Share News

101 మున్సిపాలిటీల్లో నీటి శుద్ధి ప్లాంట్లు

ABN , Publish Date - May 16 , 2026 | 04:45 AM

రాష్ట్రంలోని 101 మున్సిపాలిటీల్లో రూ.3,705.75 కోట్లతో నీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదించింది. స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద ఈ ప్రాజెక్టులను చేపట్టనున్నారు.

101 మున్సిపాలిటీల్లో నీటి శుద్ధి ప్లాంట్లు

రాష్ట్రంలోని 101 మున్సిపాలిటీల్లో రూ.3,705.75 కోట్లతో నీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదించింది. స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద ఈ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ఈ మేరకు పురపాలక శాఖ శుక్రవారం జీవో 543 జారీ చేసింది. గతంలో మంజూరైన రూ.3,769.34 కోట్ల పరిపాలనా అనుమతులు రద్దు చేస్తూ.. తాజా అంచనాల ప్రకారం.. సవరించిన పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఇందులో భూసేకరణ, ఐదేళ్ల పాటు ప్రాజెక్టు నిర్వహణ, యాన్యుటీ చెల్లింపులు, జీఎస్టీ వంటి ఖర్చులు కూడా చేర్చారు. మూడు ప్యాకేజీలుగా టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. హ్యామ్‌ విధానంలో పనులు చేపట్టనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో 3 పర్యాయాలు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం మూడు ప్యాకేజీలుగా విభజించాలని నిర్ణయించింది. భూసేకరణ పూర్తి కాకముందే టెండర్లు పిలిచేందుకు అనుమతి ఇచ్చింది. భూముల సేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. ఈ ప్రాజెక్టులను నిర్ణీత కాలంలో పూర్తి చేసి.. స్వచ్ఛభారత్‌ మిషన్‌ 2.0 నిధులను పూర్తిగా వినియోగించుకోవాలని ప్రజారోగ్య ఈఎన్‌సీని ఆదేశించింది.

Updated Date - May 16 , 2026 | 04:50 AM