ఎక్సైజ్‌లో బదిలీలకు ఓకే
ABN , Publish Date - Apr 02 , 2026 | 03:17 AM
ఎక్సైజ్ శాఖలోఎంతోకాలంగా ఎదురు చూస్తున్న సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సమగ్ర మార్గదర్శకాలతోపాటు ...
హైదరాబాద్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): ఎక్సైజ్ శాఖలోఎంతోకాలంగా ఎదురు చూస్తున్న సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సమగ్ర మార్గదర్శకాలతోపాటు ఈ బదిలీల షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేసింది. బదిలీల ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని ఆదేశించింది సర్కారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఒకేచోట సుదీర్ఘకాలం పని చేస్తున్న వారికి స్థాన చలనం కల్పిస్తారు. ఈ నెల 4న బదిలీలకు అర్హులైన కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల జాబితాల (ఏ,బీ,సీ)ను ప్రదర్శించాలని పేర్కొంది. 7న ఉద్యోగులు బదిలీల ఆప్షన్లను సమర్పించడానికి తుది గడువు. 9న తుది జాబితాను రూపొందించి.. 10న బదిలీ ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వం తెలిపింది. గత జనవరి 31కల్లా రెండేళ్ల సర్వీసు పూర్తయిన వారికి బదిలీ ఉత్తర్వులు వర్తిస్తాయి. చెక్ పోస్టులు, బోర్డర్ మొబైల్ పెట్రోలింగ్ పార్టీలు (బీఎంపీపీ), ఎక్సైజ్ అకాడమీ, ధూల్‌పేట పోలీసు స్టేషన్‌లలో పని చేసిన వారు ఏడాది పూర్తయితే బదిలీలకు అర్హులు. పోస్టుల క్రమబద్ధీకరణలో భాగంగా రద్దయిన పోస్టుల్లో ఉన్న వారిని ఖచ్చితంగా బదిలీ చేయాలి. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి రిటైరయ్యే వారికి మినహాయింపునిచ్చిన సర్కారు.. వారు స్వచ్ఛందంగా కోరుకుంటే బదిలీ చేయాలని తెలిపింది. ఒక ఎక్సైజ్ పోలీసు స్టేషన్‌కు ఒకరికంటే ఎక్కువ మంది పోటీ పడితే భార్యాభర్తల్లో ఒకరికి, వచ్చే ఏడాది మార్చిలో రిటైరయ్యేవారికి, మానసిక వికలాంగ పిల్లలు గల వారికి, వితంతువులు, తీవ్ర అనారోగ్య సమస్యలనెదుర్కొంటున్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. సొంత ఎక్సైజ్ స్టేషన్‌లో పోస్టింగ్‌లు ఇవ్వరాదన్న సర్కారు.. వేరే జిల్లాలకు ట్రాన్స్‌ఫర్ చేయాలని ఎక్సైజ్‌శాఖ ఆదేశించింది. ఫోకల్ నుంచి నాన్-ఫోకల్ పోస్టులకు బదిలీ చేయడంతోపాటు ప్రతి స్టేషన్, డీటీఎఫ్, డిస్టిలరీ విభాగాల్లో అవసరానికి సరిపడా మహిళా కానిస్టేబుళ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలి. జోనల్ డిప్యూటీ కమిషనర్ల పర్యవేక్షణలో జరిగే బదిలీల్లో నిబంధనల ఉల్లంఘన జరిగితే.. సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. బదిలీ విధానాన్ని వెల్లడించినందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు, సహకారశాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్, కమిషనర్ హరికిరణ్‌లకు ఆబ్కారీ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టి.లక్ష్మణ్‌గౌడ్ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.