ఈఎండీగా ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండ్లు
ABN , Publish Date - Mar 29 , 2026 | 06:48 AM
కాంట్రాక్టర్లు ఏదైనా పని దక్కించుకోవడానికి లేదా టెండర్లు వేయడానికి విధిగా సమర్పించాల్సిన ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ)కు సమానంగా ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండ్లు ఇచ్చేందుకు వెసులుబాటు...
హైదరాబాద్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టర్లు ఏదైనా పని దక్కించుకోవడానికి లేదా టెండర్లు వేయడానికి విధిగా సమర్పించాల్సిన ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ)కు సమానంగా ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండ్లు ఇచ్చేందుకు వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ఫైనాన్షియల్ కోడ్‌లోని ఆర్టికల్స్ 129, 279లో మార్పులు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శనివారం జీవో నెం.30 జారీ చేశారు. కనీసం రూ.50 లక్షల విలువైన పనులకు ఈ వెసులుబాటు వర్తిస్తుంది. కరోనా అనంతరం 2022 ఫిబ్రవరి 2న కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కాంట్రాక్టర్లకు వెసులుబాటు ఇస్తూ సాధారణ ఆర్థిక నిబంధనలు-2017లోని రూల్-170(ఐ), 171(ఐ)లను సవరించింది. దాని ప్రకారం కాంట్రాక్టర్లు బిడ్ సెక్యూరిటీ, పర్ఫార్మెన్స్ గ్యారంటీ కింద నగదుకు బదులుగా ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండ్లు ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. అదే విధంగా అనుమతి ఇవ్వాలని గత ఏడాది ఫిబ్రవరి 24న జరిగిన బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ (బీవోసీఈ) సమావేశం రాష్ట్ర ఆర్థిక శాఖకు సిఫారసు చేసింది. దానికి అనుగుణంగా ష్యూరిటీ బాండ్లకు అనుమతినిస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు ఇచ్చింది. అయితే భారతీయ బీమా నియంత్రణ సంస్థ(ఐఆర్‌డీఏఐ)లో నమోదైన సంస్థలు మాత్రమే జారీ చేసే బాండ్లే చెల్లుబాటు అవుతాయి. నిబంధనలు ఉల్లంఘించినప్పుడు కాంట్రాక్టర్ల ఈఎండీలను జప్తు చేయడం, నగదు రూపంలో ప్రభుత్వ ఖాతాలో జమ చేసుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంటుంది.
జీవో విడుదలైన తర్వాత వెలువరించే టెండర్ నోటిఫికేషన్లకు ఈ సడలింపు వర్తించనుంది. ఈ మేరకు అన్ని శాఖలు స్టాండర్డ్ బిడ్డింగ్ డాక్యుమెంట్లలో మార్పులు చేసుకోవాలని, అదే విధంగా సివిల్‌తో పాటు ఇతరత్రా పనులు చేయించే అన్ని శాఖలు ఉపయోగించుకునేలా ప్రామాణిక నమూనాతో పాటు టెండర్ షరతులను నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ రూపొందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణకు టెండర్లకు వేదిక అయిన eprocurment.(eprocurment.telangana.gov.in) పోర్టల్ తగిన మార్పులు చేయాలని నిర్దేశించారు. ఈఎండీగా పని విలువలో 2 శాతం నుంచి 5 శాతం దాకా జమ చేయాల్సి ఉంటుంది. తాజా నిర్ణయంతో కాంట్రాక్టర్లకు వెసుబాటు లభించడంతో పాటు నగదు లభ్యతకు వీలు కలుగనుంది.