Share News

బీరు మీద బీరు కొట్టేస్తున్నారు!

ABN , Publish Date - Mar 05 , 2026 | 02:08 AM

రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఎండకాలం ఇంకా ప్రారంభం కాక ముందే ఈ ఏడాది బీర్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి.

బీరు మీద బీరు కొట్టేస్తున్నారు!

  • రాష్ట్రంలో పెరిగిన బీర్ల విక్రయాలు

  • ఐదేళ్ల రికార్డులు తిరగరాసేలా అమ్మకాలు

  • ఫిబ్రవరిలోనే 38 లక్షల కేసులు ఖాళీ

  • గత నెలలో 36శాతం పెరిగిన అమ్మకాలు

  • 35 రోజులకు సరిపడా ముందస్తు స్టాక్‌

హైదరాబాద్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఎండకాలం ఇంకా ప్రారంభం కాక ముందే ఈ ఏడాది బీర్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. గత ఐదేళ్ల రికార్డులను 2024లో జరిగిన బీర్ల అమ్మకాలు తుడిచిపెట్టేశాయి. అయితే, ఈ ఏడాది ఆ రికార్డును కూడా తిరిగరాసేలా బీర్ల అమ్మకాలు జరుగుతున్నాయి. గత 15 రోజుల్లోనే అమ్మకాలు 36 శాతం మేర పెరగడం విస్మయానికి గురి చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలు, 1,205 బార్లు, 50కిపైగా క్లబ్బులు ఉండగా.. ఈ నెల మొదటి నాలుగు రోజుల్లోనే 8లక్షల కేసులకుపైగా విక్రయాలు జరగడం బీర్ల డిమాండ్‌ను తెలియజేస్తోంది. 2025 జనవరిలో 31లక్షల కేసుల బీర్లు అమ్మకాలు జరగ్గా.. ఈ ఏడాది అది 34 లక్షలకు పెరిగింది. ఇక, గత ఏడాది ఫిబ్రవరిలో 28 లక్షల కేసుల బీర్లు అమ్ముడవ్వగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ సంఖ్య ఏకంగా 38లక్షల కేసులకు చేరింది. ఎండలు ముదురుతుండటంతో ఫిబ్రవరి చివరి వారం నుంచి బీర్ల డిమాండ్‌ పెరిగిందని చెబుతున్నారు. 2025 మార్చిలో 31లక్షల కేసులు అమ్మగా.. ఈ సారి నాలుగు రోజుల్లోనే అందులో నాలుగో వంతు(8లక్షల కేసులు)ను చేరుకోవడం గమనార్హం. సూర్యప్రతాపం పెరిగే కొద్దీ ఈ అమ్మకాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్‌శాఖ అంచనా వేస్తోంది. వాస్తవానికి ప్రతి ఏడాది బీర్ల అమ్మకాలు 450 లక్షల నుంచి 500 లక్షల కేసుల వరకు జరుగుతాయి. ఈ ఏడాది మొత్తం మీద సాధారణ అమ్మకాల కంటే 15- 20 శాతం అదనపు వృద్ధి నమెదు కావచ్చని అంచనాలు ఉన్నాయి.


ఉత్పత్తి పెంచిన కంపెనీలు

ఉత్పత్తి పెంచిన కంపెనీలు... ముందస్తు నిల్వలు బీర్ల డిమాండ్‌ను ముందుగానే పసిగట్టిన తయారీ కంపెనీలు తమ ఉత్పత్తిని పెంచాయి. గత ఏడాదితో పోల్చితే 10 నుంచి 12 శాతం అదనపు ఉత్పత్తిని సాధించేలా ఎక్సైజ్‌శాఖ చర్యలు చేపట్టింది. సాధారణంగా వేసవి కాలంలో గోదాముల్లో 15 రోజులకు సరిపడాస్టాక్‌ ఉంచుతారు. కానీ ప్రస్తుత డిమాండ్‌ దృష్ట్యా ఏకంగా 35 రోజులకు సరిపడా నిల్వలను గోదాముల్లో ఉంచారు. అలాగే, బీర్ల ఎగుమతులపై కూడా ఎక్సైజ్‌ శాఖ ఆంక్షలు విధించింది. వాస్తవానికి ఏ కంపెనీ అయినా రాష్ట్ర సరఫరా కోటాను పూర్తి చేశాక.. మిగిలిన సరుకును ఇతర రాష్ట్రాల్లో అమ్ముకునే వెసులుబాటు ఉంది. కానీ ఈ సారి డిమాండ్‌ అధికంగా ఉండడంతో ఇతర రాష్ట్రాలకు చేసే బీర్ల ఎగుమతులను ఎక్సైజ్‌ శాఖ తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న బీర్ల అమ్మకాల వేగాన్ని చూస్తుంటే.. మే నెల నాటికి బీర్ల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్న అఽధికారులు.. పత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.

Updated Date - Mar 05 , 2026 | 02:08 AM