Share News

మండే ఎండల్లో ఓ చల్లని బీరు!

ABN , Publish Date - Apr 15 , 2026 | 04:35 AM

భానుడి భగభగలు, ఉక్కబోత కారణంగా మిగతావారి అవస్థలు ఎలా ఉన్నా.. మద్యం ప్రియులు మాత్రం ఉపశమనం కోసం ఓ చల్లని బీరు అంటున్నారు! మండే ఎండల్లో..

మండే ఎండల్లో ఓ చల్లని బీరు!

  • గత ఏడాదితో పోల్చితే జనవరి నుంచే భారీగా పెరిగిన బీరు అమ్మకాలు

  • ఏప్రిల్‌లో ఇప్పటికే 21 లక్షల కేసుల అమ్మకాలు

  • రోజుకు 1.8 లక్షల కేసులు.. మేలో బీర్లకు కొరతే

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): భానుడి భగభగలు, ఉక్కబోత కారణంగా మిగతావారి అవస్థలు ఎలా ఉన్నా.. మద్యం ప్రియులు మాత్రం ఉపశమనం కోసం ఓ చల్లని బీరు అంటున్నారు! మండే ఎండల్లో కూల్‌గా పీపాలకు పీపాలు లాంగించేస్తుండటంతో బీర్ల విక్రయాలు చుక్కలను తాకుతున్నాయి. తెలంగాణ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ గణాంకాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు, బార్లు, కబ్బల్లో గత ఏడాది మార్చి నెలతో పోలిస్తే.. ఈ ఏడాది మార్చిలో బీర్ల విక్రయాలు 22 శాతం మేర పెరిగాయి. నిరుడు మార్చిలో 39లక్షల బీర్‌ కేసులు అమ్ముడుపోగా.. ఈ మార్చిలో రికార్డు స్థాయిలో 50.78లక్షల కేసులు అమ్ముడయ్యాయి. గత ఐదేళ్లలో ఇవే అత్యధికం. ఏప్రిల్‌లో నెల సగం కూడా గడవకముందే 13 రోజుల్లోనే 21లక్షల కేసుల విక్రయాలు జరగడం గమనార్హం. ప్రస్తుతం రోజుకు సగటున 1.70లక్షల నుంచి 1.80లక్షల వరకు బీరుకేసులు అమ్ముడుపోతున్నాయి. వాస్తవానికి ఎండలు మండక ముందే.. అంటే జనవరి నుంచే బీర్ల అమ్మకాల్లో పెరుగుల కనిపించింది. నిరుడు జనవరిలో 31లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. ఈ జనవరిలో అవి 34 లక్షలకు పెరిగాయి. గత ఏడాది ఫిబ్రవరిలో 28లక్షల కేసులు మాత్రమే అమ్ముడవగా.. ఈ సారి ఏకంగా 38లక్షల కేసుల విక్రయాలు జరిగాయి. ఎండలు ముదురుతుండటంతో ఫిబ్రవరి చివరి వారం నుంచి బీర్ల విక్రయాలు మరింత పెరిగాయి. మే నెలలో ఇంకా బీర్ల వాడకం పెరిగి.. నీటి కొరత ఏర్పడితే ఉత్పత్తి పడిపోయి బీర్లకు కొరత ఏర్పడే అవకాశం ఉందని ఎక్సైజ్‌శాఖ అంచనావేస్తోంది. బీర్ల తయారీ పరిశ్రమల్లో చాలామటుకు మంజీర నీటిపైనే ఆధారపడతాయి. ప్రస్తుతం ఆ నదిలో నీటిమట్టం భారీగా పడిపోయింది. దీంతో బీరు తయారీ యూనిట్లకు నీటి కష్టాలు మొదలయ్యాయి. ఉత్పత్తి తగ్గితే.. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎక్కడ కొరత లేకుండా మద్యం డిపోల నుంచి దుకాణాలకు నిరంతరాయంగా సరఫరా చేసేందుకు గత ఏడాదితో పోల్చితే.. 10 నుంచి 12 శాతం అదనపు ఉత్పత్తిని సాధించేలా ఎక్సైజ్‌శాఖ చర్యలు చేపట్టింది. సాధారణంగా వేసవి కాలంలో గోదాముల్లో 15 రోజులకు సరిపడ స్టాక్‌ ఉంచుతారు. ప్రస్తుత డిమాండ్‌ దృష్ట్యా ఎక్కడా కొరత రాకూడదనే ఉద్దేశంతో ఏకంగా 35 రోజులకు సరిపడా నిల్వలను గోదాముల్లో నిల్వ ఉంచారు. అయినా.. రోజు రోజుకు పెరుగుతున్న బీర్ల డిమాండ్‌కు తగ్గట్లు భవిష్యత్తులో అందించడం కష్టతరమే అవుతుందని ఎక్సైజ్‌శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి ఏడాది బీర్ల అమ్మకాలు 450 లక్షల కేసుల నుంచి 500 లక్షల కేసుల వరకు జరుగుతుండగా.. ఈ ఏడాది దాదాపు 600 లక్షల కేసులకు పైగా అమ్మకాలు జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Updated Date - Apr 15 , 2026 | 04:35 AM