Share News

నిర్మాణ వ్యర్థాలను అక్రమ డంపింగ్‌ చేస్తే ‘ఓసీ’ బంద్‌

ABN , Publish Date - Jun 20 , 2026 | 05:01 AM

రాష్ట్ర రాజధాని పరిధిలో భవన నిర్మాణ, కూల్చివేత( సీ అండ్‌ డీ వేస్ట్‌) వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేయడంపై ప్రభుత్వం నిషేధం విధించింది.

నిర్మాణ వ్యర్థాలను అక్రమ డంపింగ్‌ చేస్తే ‘ఓసీ’ బంద్‌

  • జరిమానాలు, వాహనాల సీజ్‌..

  • వ్యర్థాలను అధికారిక ప్రాసెసింగ్‌ కేంద్రాలకు తరలించాల్సిందే

  • ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు

హైదరాబాద్‌, జూన్‌ 19( ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని పరిధిలో భవన నిర్మాణ, కూల్చివేత( సీ అండ్‌ డీ వేస్ట్‌) వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేయడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఆయా వ్యర్థాలను ప్రభుత్వం గుర్తించిన ప్రొసెసింగ్‌ కేంద్రాలకు తరలించాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ నిబంధనలను అతిక్రమిస్తే సంబంధిత భవనం ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌(ఓసీ) జారీని నిలిపివేస్తామని హెచ్చరించింది. అలాగే, జరిమానాలు విధిస్తామని, వ్యర్థాల రవాణాకు ఉపయోగించిన వాహనాలను సీజ్‌ చేస్తామని, అనుమతులు నిలిపివేస్తామని, సంబంధిత కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్ట్‌లో పెడతామని స్పష్టం చేసింది. అదేవిధంగా వ్యర్థాలను ప్రాసెస్‌ చేసిన తర్వాత వచ్చిన నిర్మాణ సామగ్రిని ప్రభుత్వ పనుల్లో వినియోగించాలని కూడా పేర్కొంది. ఇందుకు సంబంధించి మెట్రోపాలిటిన్‌ ఏరియా అర్బన్‌ డెవల్‌పమెంట్‌ శాఖ జీవో 626ను శుక్రవారం జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో నిర్మాణ వ్యర్థాలను రోడ్లు, కాలువలు, చెరువులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో పడేయడాన్ని నిషేధించింది.

భవన అనుమతులకు కొత్త నిబంధనలు

ఇకపై భవన నిర్మాణ, లేఅవుట్‌, కూల్చివేత అనుమతుల కోసం వ్యర్థాల నిర్వహణ ప్రణాళిక, వ్యర్థాల వినియోగ ప్రణాళిక అందజేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అక్రమ డంపింగ్‌ చేయబోమని దరఖాస్తుదారు హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు పాటించని భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌ (ఓసీ) జారీ చేయరని పేర్కొంది. అలాగే, రహదారులు, ప్రభుత్వ నిర్మాణ పనుల్లో రీ సైక్లింగ్‌ పదార్థాలు వినియోగించాలని ఆదేశించింది. 20 వేల చదరపు మీటర్లకు పైబడిన నిర్మాణ ప్రాజెక్టులు, రోడ్లు, మౌలిక సదుపాయాల పనుల్లో ప్రాసెస్‌ చేసిన సీ అండ్‌ డీ వ్యర్థాలను వినియోగాన్ని తప్పనిసరి చేసింది. అలాగే ప్రభుత్వ టెండర్లలో కనీసం 10 శాతం నిర్మాణ సామగ్రి సీ అండ్‌ డీ వ్యర్థాలతో తయారైన రీసైకిల్‌ ఉత్పత్తుల నుంచే వినియోగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ సామగ్రి అందుబాటులో లేకుంటే సంబంధిత ప్రాసెసింగ్‌ యూనిట్ల నుంచి ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంటుంది. ఇక, ప్రతి శాఖ తమ పరిధిలో జరుగుతున్న పనులు, ఉత్పత్తి అవుతున్న వ్యర్థాల పరిమాణం, వాటి పారవేత వివరాలను ప్రతి నెలా సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.


వ్యర్థాల ప్రాసెసింగ్‌ కేంద్రాలివే..

ప్రభుత్వ గుర్తింపు పొందిన సీ అండ్‌ డీ వ్యర్థాల రీసైక్లింగ్‌ కేంద్రాలు శంషాబాద్‌, తూముకుంట, జీడిమెట్ల, ఫతుల్లాగూడ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ ప్రాసెసింగ్‌ కేంద్రాలకే వ్యర్థాలను తరలించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Updated Date - Jun 20 , 2026 | 07:15 AM