Share News

ప్రమాదంలో 10వేల మంది చదువులు!

ABN , Publish Date - Jun 07 , 2026 | 06:24 AM

అధికారుల అవగాహన లోపం..10వేల మంది నర్సింగ్‌ విద్యార్థులకు శాపంగా మారింది. ఉన్న జీవోను యథాతథంగా అమలు చేయకపోవడంతో రెండేళ్లుగా వారు స్కాలర్‌షి్‌పలకు దూరమయ్యారు.

ప్రమాదంలో 10వేల మంది చదువులు!

  • నర్సింగ్‌ కోర్సుల్లో బి కేటగిరీ అడ్మిషన్లు పొందిన వారికి స్కాలర్‌షి్‌పలు బంద్‌

  • వీరిలో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీలే

హైదరాబాద్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): అధికారుల అవగాహన లోపం..10వేల మంది నర్సింగ్‌ విద్యార్థులకు శాపంగా మారింది. ఉన్న జీవోను యథాతథంగా అమలు చేయకపోవడంతో రెండేళ్లుగా వారు స్కాలర్‌షి్‌పలకు దూరమయ్యారు. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హయాంలో ప్రైవేట్‌ నర్సింగ్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటాతోపాటు మేనేజ్‌మెంట్‌ కోటా కింద నర్సింగ్‌ విద్యను అభ్యసించే విద్యార్థులకూ స్కాలర్‌షి్‌పలు అందించేవారు. 2012లో నాటి ప్రభుత్వం జీవో నంబరు 66 జారీ చేసి, బీ కేటగిరీ విద్యార్థులకు స్కాలర్‌షి్‌ప్సను రద్దు చేసింది. 2014లో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత బీ కేటగిరీలో నర్సింగ్‌ విద్యనభ్యసించే విద్యార్ధులకు స్కాలర్‌షిప్స్‌ అందించాలని దళిత ఎమ్మెల్యేలు, దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చాయి. అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చొరవ తీసుకుని సీఎం కేసీఆర్‌ను ఒప్పించడంతో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నుంచి వీరికి స్కాలర్‌షి్‌పలు ఇచ్చేలా జీవో 7 జారీ చేశారు. దాంతో 2018 నుంచి 2023 వరకు ఏటా 3 వేల మంది బీ కేటగిరీ నర్సింగ్‌ విద్యార్థులకు స్కాలర్‌షి్‌పలు ఇచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో 7 ప్రకారం బీ కేటగిరీ నర్సింగ్‌ విద్యార్థులకు స్కాలర్‌షి్‌పలు ఇవ్వాలా? వద్దా? అనే విషయమై స్పష్టత ఇవ్వాలంటూ సోషల్‌ వెల్ఫేర్‌ కమిషనర్‌ సంబంధితశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి రాశారు. ప్రిన్సిపల్‌ సెక్రటరీ కూడా దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా.. సంబంధిత ఫైల్‌ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు పంపారు. ఈ విషయంపై ఆయన కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో రెండు రోజుల క్రితం సంబంధిత ఫైల్‌ను సీఎంవోకు పంపారు. 7-8 నెలలుగా సచివాలయంలోనే చక్కర్లు కొట్టిన ఈ ఫైల్‌.. ఎట్టకేలకు సీఎంవోకు చేరింది. సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకుంటేనే వీరికి స్కాలర్‌షి్‌పలు మంజూరయ్యే అవకాశం ఉంది. జీవోలో ఉన్న దాన్ని యథాతథంగా అమలు చేసే విషయంలో అధికారులకు అవగాహన లేమి.. పది వేల మంది నర్సింగ్‌ విద్యార్థులకు శాపంగా మారింది. మరోవైపు.. మేనేజ్‌మెంట్‌ కోటా కింద సీట్లు పొందిన విద్యార్థులు ఫీజు చెల్లించాలంటూ ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడి తీసుకువస్తున్నాయి. ఈ కోర్సుల్లో 90 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్ధులేనని, ఇప్పుటికిప్పుడు ఫీజు చెల్లించాలంటే ఎక్కడ నుంచి తేవాలని నర్సింగ్‌ విద్యార్థిని ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.


రూ.72 వేలు కట్టమంటున్నారు

మాది పేద దళిత కుటుంబం. నేను 2024లో ఎల్బీనగర్‌లోని ఓ ప్రైవేటు నర్సింగ్‌ కాలేజీలో బీ కేటగిరీ కింద బీఎస్సీ నర్సింగ్‌లో అడ్మిషన్‌ తీసుకున్నా. స్కాలర్‌షిప్‌ వస్తుందని కాలేజీ యాజమాన్యం చెప్పింది. రెండున్నరేళ్లయినా ఇంతవరకూ స్కాలర్‌షిప్‌ రాలేదు. దీంతో రెండేళ్ల ఫీజు రూ.72వేలు కట్టాలని కాలేజీ యాజమాన్యం ఒత్తిడి తెస్తోంది. ఇప్పటికిప్పుడు అంతడబ్బు ఎలా కట్టాలి? సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి మా సమస్యను పరిష్కరించాలి,

- ప్రైవేటు నర్సింగ్‌ కాలేజీ విద్యార్థిని, హైదరాబాద్‌

Updated Date - Jun 07 , 2026 | 06:24 AM