Share News

రాష్ట్రానికి 3,189 కోట్ల ఏబీపీ నిధులు

ABN , Publish Date - Feb 22 , 2026 | 07:17 AM

గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన భారత్‌ నెట్‌ ప్రోగ్రామ్‌ (ఏబీపీ)లో భాగంగా తెలంగాణలో ఫేజ్‌-1, ఫేజ్‌-2 పనుల అప్‌గ్రెడేషన్‌తోపాటు ఫేజ్‌-3 పనులకోసం కేంద్రం రూ.3,185 కోట్ల అంచనా వ్యయానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.

రాష్ట్రానికి 3,189 కోట్ల ఏబీపీ నిధులు

  • ఫేజ్‌-1, 2 పూర్తితోపాటు పథకం పొడిగింపునకు కేటాయింపు.. నిధుల మంజూరుకు కేంద్రం సూత్రప్రాయ అనుమతి

  • రాష్ట్రానికి కేంద్ర టెలికమ్యూనికేషన్స్‌ శాఖ లేఖ

  • ఫలించిన సీఎం రేవంత్‌, మంత్రి శ్రీధర్‌బాబు ప్రయత్నాలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన భారత్‌ నెట్‌ ప్రోగ్రామ్‌ (ఏబీపీ)లో భాగంగా తెలంగాణలో ఫేజ్‌-1, ఫేజ్‌-2 పనుల అప్‌గ్రెడేషన్‌తోపాటు ఫేజ్‌-3 పనులకోసం కేంద్రం రూ.3,185 కోట్ల అంచనా వ్యయానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర టెలికమ్యూనికేషన్స్‌ శాఖ ఈ నెల 18న రాష్ట్రానికి లేఖ రాసింది. రైటాఫ్‌ వే చార్జీలను కలుపుకొని ఈ మొత్తం రూ.3,189 కోట్లు అవుతుంది. ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల పరిధిలోని 3,089 గ్రామాలకు కూడా టీ-ఫైబర్‌ ఇంటర్‌నెట్‌ అందించేందుకు అనుమతిచ్చింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 9,662 గ్రామాలకు టీ-ఫైబర్‌ నెట్‌ అందించే వీలుండగా, ఇప్పుడు మరో 3,089 గ్రామాలకు అవకాశం లభించండంతో రాష్ట్రం మొత్తం ప్రభుత్వమే ఇంటర్‌నెట్‌ అందించేందుకు అవకాశం ఏర్పడింది. ఇప్పటివరకు ‘లీనియర్‌’ విధానంలో ఉన్న ఈ ప్రాజెక్టు.. ఇకపై ‘రింగ్‌’ టెక్నాలజీతో అందుబాటులోకి రానుంది. లీనియర్‌ విధానంలో ఎక్కడైనా సాంకేతిక సమస్యలు, కేబుల్‌ వ్యవస్థకు ఇబ్బందులు ఎదురైతే.. అది పరిష్కారమయ్యే వరకు ఇంటర్‌నెట్‌ వచ్చేది కాదు. రింగ్‌ టెక్నాలజీతో కేబుల్‌ వ్యవస్థను రెండుమూడు ప్రత్యామ్నాయ వ్యవస్థలుగా ఏర్పాటుచేస్తారు. తద్వారా ఎక్కడైనా కేబుల్‌, సాంకేతిక సమస్యలు ఏర్పడినా మరో మార్గం ద్వారా అంతరాయం లేకుండా ఇంటర్‌నెట్‌ సరఫరా చేస్తారు. భారత్‌ నెట్‌ ప్రాజెక్టు-3 కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక కొత్త కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నాయి. ఆ కార్పొరేషన్‌ ఖాతాకే తాజాగా అనుమతిచ్చిన నిధులు జమ చేయనున్నారు. ఈ కార్పొరేషన్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఈ కొత్త కార్పొరేషన్‌ తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌కు అనుబంధంగా ఉంటుంది. గ్రామాల్లోని కుటుంబాలకు టీవీ సెట్‌టాప్‌ బాక్స్‌, ఇంటర్‌నెట్‌ అందించేందుకు ఇచ్చే కనెక్షన్లకు అయ్యే మొత్తం ఖర్చులోనూ కేంద్రం కొంత రాయితీని ఇవ్వనున్నట్లు లేఖలో తెలిపింది.


మొదటి దశలో రాష్ట్రంలో 2.93 లక్షల గృహాలకు టీ-ఫైబర్‌ కనెక్షన్లు ఇవ్వనున్నారు. కేంద్రం మంజూరు చేయబోయే రూ.3,189 కోట్లలో రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌నెట్‌ కేబులింగ్‌, మెయింటనెన్స్‌ కోసం రూ.2,697 కోట్లు వెచ్చిస్తారు. ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో కేబుల్‌ వ్యవస్థ ఏర్పాటు కోసం రూ.432 కోట్లు ఖర్చు చేస్తారు. మరోవైపు భారత్‌ నెట్‌ ప్రాజెక్టు-2 కింద ఇప్పటికే రాష్ట్రంలో 42 వేల కిలోమీటర్ల మేర 9,662 గ్రామాల్లో ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ (ఓఎ్‌ఫసీ)ను టీ-ఫైబర్‌ ఏర్పాటుచేసింది. ప్రభుత్వం అనుమతివ్వగానే 8,895 గ్రామాల్లో ఇంటర్‌నెట్‌ సేవలు అందించేందుకు రంగం సిద్ధం చేసింది. కాగా, కేంద్రం రాసిన లేఖలో ఒక్కో ఇంటికి కేబుల్‌, సెట్‌టాప్‌ బాక్స్‌, ఇంటర్‌నెట్‌ సరఫరా, లేబర్‌చార్జీ సహా ఇతర ఖర్చులన్నీ కలిపి ఎంతమేర చార్జీలు చెల్లిస్తామనే వివరాలను కూడా పొందుపర్చింది. దాని ప్రకారం 3 వేలకు పైగా జనాభా ఉన్న గ్రామాల్లో ఒక్కో కనెక్షన్‌కు రూ.8,900.. 2,000 - 3,000 మధ్య జనాభా ఉన్నచోట ఒక్కో కనెక్షన్‌కు రూ.10,500, వెయ్యి నుంచి 2 వేల లోపు జనాభా ఉన్న చోట రూ.11,500, వెయ్యిలోపు జనాభా ఉన్న చోట ఒక్కో కనెక్షన్‌కు రూ.12,900 చొప్పున చెల్లించనున్నట్టు పేర్కొంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్‌నెట్‌ సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇటీవల సీఎం రేవంత్‌ 3 సార్లు సమీక్ష నిర్వహించారు. నిధులతోపాటు ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో నెట్‌ అందించేందుకు టీ-ఫైబర్‌కు ఉన్న సాంకేతిక సమస్యలపై కేంద్ర టెలికమ్యూనికేషన్‌ శాఖ మంత్రితో ప్రత్యేకంగా చర్చించారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కూడా దీనిపై దృష్టి సారించారు. ఇటీవల ఢిల్లీలోనిర్వహించిన ‘ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌’ సందర్భంగా ‘టీ-ఫైబర్‌’కు మరింత సహకారం అందిస్తామని శ్రీధర్‌బాబుకు కేంద్ర టెలికమ్యూనికేషన్‌ శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా హామీనిచ్చారు. వెరసి కేంద్రంతో రేవంత్‌, శ్రీధర్‌బాబు జరిపిన చర్చలు, సంప్రదింపులు ఫలించి రాష్ట్రమంతా ప్రభుత్వ ఇంటర్నెట్‌ రాబోతోంది.

Updated Date - Feb 22 , 2026 | 07:18 AM