Share News

ఆశావర్కర్లకు 18 వేల వేతనం ఇవ్వాలి

ABN , Publish Date - Mar 29 , 2026 | 07:12 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించినమేరకు ఆశావర్కర్లకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వడంతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని...

ఆశావర్కర్లకు 18 వేల వేతనం ఇవ్వాలి

  • ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే నిర్ణయం తీసుకోవాలి

  • ఆశావర్కర్ల సంఘాల డిమాండ్‌

  • ప్రభుత్వం స్పందించకుంటే రేపు రాష్ట్రవ్యాప్తంగా రహదారుల దిగ్బంధం,.

  • చలో హైదరాబాద్‌ కార్యక్రమం ఉద్రిక్తం

హైదరాబాద్‌, కవాడిగూడ, చిక్కడపల్లి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించినమేరకు ఆశావర్కర్లకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వడంతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని, ఈమేరకు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీ యూ, బీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ఆశావర్కర్ల సంఘాలు శనివారం డిమాండ్‌ చేశాయి. ఈమేరకు నిర్వహించిన చలో హైదరాబాద్‌ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సందర్భంగా ఆశావర్కర్లు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.భూపాల్‌, ఆశావర్కర్ల యూనియన్‌ అధ్యక్షురాలు జయలక్ష్మితోపాటు ప్రధాన కార్యదర్శి ఆర్‌.నీలాదేవి, బీఆర్‌టీయూకు సంబంధించిన ఆశావర్కర్లను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయా యూనియన్ల నాయకులు మాట్లాడుతూ.. ఆశావర్కర్లకు రూ.18 వేలు కనీస వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు. ఆశావర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా రహదారుల దిగ్బంధం, రాస్తారోకోలు నిర్వస్తామని, అయినా ప్రభుత్వం స్పందించకుంటే వచ్చే వర్షాకాలంలో ఆశావర్కర్ల నిరవధిక సమ్మె నిర్వహిస్తామన్నారు. కాగా ఆశా వర్కర్లకు ఎన్నికలప్పుడు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. ఆశాలు చేపట్టే రాస్తారోకో కార్యక్రమానికి సీపీఎం సంపూర్ణ మద్దతు ఇస్తోందన్నారు.

Updated Date - Mar 29 , 2026 | 07:12 AM