తెలంగాణ భవన్‌లో ప్రత్యేక బృందం
ABN , Publish Date - Jul 14 , 2026 | 06:09 AM
పార్లమెంట్ సమావేశాల సమయంలో ఎంపీలకు తక్షణ సమాచారం, సహకారం అందించడానికి తెలంగాణ భవన్‌లో ప్రణాళిక శాఖ ప్రత్యేక బృందాన్ని అందుబాటులో ఉంచుతుందని..
పార్లమెంటు సమావేశాల సమయంలో సమాచారం అందించడానికే
సీఎం, మంత్రులు, ఎంపీల లేఖలన్నీ క్రోడీకరించి డ్రాఫ్ట్ తయారు చేస్తాం
ప్రధాని, మంత్రులకు విన్నవించడానికి ఎంపీలందరికీ అందజేస్తాం
గోదావరి ప్రాంతంలో బొగ్గు బ్లాకులన్నీ సింగరేణికే ఇవ్వాలి: డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్ సమావేశాల సమయంలో ఎంపీలకు తక్షణ సమాచారం, సహకారం అందించడానికి తెలంగాణ భవన్‌లో ప్రణాళిక శాఖ ప్రత్యేక బృందాన్ని అందుబాటులో ఉంచుతుందని, ప్రశ్న గంటలో అనుబంధ ప్రశ్నలు అడగడానికి అవసరమైన డేటాను ఈ టీమ్ అందిస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజా భవన్‌లో సోమవారం జరిగిన ఎంపీల సమావేశంలో ముఖ్యమంత్రితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ... కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన వాటాలు, నిధులను సాధ్యమైనంత వరకు సాధించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ‘‘ఎంపీలు అందించిన ప్రతి సలహా, సూచనను ప్రణాళిక శాఖ అధికారులు నోట్ చేసుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు తాము రాసే లేఖల ప్రతులను తప్పనిసరిగా తెలంగాణ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి పంపాలి. గతంలో పంపిన లేఖలు, భవిష్యత్తులో పంపే ఉత్తరాలు, పెండింగ్ అంశాల లేఖలన్నింటినీ శాఖల వారీగా క్రోడీకరించి డ్రాఫ్ట్‌ను తయారు చేస్తాం. దానిని పార్లమెంట్ సమావేశాల సమయంలో ఎంపీలకు అందజేస్తాం. తద్వారా ప్రధాన మంత్రిని, కేంద్ర మంత్రులను ఎంపీలు కలిసినప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను వివరించేందుకు అవకాశం ఉంటుంది’’ అని వివరించారు.
ప్రశ్న గంట, శూన్య గంట, స్టాండింగ్ కమిటీలు, కన్సల్టేటివ్ కమిటీలు వంటి అందుబాటులో ఉన్న ప్రతి ఫార్మాట్‌ను ఉపయోగించుకుని రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలో ముఖ్యమంత్రిగానీ, తాను గానీ స్వయంగా ఢిల్లీకి వస్తామని, ఎంపీలతో సమావేశమై ఏయే అంశాలపై ఒత్తిడి తేవాలో చర్చిస్తామని చెప్పారు. గోదావరి పరీవాహకంలోని బొగ్గు బ్లాకులను ఎలాంటి వేలం లేకుండా సింగరేణికే కేటాయించేలా, గతంలో ప్రైవేటు సంస్థలకు కేటాయించిన సత్తుపల్లి, కోయగూడెం-3 బ్లాకులను తిరిగి సింగరేణికి కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రజా ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని, ఎన్నిసార్లైనా కేంద్రాన్ని కలవడానికి సిద్ధమని అన్నారు. రైల్వే నెట్‌వర్క్ విస్తరణతో రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, దీని కోసం భూమిని సేకరించి ఇస్తామని తెలిపారు.