Share News

నేడు అసెంబ్లీలో ‘వృద్ధ తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా’ బిల్లు

ABN , Publish Date - Mar 28 , 2026 | 05:14 AM

ప్రభుత్వ ఉద్యోగుల నిరాదరణకు గురయ్యే వృద్ధ తల్లిదండ్రులకు ఆర్థిక భద్రత కల్పించే కొత్త బిల్లును ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.

నేడు అసెంబ్లీలో ‘వృద్ధ తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా’ బిల్లు

  • ప్రవేశపెట్టనున్న మంత్రి అడ్లూరి

  • పంచాయతీరాజ్‌ బిల్లు-2026’ను ప్రవేశ పెట్టనున్న మంత్రి సీతక్క

హైదరాబాద్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల నిరాదరణకు గురయ్యే వృద్ధ తల్లిదండ్రులకు ఆర్థిక భద్రత కల్పించే కొత్త బిల్లును ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేసే ఉద్యోగుల వేతనాల్లో 15 శాతం సొమ్ము లేదా రూ.10 వేలు(ఏది తక్కువైతే అది) కోత విధించడంపై రూపొందించిన ‘ది తెలంగాణ ఎంప్లాయీస్‌ అకౌంటబిలిటీ అండ్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ ప్యారెంటల్‌ సపోర్ట్‌(టీఈఏఎంపీఎస్‌) బిల్‌-2026’ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించి, క్యాబినెట్‌ ఆమోదం పొందింది. ఇక సభ ఆమోదం పొంది, గవర్నర్‌ ఆమోదంతో అమల్లోకి రానుంది. ఇప్పటికే అసోంలో ఇలాంటి ‘ప్యారెంటల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ నార్మ్‌ ఫర్‌ అకౌంటబిలిటీ అండ్‌ మానిటరింగ్‌(ప్రణామం)’ చట్టం అమల్లో ఉంది. కాగా ‘ది తెలంగాణ పంచాయతీరాజ్‌(మూడో సవరణ) బిల్లు-2026’ను మంత్రి సీతక్క ప్రవేశపెట్టనున్నారు. ప్రణాళిక, రెవెన్యూ-రిజిస్ట్రేషన్లు, గృహ నిర్మాణం, సమాచార-పౌర సంబంధాలు, పరిశ్రమలు-వాణిజ్య శాఖలకు సంబంధించిన పద్దులను సంబంధిత మంత్రులు సభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం వీటిపై చర్చ జరుగుతుంది. ఇదివరకే ప్రవేశపెట్టిన రవాణా, బీసీ సంక్షేమ శాఖల పద్దులపై మంత్రి పొన్నం ప్రభాకర్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల పద్దులపై మంత్రి సీతక్క వివరణ ఇవ్వనున్నారు. కాగా శనివారం సభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారు.

సభలోకి 2025-26 సవరణ బడ్జెట్‌

2025-26కు సవరించిన బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం శాసన సభలో ప్రవేశపెట్టనున్నారు. 2025-26కిగాను ప్రభుత్వం రూ.3,04,985 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అయితే ఈ నెల 20న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌లో ప్రస్తుత బడ్జెట్‌ వ్యయాన్ని రూ.2,81,338.24 కోట్లకు సవరించింది. అంటే రూ.23,626.24 కోట్ల(7.75ు)కు కోత పెట్టింది. అంచనా వ్యయాలను అందుకోలేని పరిస్థితి ఏర్పడడంతో బడ్జెట్‌ను తగ్గించినట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి ప్రభుత్వం రూ.1,93,313.79 కోట్లను మాత్రమే ఖర్చు చేయగలిగింది. అంటే... అంచనా వ్యయం రూ.2,63,486.73 కోట్లలో ఇది 73.37 శాతం. వివిధ సంస్థలు, ఉద్యోగులకు రుణాలు, అడ్వాన్సుల కింద మరో రూ.14,244.40 కోట్లను పంపిణీ చేసింది. అవి తిరిగి ప్రభుత్వ ఖజానాకు వచ్చే అవకాశమున్నందున.. ఇబ్బంది లేదు. ఎటొచ్చి.. రెవెన్యూ, మూలధన వ్యయాల కింద ఖర్చు పెట్టిన సొమ్ము జనవరి నాటికి రూ.1,93,313.79 కోట్లు మాత్రమే ఉండడం కలవర పెడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలోని ఫిబ్రవరి, మార్చి నెలల వివరాలు అందితే.. మొత్తం వ్యయం రూ.2.40 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా. కనీసంఇది రూ.2.50 లక్షల కోట్లకైనా చేరితే బాగుంటుందని ప్రభుత్వ వర్గాలు ఆశిస్తున్నాయి.

Updated Date - Mar 28 , 2026 | 05:14 AM