సంప్రదాయేతర విద్యుత్ కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Oct 09 , 2026 | 03:45 AM
పవన, సౌర, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ తదితర సంప్రదాయేతర ఇంధన వనరుల ఆధారిత విద్యుత్ కొనుగోలుకు అనుమతినిస్తూ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): పవన, సౌర, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ తదితర సంప్రదాయేతర ఇంధన వనరుల ఆధారిత విద్యుత్ కొనుగోలుకు అనుమతినిస్తూ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. రామగుండంలో 800 మెగావాట్లు, శంకర్‌పల్లిలోని తెలంగాణ జెన్‌కో భూముల్లో బిల్ట్ ఆపరేట్ ఓన్ (బీవోవో) విధానంలో 15 ఏళ్ల కాలానికి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్(బీఈఎస్ఎస్) ఏర్పాటుకు టెండర్లు పిలవనున్నారు. 800 మెగావాట్ల పవన విద్యుత్‌ను 25 ఏళ్ల కాలం పాటు కొనుగోలు చేయడానికి తెలంగాణ రెడ్‌కో టెండర్లు చేపట్టనుంది. 6000 మెగావాట్ల బీఈఎస్ఎస్ ద్వారా 25 ఏళ్లకాలం పాటు విద్యుత్ కొనుగోలు చేసేందుకు రెడ్‌కోకు అనుమతినిచ్చారు. సంప్రదాయేతర ఇంధన వనరులతో రోజులో 24 గంటల పాటు సరఫరా చేసే సంస్థల నుంచి.. 2000 మెగావాట్ల విద్యుత్‌ను 25 ఏళ్లపాటు కొనుగోలు చేయనున్నారు. ఈ విద్యుత్ కొనుగోలుకు తెలంగాణ జెన్‌కో, రెడ్‌కోలు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుండగా... ఒప్పందాలు మాత్రం డిస్కమ్‌లు చేసుకోనున్నాయి.