Share News

నచ్చని కేసుల్లో వాదించారని లాయర్లపై దాడులు చెల్లవు

ABN , Publish Date - Mar 31 , 2026 | 05:23 AM

తమకు నచ్చని కేసుల్లో వాదించారనే నెపంతో న్యాయవాదులు, వారి కుటుంబ సభ్యులుపై దాడులు చేయడం ఇకపై కుదరదు. న్యాయవాదుల రక్షణ చట్టం...

నచ్చని కేసుల్లో వాదించారని లాయర్లపై దాడులు చెల్లవు

  • శాసనసభలో బిల్లు ఆమోదం

హైదరాబాద్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): తమకు నచ్చని కేసుల్లో వాదించారనే నెపంతో న్యాయవాదులు, వారి కుటుంబ సభ్యులుపై దాడులు చేయడం ఇకపై కుదరదు. న్యాయవాదుల రక్షణ చట్టం (అడ్వకేట్స్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌)లో ప్రభుత్వం కఠిన నిబంధనలు పొందుపరిచింది. న్యాయవాదులు తమ వృత్తిలో భాగంగా కక్షిదారులకు ప్రాతినిధ్యం వహించడం, ఇతర చట్టసమ్మతమైన పనులను చేస్తుంటే వాటిని అడ్డుకునే విధంగా హింసాత్మక చర్యలకు పాల్పడినా, వాటిని ప్రేరిపించినా కఠిన శిక్షలు ఉంటాయి. ఇలాంటి దాడులకు పాల్పడే వ్యక్తులకు ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలుశిక్ష, రూ. 25 వేల నుంచి రూ. 50 వేల వరకు జరిమానా, రెండూ విధించే అవకాశం ఉంది. ఇదే నేరాన్ని రెండోసారి కూడా పాల్పడే వ్యక్తులకు గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉంది. న్యాయవాదులపై దాడికి సంబంధించిన కేసులను డీఎస్పీ/ ఏసీపీ, ఆపై స్థాయి అధికారులు మాత్రమే దర్యాప్తు చేయాలి. కేసు నమోదైన 60 రోజుల్లో దర్యాప్తు విధిగా పూర్తిచేయాలి. చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో విచారణ జరగాలి. ఆరు నెలల్లోగా విచారణ పూర్తిచేయాలి. న్యాయవాదులకు మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులకు సైతం ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది. న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాల్సి వస్తే నేరుగా ఎస్‌హెచ్‌వో కాకుండా చీఫ్‌ జ్యుడీషియిల్‌ మేజిస్ట్రేట్‌ ప్రాథమిక విచారణ జరిపి, ప్రాథమికంగా కేసు ఉందని భావిస్తేనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సి ఉంటుంది. దాడుల వల్ల జరిగిన నష్టానికి పరిహారం సైతం వసూలు చేసుకునే వెసులుబాటు ఉంది. అలాగే, ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసే న్యాయవాదులకు మూడేళ్ల వరకు జైలుశిక్ష లేదా రూ.25 వేల జరిమానా లేదా రెండూ విధించేలా నిబంధనలు ఉన్నాయి.

న్యాయవాదుల పరిరక్షణ బిల్లుకు ఆమోదం

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే న్యాయవాదులపై ఎక్కువ దాడులు, హత్యలు జరిగాయని అసెంబ్లీ వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. అసెంబ్లీలో సోమవారం ‘తెలంగాణ న్యాయవాదుల పరిరక్షణ బిల్లు-2026’ మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశ పెడుతూ వ్యాజ్యాలు ఒప్పుకున్న న్యాయవాదులపై దాడులు చేయడం ఒక న్యాయవాదిగా తనకు ఆందోళన కలుగుతుందన్నారు. న్యాయవాదులపై దాడులు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షించేలా చట్టం తెస్తున్నామన్నారు. మరో మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. న్యాయవాదులకు ఈ చట్టం రక్షణ కవచంలా ఉపయోగ పడుతుందదన్నారు. చర్చ తర్వాత బిల్లును ఆమోదించారు.

Updated Date - Mar 31 , 2026 | 05:23 AM