మహిళా పోలీసులతో.. బీఆర్‌ఎస్ సభ్యుల అనుచిత ప్రవర్తన!
ABN , Publish Date - Sep 09 , 2026 | 06:34 AM
మహిళా పోలీసులపై బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు అనుచితంగా ప్రవర్తించిన తీరు చర్చనీయాంశంగా మారింది.
ఇదేం తీరు అంటూ అసెంబ్లీలో సభ్యుల ఆవేదన
ఘటన ఫొటోలను చూపించిన కాంగ్రెస్
మహిళా కమిషన్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు
హరీశ్, కేటీఆర్, నవీన్‌కుమార్‌రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
హైదరాబాద్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): మహిళా పోలీసులపై బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు అనుచితంగా ప్రవర్తించిన తీరు చర్చనీయాంశంగా మారింది. దీనిపై శాసనసభ, మండలి సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న పోలీసుల పట్ల ప్రవర్తించే తీరు ఇదేనా? అని నిలదీశారు. సోమవారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల చొక్కాలు వేసుకుని అసెంబ్లీకి రావడంపైపోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడం, ఇరువర్గాల మధ్య తోపులాట జరగడం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన పలు ఫొటోలను కాంగ్రెస్ పార్టీ మంగళవారం శాసనసభలో సభ్యులకు చూపించింది. వాటిని చూసి సభ్యులుఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళా పోలీసుల పట్ల బీఆర్‌ఎస్ నేతలు ప్రవర్తించిన తీరుపై చర్చించుకున్నారు. మహిళా పోలీసులపై కొందరు చేయి వేయడాన్ని చూస్తే.. సభ్య సమాజం తలదించుకునేలా ఉందని వ్యాఖ్యానించారు. పోలీసులు బీఆర్‌ఎస్ మహిళా సభ్యుల పట్ల అమర్యాదగా ప్రవర్తించారని ఆ పార్టీ ఆరోపించగా.. బీఆర్‌ఎస్ సభ్యులే మహిళా పోలీసుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ కాంగ్రెస్ ధ్వజమెత్తింది. బీఆర్‌ఎస్ సభ్యుల తీరును మంత్రి సీతక్క శాసనసభలో తీవ్రంగా ఖండించారు.
మహిళా కమిషన్‌కు ఫిర్యాదు
మహిళా పోలీసుల పట్ల బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ప్రవర్తించిన తీరు అనాగరికమని కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలు మండిపడ్డారు. అసెంబ్లీ గేట్ నంబర్ 3 వద్ద మహిళా పోలీసు సిబ్బందితో బీఆర్‌ఎస్ సభ్యులు అనుచితంగా ప్రవర్తించారంటూ శాసనసభ్యులు నలమాద పద్మావతి రెడ్డి, రాగమయి, యశస్వినిరెడ్డి, పర్ణికారెడ్డితో పాటు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు స్వర్ణ తదితరులు.. మంగళవారం రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో భద్రతా విధుల్లో ఉన్న మహిళా పోలీసుల పట్ల బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు టి.హరీశ్‌రావు, కేటీఆర్, నవీన్‌కుమార్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, కేపీ వివేకానంద్, డి.సుధీర్‌రెడ్డి అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. నిరసన పేరుతో చొక్కాలు విప్పి, అర్ధనగ్నంగా మహిళా అధికారుల వద్దకు వచ్చి బెదిరింపులకు దిగడం ఏమిటని మండిపడ్డారు. కేటీఆర్ మహిళా డీసీపీని ఉద్దేశించి.. ‘శిఖండి’ అంటూ అవమానించారని, నవీన్‌కుమార్‌రెడ్డి ‘ఆడరాజ్యమా ఇది’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.