Share News

నేటి నుంచి బడ్జెట్‌పై చర్చ

ABN , Publish Date - Mar 23 , 2026 | 06:19 AM

శాసనసభ, శాసనమండలిలో సోమవారం నుంచి రాష్ట్ర బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది. 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఈ నెల 20న శాసనసభలో...

నేటి నుంచి బడ్జెట్‌పై చర్చ

  • 25 నుంచి పద్దులపై చర్చించనున్న అసెంబ్లీ

  • రెండు బిల్లులను ప్రవేశపెట్టనున్న సర్కారు

హైదరాబాద్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): శాసనసభ, శాసనమండలిలో సోమవారం నుంచి రాష్ట్ర బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది. 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఈ నెల 20న శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మండలిలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. రంజాన్‌ పండుగ సందర్భంగా రెండు రోజుల విరామం అనంతరం సోమవారం ఉభయ సభలు పునఃప్రారంభం కానున్నాయి. సోమ, మంగళవారాల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ చేపట్టనున్నారు. బుధవారం పద్దులపై చర్చ ప్రారంభం కానుంది. కాగా, సోమవారం శాసనసభలో రెండు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ప్రశ్నోత్తరాల సమయం అనంతరం తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ బిల్లు -2026ను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెడతారు. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల నియామకాల నియంత్రణ, సిబ్బంది, వేతన చెల్లింపుల క్రమబద్ధీకరణ చట్టం సవరణ బిల్లునును డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సభలో చర్చకు పెట్టనున్నారు. ఈ బిల్లుపై చర్చ, ఆమోదం అనంతరం బడ్జెట్‌పై సాధారణ చర్చను చేపట్టనున్నారు. ఇక శాసనమండలిలోనూ ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే బడ్జెట్‌పై సాధారణ చర్చ ప్రారంభమవుతుంది. ఇక తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు సంబంధించి 2018-19 వార్షిక నివేదికను మంత్రి జూపల్లి కృష్ణారావు శాసనసభ, మండలిలో సమర్పించనున్నారు. అలాగే, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (రద్దు) బిల్లు-2026’ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ఇకపై ఇది ‘డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌’గా సేవలందించనుంది. ఇక నుంచి ఉద్యోగులకు 010 పద్దు ద్వారా జీతాలు ఇస్తారు.

Updated Date - Mar 23 , 2026 | 06:21 AM