బీసీల లెక్కింపునకు తీసుకుంటున్న చర్యలేంటి?
ABN , Publish Date - May 01 , 2026 | 05:43 AM
రెండో విడత జాతీయ జనగణనలో భాగంగా తెలంగాణ బీసీ కులాల జాబితాలోని అన్ని బీసీ కులాల లెక్కింపునకు తీసుకుంటున్న చర్యల వివరాలు తెలియజేయాలని రాష్ట్ర బీసీ...
తెలంగాణలోని అన్ని బీసీ కులాలను లెక్కించాలి
డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్‌కు రాష్ట్ర బీసీ కమిషన్ లేఖ
హైదరాబాద్, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): రెండో విడత జాతీయ జనగణనలో భాగంగా తెలంగాణ బీసీ కులాల జాబితాలోని అన్ని బీసీ కులాల లెక్కింపునకు తీసుకుంటున్న చర్యల వివరాలు తెలియజేయాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్.. డైరెక్టర్ ఆఫ్ సెన్సె్‌సను కోరారు. ఈ మేరకు రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతీ హోళీకేరికి గురువారం ఓ లేఖ రాశారు. దేశంలోని ఓబీసీల వ్యక్తిగత కుల వివరాలను 2027లో చేపట్టనున్న రెండో విడత జనగణనలో సేకరించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతిని నిరంజన్ తన లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుతం జరుగుతున్న జనగణనలో ఎస్సీ, ఎస్టీ కులాల వివరాలను మాత్రమే సేకరించడం పట్ల ఓబీసీ వర్గాలు నిరాశకు గురవుతున్నాయన్నారు. మొత్తం 130 బీసీ కులాలతో కూడిన తెలంగాణ బీసీ కులాల జాబితాను ఆ లేఖకు జతచేసి పంపారు.
జనగణనలో కులగణన చెయ్యకపోతే ఆమరణ దీక్ష చేస్తా : వీహెచ్
జాతీయ జనగణనలో భాగంగా కులగణన చేపట్టకపోతే ఆమరణ దీక్ష చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి. హన్మంతరావు కేంద్ర ప్రభుత్వాన్ని గురువారం హెచ్చరించారు. జనగణనలో కులగణన చేపట్టకుండా ఓబీసీలకు ప్రధాని మోదీ అన్యాయం చేస్తున్నారన్నారు. ఓబీసీలకు అన్యాయం చేయవద్దని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాస్తానన్నారు.