తెలంగాణలో 178 అసెంబ్లీ స్థానాలు!
ABN , Publish Date - Apr 16 , 2026 | 03:47 AM
తెలంగాణలో శాసనసభ నియోజకవర్గాల సంఖ్య 119 నుంచి 178కి చేరుకోనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రోరేటా ప్రాతిపదికన పునర్విభజన చేపట్టనున్నట్లు సంకేతాలిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న స్థానాలకు అదనంగా 50 శాతం ...
50 శాతం పెంపుతో పెరగనున్న సీట్లు
హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల
పరిధిలోనే 45కు చేరుకోనున్న స్థానాలు
హైదరాబాద్, ఏప్రిల్ 15 (ఆంధ్ర జ్యోతి): తెలంగాణలో శాసనసభ నియోజకవర్గాల సంఖ్య 119 నుంచి 178కి చేరుకోనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రోరేటా ప్రాతిపదికన పునర్విభజన చేపట్టనున్నట్లు సంకేతాలిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న స్థానాలకు అదనంగా 50 శాతం పెరిగి.. మొత్తం స్థానాలు 178 కానున్నాయి. ఈ ప్రాతిపదికన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే ఏకంగా 45 అసెంబ్లీ సీట్లు ఉండనున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో జనాభా అధికంగా ఉన్నందున.. రాజధానికి ఆనుకుని ఉన్న నియోజకవర్గాల్లో అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం అధికంగా ఉంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో అసెంబ్లీ స్థానాలు 20 కానుండగా.. అందులో 7 మహిళలకు, ఒకటి ఎస్సీలకు రిజర్వ్ అవుతాయి. ఇక మేడ్చల్ జిల్లా పరిధిలో 12 అసెంబ్లీ స్థానాలు, రంగారెడ్డి పరిధిలో 12 నియోజకవర్గాలు ఉంటాయి. కాగా, 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే గ్రామీణ ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుతుందని పునర్విభజన నిపుణుడు ఇనగంటి రవికుమార్ అన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో ప్రభుత్వం కార్యాలయాలు అందుబాటులోకి రావడం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. పట్టణ ప్రాంత జనాభా పెరగడం వల్ల రాజకీయంగా ఆధిపత్యం కోసం పార్టీలు పట్టణ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎక్కువ ప్రయత్నం చేస్తారని, ఆ దిశగా ఆయా పార్టీల పథకాలు రూపొందించే అవకాశం ఉందని పేర్కొన్నారు.