Share News

CM Revanth Reddy: జీ రామ్‌ జీని వ్యతిరేకిస్తున్నాం

ABN , Publish Date - Jan 03 , 2026 | 03:36 AM

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట స్ఫూర్తిని దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

CM Revanth Reddy: జీ రామ్‌ జీని వ్యతిరేకిస్తున్నాం

  • ఉపాధి హామీ స్ఫూర్తిని కేంద్రం దెబ్బతీస్తోంది.. పేదల హక్కులు హరించేలా కొత్త చట్టం: సీఎం రేవంత్‌

  • జీరామ్‌జీని వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం.. అలా చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ

  • కూలీలను కార్పొరేట్లకు ధారాదత్తం చేసే కుట్ర: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధ్వజం

  • 50 రోజులకే పనుల్లేవు.. 125 రోజులా? కేంద్రం కొత్త నాటకమిది: మంత్రి సీతక్క

హైదరాబాద్‌, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట స్ఫూర్తిని దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరుపేదలైన కార్మికులు, వ్యవసాయ కూలీలు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, అత్యంత బలహీన వర్గాలు, పేద మహిళలకు ఆర్థిక వెసులుబాటు కల్పించడం కోసం తీసుకువచ్చిన ఉపాధి హామీ చట్ట స్ఫూర్తిని దెబ్బతియడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రజలందరి తరఫునా తిరస్కరిస్తున్నామన్న సీఎం రేవంత్‌రెడ్డి.. పాత చట్టాన్ని యథాతథంగా పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఈమేరకు శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాన్ని సభలో చదివి వినిపించిన సీఎం.. పార్టీలకతీతంగా సభ్యులందరూ దానికి మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంత పేదలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు నాటి యూపీఏ ప్రభుత్వం 2005లో నరేగా పథకాన్ని రూపొందించిందని.. పేదరికాన్ని, నిరుద్యోగాన్ని, వలసలను, శ్రామిక వర్గాన్ని దోచుకోవడాన్ని, స్త్రీ, పురుషుల మధ్య వేతన అసమానతలను తగ్గించడమే లక్ష్యంగా 2006 ఫిబ్రవరి 2 నుంచి అది అమల్లోకి వచ్చిందని సీఎం గుర్తుచేశారు. తెలంగాణలో సుమారు 90ు ఎస్సీ, ఎస్టీ, బీసీలున్నారని, ఇందులో 62 శాతంగా ఉన్న మహిళలు, దళితులు, గిరిజనులు, దివ్యాంగులు, అత్యంత వెనుకబడిన తెగలకు చెందిన ఆదివాసీలు ఈ చట్టం ద్వారా లబ్ధి పొందారని పేర్కొన్నారు. నరేగా వల్ల ఇన్నాళ్లుగా పేదలకు పని ఒక హక్కుగా లభించిందని.. కానీ, కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన జీరామ్‌జీ చట్టం పేదల హక్కులను, పాత చట్టం ఆత్మను దెబ్బతీసేలా ఉందన్నారు. పేదలు, గ్రామీణ మహిళలకు ఇది ఉపాధి లేకుండా చేస్తుందన్నారు. పేదల పాలిట శాపంగా మారనున్న జీరామ్‌జీని తిరస్కరిస్తున్నామన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా పనుల ప్రణాళికలను తయారుచేసే విధానానికి స్వస్తి పలికేలా.. మహిళా కూలీలకు వ్యతిరేకంగా ఈ చట్టం ఉందని విమర్శించారు. జీరామ్‌జీ వల్ల పనిదినాలు తగ్గి పేద కుటుంబాల్లో మహిళలు నష్టపోతారని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల సాధికారత కొనసాగాలంటే పాత విధానాన్ని పునరుద్ధరించాలని సీఎం డిమాండ్‌ చేశారు. పాతచట్టం ప్రకారం ఉపాధి పనులకు సంబంధించిన నిధులను కేంద్రమే పూర్తిగా కేటాయించేదని.. కొత్త చట్టం ద్వారా నిధుల వాటాను 60-40 శాతంగా మార్చి, రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతోందని మండిపడ్డారు. పాత వాటా నమూనానే అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అంతేకాదు.. మహాత్మాగాంధీ పేరును ఈ పథకం నుంచి తొలగించడం ద్వారా గాంఽధీ స్ఫూర్తిని సైతం కేంద్రం నీరుగార్చిందని సీఎం దుయ్యబట్టారు. ఆయన పేరును పునరుద్ధరించాలని సభ డిమాండ్‌ చేస్తోందన్నారు.


విరామంతో అన్యాయం

కొత్త చట్టం ప్రకారం వ్యవసాయ సీజన్‌లో 60 రోజులు తప్పనిసరి విరామం వల్ల భూమి లేని నిరుపేద కూలీలకు అన్యాయం జరుగుతుందన్న సీఎం.. ఉపాధి చట్టాన్ని ఏడాది పొడవునా కొనసాగించాలన్నారు. పాతచట్టంలో 266 రకాల పనులు చేపట్టే వెసులుబాటు ఉందని.. జీరామ్‌జీలో భూముల అభివృద్ధి వంటి శ్రమ ఆధారిత పనులు తొలగించడంతో వ్యవసాయ కూలీలు, దళితులు, గిరిజనులు నష్టపోతారని ఆందోళన వెలిబుచ్చారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై పార్టీలు, వ్యక్తులకు అతీతంగా చర్చ జరగాలన్నారు. పాలమూరు లాంటి జిల్లాల నుంచి.. చాలామంది పని దొరక్క పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లేవారని గుర్తుచేశారు. నరేగా వచ్చిన తర్వాత మొట్టమొదట దాన్ని అమలు చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా బళ్లపల్లిలో అని.. ఆ తర్వాత మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రారంభించుకున్నామని గుర్తుచేశారు. ఇప్పుడు కేంద్రం తెచ్చిన చట్టంతో మళ్లీ పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అనంతరం సభ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినట్టు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ప్రకటించారు. కాగా కేంద్రం తీసుకువచ్చిన జీ రామ్‌ జీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. శాసన సభ ఆమోదించిన ఏకగ్రీవ తీర్మానాన్ని కేంద్రానికి పంపనుంది.

కాంగ్రెస్‌ నేతలు చెప్పాలి

మహాత్మాగాంధీ పేరు మార్చడానికి కొత్త చట్టం తేలేదని, ఆయన కలలుగన్న రామరాజ్యం, గ్రామస్వరాజ్య సాధనే లక్ష్యంగా దాన్ని రూపొందించామని బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ మహేశ్వర్‌ రెడ్డి స్పష్టం చేశారు. ‘‘50 రోజులు మాత్రమే పనులు దొరుకుతున్నాయంటున్న సీతక్క ఒక విషయాన్ని గుర్తించాలి. పనులు దొరకని మిగతా 75 రోజులకూ భృతి చెల్లించడమే ఈ పథకం లక్ష్యం. అసలు విషయాన్ని విస్మరించి కొసరు మాటలు మాట్లాడుతున్నారు’’ అని ఆయన మండిపడ్డారు. కొత్త చట్టం కింద.. ఏ పనులు చేయాలో రాష్ట్రప్రభుత్వాలే నిర్ణయిస్తాయని, జాబ్‌ కార్డులు ఇస్తాయని, పనుల పర్యవేక్షణ చేస్తాయని.. కేంద్రం కేవలం నిధులిస్తుందని ఆయన తెలిపారు. గాంధీ మీద ప్రేమ ఉన్నట్టు చెప్పుకొంటున్న కాంగ్రెస్‌ నేతలు.. అసలు గాంధీకి, రాజీవ్‌, రాహుల్‌, ఇందిరాగాంధీలకు మధ్య ఉన్న బంధుత్వాలేంటో చెప్పాలని నిలదీశారు.


పేదల జీవితాలకు భద్రతేదీ?

కూలీలను కార్పొరేట్లకు ధారాదత్తం చేసే కుట్రతో బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందని ఉపాధిహామీ చట్టంపై చర్చలో భాగంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. నరేగా పథకం పేదలకు ఆర్థికంగా ఊతమిచ్చిందని.. కానీ, కేంద్రం ఈ కొత్తచట్టంతో వారి జీవితాలకు భద్రత లేకుండా చేస్తోందని ఆరోపించారు. పేదలకు మేలు చేసే చట్టాలకు బీజేపీ తూట్లు పొడుస్తోందని.. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కొత్త చట్టంతో గ్రామీణ మహిళలకు ఆర్థిక సాధికారత ఉండదన్నారు. కేంద్రం వైఖరితో ఉపాధి కూలీలంతా మౌనంగా రోదిస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఈ చర్చలో బీఆర్‌ఎస్‌ పాల్గొనకపోవడం దురదృష్టకరమన్న ఆయన.. వారికి రాజకీయ లబ్ధి తప్ప ప్రజల గురించి ఆలోచనగానీ, ప్రేమగానీ లేవన్నారు. బీజేపీ తీసుకొచ్చిన జీరామ్‌జీ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం బీఆర్‌ఎ్‌సకు లేదని.. మద్దతిచ్చే ఆలోచనే ఉందని భట్టి ఆరోపించారు. ఇక.. గ్రామీణ ప్రాంతాలను జీహెచ్‌ఎంసీలో కలిపితే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉండదని, పేదలకు ఉపాధి దూరమవుతుందని బీజేపీ పక్షనేత మహేశ్వర్‌ రెడ్డి పేర్కొనడంపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చిందే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అని ఆయన దుయ్యబట్టారు. ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచి, ఇప్పుడు గ్రామీణ ఉపాధి గురించి అదే బీజేపీ సభ్యులు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ‘‘మీరు మోదీ, అమిత్‌ షాలకు సన్నిహితులు కాబట్టి వారిని ఒప్పించి పట్టణ ఉపాధి హామీ పథకం అమలుచేయండి’’ అని మహేశ్వర్‌ రెడ్డిని ఉద్దేశించి దుద్దిళ్ల పేర్కొన్నారు. ఇక.. 100 రోజుల ఉపాధిహామీ పథకం కింద 50 రోజుల పనులే దొరకని పరిస్థితుల్లో.. 125 రోజుల పనులంటూ కేంద్రం కొత్త నాటకం ప్రారంభించిందని మంత్రి సీతక్క మండిపడ్డారు. గత ఏడాది కేటాయించిన 12.5 కోట్ల పనిదినాలకు లెక్క వేస్తే.. నరేగా కింద రాష్ట్రం వాటా రూ.532.13 కోట్లు అవుతుందని, జీరాంజీ కింద ఏకంగా రూ.2320.10 కోట్లు అవుతుందని తెలిపారు. అంటే సుమారు రూ.1800 కోట్ల మేర రాష్ట్రంపై అదనంగా భారం పడుతుందన్నారు. పేదలకు వ్యతిరేకంగా ఉన్న జీరాంజీ చట్టాన్ని సభ్యులు వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహాత్ముడి పేరును తిరిగి చేర్చాలని డిమాండ్‌ చేశారు. పంటసీజన్‌లో 60 రోజుల ఉపాధి విరామాన్ని తొలగించాలన్నారు. పీఎం గతిశక్తి కార్యక్రమానికి ఉపాధి హామీని ముడిపెట్టకుండా.. గతంలో మాదిరిగా గ్రామసభల్లో గ్రామానికి అవసరమైన పనుల్ని నిర్ణయించుకునే విధానాన్ని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. 40ు భారం రాష్ట్రాలపై వేయకుండా.. 100ునిధుల్నీ కేంద్రమే ఇవ్వాలన్నారు. ఇక.. నరేగా పథకం పేరెందుకు మార్చారని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని కేంద్రాన్ని ప్రశ్నించారు. పాత చట్టాన్ని రద్దు చేయడం దుర్మార్గమన్న ఆయన.. ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తొలగించడమంటే ఆయన్ను రెండోసారి హత్యచేయడమేనని దుయ్యబట్టారు. ఇక.. ఉపాధిహామీ విషయంలో కేంద్రం నిర్ణయం పేదలకు వ్యతిరేకంగా ఉందని.. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని మజ్లిస్‌ ఎమ్మెల్యే జుల్ఫికర్‌ అలీ అన్నారు.

Updated Date - Jan 03 , 2026 | 03:36 AM