అసెంబ్లీలో మీడియాకు కార్యాలయం
ABN , Publish Date - Jul 07 , 2026 | 04:32 AM
రాష్ట్ర అసెంబ్లీలో మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా ఓ కార్యాలయం ఏర్పాటైంది. సోమవారం జరిగిన ‘అసెంబ్లీ మీడియా అడ్వయిజరీ కమిటీ ఆఫీసు’ ప్రారంభోత్సవంలో..
తొలిసారిగా ఏర్పాటు.. ప్రారంభించిన స్పీకర్, మండలి చైర్మన్
హైదరాబాద్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అసెంబ్లీలో మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా ఓ కార్యాలయం ఏర్పాటైంది. సోమవారం జరిగిన ‘అసెంబ్లీ మీడియా అడ్వయిజరీ కమిటీ ఆఫీసు’ ప్రారంభోత్సవంలో శాసనసభ స్పీకర్ ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతా.. అసెంబ్లీలో మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా ఒక కార్యాలయం అంటూ లేదు. దేశంలోని ఏ అసెంబ్లీలోనూ, పార్లమెంటులో కూడా ఇలాంటి ఏర్పాటు లేదు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు అసెంబ్లీలో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో మీడియా ప్రతినిధులు ఎప్పటికప్పుడు వార్తలు పంపేందుకు వీలుగా.. ప్రత్యేకంగా కంప్యూటర్లు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
విప్‌లు అద్దంకి, బల్మూర్, వీరేశం బాధ్యతల స్వీకరణ
సోమవారం శుభ ఘడియలు ఉండటంతో అసెంబ్లీలో తమకు ఏర్పాటు చేసిన చాంబర్లలో మండలిలో ప్రభుత్వ విప్‌లు వెంకట్ బల్మూర్, అద్దంకి దయాకర్, శాసనసభలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం బాధ్యతలు స్వీకరించారు. తమకు కేటాయించిన చాంబర్లలో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు, అసెంబ్లీ భవనంలోనే మండలిని ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. పార్లమెంటు తరహాలో సెంట్రల్ హాల్ నిర్మాణ పనులు చురుకుగా జరుగుతున్నాయి.