Share News

ఐఐటీ, ఎన్‌ఐటీలకు ఎంపికైన.. బీసీ గురుకులాల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు

ABN , Publish Date - Jun 26 , 2026 | 05:09 AM

ఐఐటీ, ఐఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలు సాధించిన బీసీ గురుకుల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించనుంది. ఈ మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమ....

ఐఐటీ, ఎన్‌ఐటీలకు ఎంపికైన.. బీసీ గురుకులాల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు

  • సొసైటీ ఆధ్వర్యంలోని వ్యవసాయ కళాశాల సీట్లు గురుకుల విద్యార్థులకే.. బీసీ గురుకులాల పేరు మార్పు

  • ఎంజేపీ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ సమావేశంలో నిర్ణయాలు

హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఐఐటీ, ఐఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలు సాధించిన బీసీ గురుకుల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించనుంది. ఈ మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధ్యక్షతన గురువారం జరిగిన మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల సొసైటీ 6వ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. గురుకుల విద్యార్థులు ఎవరైనా గురుకులాల్లో మరణిస్తే వారి కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలనే నిర్ణయాన్ని ఆమోదించారు. అలాగే, ఎంజేపీటిబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ ఆధ్వర్యంలోని వ్యవసాయ కళాశాల్లోని సీట్లను గురుకుల విద్యార్థులకే పరిమితం చేయాలని బోర్డు నిర్ణయించింది. ప్రస్తుతం మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల సొసైటీగా ఉన్న పేరును తెలంగాణ బీసీ సంక్షేమ మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల సొసైటీ (టీజీడబ్ల్యూసీడబ్ల్యూఎంజేపీఆర్‌ఈఐఎస్)గా మార్చాలని నిర్ణయించారు. విద్యా పర్యవేక్షణను అకడమిక్‌ కన్సల్టెంట్లుగా మాజీ ప్రిన్సిపాళ్లను వినియోగించుకునే విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది. పాఠశాలలకు అవసరమైన డెస్క్‌టాప్‌ కంప్యూటర్ల కొనుగోలు, జూనియర్‌ కళాశాలలకు ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్‌ సరఫరాకు కూడా ఆమోదం లభించింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. బీసీ విద్యార్థులకు అత్యుత్తమ విద్యా అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. బోర్డు భేటీలో తీసుకున్న నిర్ణయాలు సంస్థను మరింత బలోపేతం చేయనున్నాయన్నారు. రాష్ట్రంలో 12సైనిక్‌ స్కూళ్ల ఏర్పాటు అనుమతులకు సంబంధించి పూర్తి నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Jun 26 , 2026 | 05:10 AM