30 వరకు అసెంబ్లీ సమావేశాలు!
ABN , Publish Date - Mar 17 , 2026 | 04:31 AM
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది.
మధ్యలో నాలుగు రోజులు సెలవులు.. 20న బడ్జెట్.. నేడు, రేపు గవర్నర్ ప్రసంగంపై చర్చ
చర్చకు 18న ముఖ్యమంత్రి సమాధానం
బీఏసీ సమావేశంలో నిర్ణయం!
20 రోజులు నిర్వహించాలన్న విపక్షాలు
హైదరాబాద్, మార్చి 16 (ఆంధ్ర జ్యోతి): అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన సోమవారం బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు, బీజేపీ సభ్యుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎంఐఎం సభ్యుడు కౌసర్ మొహిద్దీన్, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరలు పాల్గొన్నారు. బడ్జెట్ సమావేశాలను కనీసం 20 రోజులపాటు నిర్వహించాలని విపక్ష సభ్యులు కోరారు. అయితే, ఈ నెల 30వ తేదీతో సమావేశాలను ముగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. 16వ తేదీన సమావేశాలు మొదలవగా.. 30 వరకు అంటే 14 రోజుల వ్యవధి ఉంటుంది. ఇందులో రెండు ఆదివారాలు, రెండు పండుగ సెలవులు ఉన్నాయి. 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ఉంటుంది. 18న ఈ చర్చకు సీఎం రేవంత్ రెడ్డి సమాధాన మిస్తారు. 19న ఉగాది పర్వదినం. 20న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. 21న రంజాన్, 22న ఆదివారం సెలవు ఉంటాయి. 23 నుంచి బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది. కోర్ అర్బన్ విలీన బిల్లు, మూసీ, గిగ్ వర్కర్ల బిల్లులపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. 30న ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు.
పనిదినాలు పెంచాలి: విపక్షాలు
అసెంబ్లీ పని దినాలు పెంచాలని కోరినట్లు బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు తెలిపారు. బీఏసీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 30 వరకే అసెంబ్లీని నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోందని, అందులో రెండు ఆదివారాలు, పండగలు పోతే ఎన్ని రోజులు నడుపుతారని ప్రశ్నించారు. ఆదివారాల్లో కూడా సభను నిర్వహించాలని కోరినట్లు తెలిపారు. మంగళవారం నాటి సమావేశాల షెడ్యూల్‌లో ప్రశ్నోత్తరాల సమయం లేకపోవడంపై ప్రశ్నించినట్లు చెప్పారు. 19 అంశాలపై చర్చ చేపట్టాలని కోరినట్లు వెల్లడించారు. సమావేశాలను ఏప్రిల్ 20 వరకు కొనసాగించాలని బీజేపీ తరఫున కోరినట్లు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. బీజేపీ తరఫున 21 అంశాలను చర్చకు ప్రతిపాదించినట్లు చెప్పారు. 20 రోజులైనా సమావేశాలను నిర్వహించాలని సీపీఎం నేత కూనంనేని సాంబశివరావు తెలిపారు. గరిష్ఠంగా 8 రోజులు కూడా సమావేశాలు జరిగే అవకాశం లేదని అన్నారు.