సంబంధించిన సేవల్లో మ్యుటేషన్‌కు (యాజమాన్య హక్కు బదిలీ) కోసం ఎకరానికి రూ.2,500 వరకు చార్జీ ఉంది. పట్టాదార్ పాస్ పుస్తకం కోసం రూ.300 చెల్లించాలి. నాలా కింద వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు కనీసం రూ.5వేల నుంచి విస్తీర్ణం ఆధారంగా వసూలు చేస్తారు. స్లాట్ బుకింగ్, రికార్డుల సవరణ ఇలా పలు సర్వీసులకు రూ.100 నుంచి రూ.500 వరకు చార్జీలు ఉన్నాయి.
భూముల విలువ మదింపు పత్రాలు ఎలా?
హైదరాబాద్, మే 5 (ఆంధ్ర జ్యోతి): భూముల మార్కెట్ విలువలను సవరించేందుకు సిద్ధమైన ప్రభుత్వం.. గతంలో మార్కెట్ విలువల పెంపుపై మదింపు చేసిన పత్రాలను పంపాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించింది. బుధవారం సాయంత్రానికల్లా సంబంధిత పత్రాల స్కాన్ కాపీలను ఆన్‌లైన్‌లో అందజేయాలని సూచించింది. కానీ 2022లో భూముల విలువల సవరణపై ఉన్నతస్థాయిలో నిర్ణయం జరిగిందే తప్ప.. ప్రాంతాల వారీగా అధ్యయనం, మదింపు పూర్తిచేయలేదని అధికారులు చెబుతున్నారు. సదరు పత్రాలేవీ అందుబాటులో లేవని, ఏం చేయాలో అర్థంకావడం లేదని వాపోతున్నారు. కాగా, మార్కెట్ విలువల సవరణపై బుధవారం రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ నేతృత్వంలో సమావేశం జరగనుంది.