సమృద్ధిగా గ్యాస్, పెట్రో నిల్వలు
ABN , Publish Date - Mar 26 , 2026 | 05:27 AM
రాష్ట్రంలో వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.
రెండు నెలలకు సరిపడా ఉన్నాయి.. కొరత ఉందన్న ప్రచారం అవాస్తవం
ప్రజలు ఆందోళన చెందవద్దు.. బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు: భట్టి, ఉత్తమ్
హైదరాబాద్, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. శాసన మండలి సమావేశ హాలులో మంత్రి ఉత్తమ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులతో కలిసి వంటగ్యాస్, పెట్రోల్ సరఫరాపై భట్టి బుధవారం సమీక్ష నిర్వహించారు. పెట్రోల్, గ్యాస్ నిల్వలు, పంపిణీలో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని సూచించారు. అవసరానికి మించి కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. పెట్రోల్ బంకుల వద్దకు వచ్చే చివరి వాహనదారుడికి కూడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ దొరుకుతుందనే భరోసా కల్పించాలని అధికారులను, ఏజెన్సీలను ఆదేశించారు. బ్లాక్ మార్కెటింగ్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పెట్రోల్, గ్యాస్ ఏజెన్సీలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. అనంతరం అసెంబ్లీ లాబీలో భట్టి మీడియాతో మాట్లాడుతూ.. కొత్త బడ్జెట్‌పై అసెంబ్లీలో తాను ఇచ్చిన వివరణను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వినదల్చుకోలేదని అన్నారు. అందుకే వాళ్లు బడ్జెట్ కాపీలను చింపి, వాకౌట్ చేశారని విమర్శించారు. జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తనకు తెలియదని చెప్పారు.
రెండు నెలలకు సరిపడా నిల్వలు: ఉత్తమ్
రాష్ట్రంలో రెండు నెలలకు సరిపడా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ నిల్వలు ఉన్నాయని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలు రోడ్లపై నిలబడి ఇబ్బందులు పడొద్దని సూచించారు. అసెంబ్లీలోని తన చాంబర్లో బుధవారం స్టీఫెన్ రవీంద్రతో కలిసి ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ డబ్బాల్లో పెట్రోల్, డీజిల్‌లను నిల్వ చేసుకోవడం ప్రమాదకరం, నిబంధనలకు విరుద్ధమని స్పష్టంచేశారు. ప్రజలు వదంతులను నమ్మి గందరగోళానికి గురికావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రోజువారీ ఇంధన డిమాండ్ 17,246 కిలో లీటర్లు ఉంటే.. సరఫరా 17,898 కిలోలీటర్లు ఉందని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. వినియోగదారులు గందరగోళంలో పడి పెద్ద ఎత్తున ఇంధనం కొనుగోలు చేయడంతో రోజువారీ డిమాండ్ ఒక్కసారిగా 25 శాతం పెరిగిందని చెప్పారు. కొన్ని పెట్రోల్ బంకులకు నిర్ణీత సమయానికి ట్యాంకర్లు చెరుకోకపోవడంతో నో స్టాక్ బోర్డులు పెట్టారని, కొరత కారణంగా కాదని వివరణ ఇచ్చారు. హైదరాబాద్‌లో 596 పెట్రోల్ బంకులు నిరంతరాయంగా పనిచేస్తున్నాయని చెప్పారు.