కొత్తగా 60 ‘సూపర్’ వైద్య సీట్లు
ABN , Publish Date - Feb 22 , 2026 | 05:55 AM
కేంద్ర ప్రభుత్వం సూపర్‌స్పెషాలిటీ వైద్య సీట్లను పెంచింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు బోధనాస్పత్రుల్లో ఈ విద్యా సంవత్సరానికిగాను కొత్తగా కొన్ని విభాగాలకు...
ఈ విద్యా సంవత్సరానికి ఎన్‌ఎంసీ అనుమతి.. ప్రభుత్వాస్పత్రులకు 36, ప్రైవేటు కాలేజీకి 24 సీట్లు మంజూరు
నిమ్స్, ఉస్మానియా, గాంధీ, కాకతీయ కాలేజీలకు జాక్ పాట్
క్యాన్సర్, గుండె, కిడ్నీ వైద్యంలో పెరగనున్న స్పెషాలిటీ వైద్యులు
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ/వరంగల్ మెడికల్, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం సూపర్‌స్పెషాలిటీ వైద్య సీట్లను పెంచింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు బోధనాస్పత్రుల్లో ఈ విద్యా సంవత్సరానికిగాను కొత్తగా కొన్ని విభాగాలకు సూపర్ స్పెషాలిటీ సీట్లకు అనుమతినిచ్చింది. ఈమేరకు జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) రాష్ట్రాలవారీగా సీట్ల వివరాలను శనివారం విడుదల చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి తెలంగాణవ్యాప్తంగా వివిధ మెడికల్ కాలేజీల్లో కొత్తగా 60 సూపర్ స్పెషాలిటీ (డీఎం/ఎం.సీహెచ్) సీట్లు మంజూరయ్యాయి. వీటిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు 36 సీట్లు, ప్రైవేటు కాలేజీకి 24 సీట్లు దక్కాయి.
నిమ్స్‌కు పెద్దపీట..
హైదరాబాద్‌లోని నిమ్స్‌కు 16 సీట్లు మంజూరయ్యాయి. సర్జికల్ ఆంకాలజీ, సర్జికల్ గ్యాస్ర్టోఎంటరాలజీ , వాస్క్యులర్ సర్జరీ, ఆంకో పాథాలజీ విభాగాల్లో ఒక్కోదానికి 4 సీట్ల చొప్పున వచ్చాయి. అన్నింటికంటే ఎక్కువ సీట్లు నిమ్స్‌కే దక్కాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్య సంస్థల్లో ఆంకో పాథాలజీ విభాగంలో డీఎం సూపర్ స్పెషాలిటీ కోర్సుకు అనుమతి పొందిన తొలి సంస్థగా నిమ్స్ నిలిచిందని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప తెలిపారు. ఆంకో పాథాలజీ కోర్సు ప్రారంభం రాష్ట్రంలో సమగ్ర క్యాన్సర్ చికిత్స, పరిశోధన, వైద్య విద్యా ప్రమాణాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు. కాకతీయ మెడికల్ కాలేజీ(వరంగల్)కి 10 సీట్లు వచ్చాయి. కార్డియాలజీ, కార్డియో థొరాసిక్ అండ్ వాస్క్యులర్ సర్జరీ, యూరాలజీ, ప్లాస్టిక్ అండ్ రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ విభాగాల్లో 2 సీట్ల చొప్పున కేటాయించారు. ఇక హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీకి క్యాన్సర్ వైద్యానికి ఊతమిస్తూ మెడికల్ ఆంకాలజీలో 4, సర్జికల్ ఆంకాలజీలో 3 సీట్లు పెరిగాయి. అలాగే గాంధీ మెడికల్ కాలేజీకి క్రిటికల్ కేర్ మెడిసిన్ (డీఎం) విభాగంలో 3 సీట్లకు లైన్ క్లియర్ అయింది. కాగా ప్రైవేటు బోధనాస్పత్రుల్లో సిద్దిపేటకు చెందిన ఆర్వీఎం ఇన్‌స్టిట్యూట్‌కు అత్యధికంగా 24 సీట్లు మంజూరయ్యాయి. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ సహా పలు విభాగాల్లో ఈ సీట్లు వచ్చాయి. కాగా, గాంధీ మెడికల్ కాలేజీ క్రిటికల్ కేర్ మెడిసిన్ (డీఎం) డిపార్ట్‌మెంట్‌లో 3 సీట్లకు అనుమతి లభించడం కాలేజీ 75ఏళ్ల చరిత్రలో ఇదొక మైలురాయని క్రిటికల్ కేర్ మెడిసిన్ హెచ్‌వోడీ డాక్టర్ కిరణ్ మాధల పేర్కొన్నారు.
మరింత చేరువలో సూపర్ స్పెషాలిటీ వైద్యం
కొత్త సూపర్ స్పెషాలిటీ సీట్ల వల్ల గుండె, కిడ్నీ, క్యాన్సర్, న్యూరో వంటి క్లిష్టమైన వ్యాధులకు చికిత్స అందించే నిపుణులైన డాక్టర్లు రాష్ట్రంలోనే తయారవుతారు. అలాగే ప్రభుత్వాస్పత్రుల్లో పీజీ (సూపర్ స్పెషాలిటీ) విద్యార్థులు అందుబాటులో ఉండటం వల్ల సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో పేద రోగులకు 24 గంటల పాటు అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందుతాయి. తెలంగాణ విద్యార్థులు సూపర్ స్పెషాలిటీ కోర్సుల కోసం ఇతర రాష్ర్టాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. మన దగ్గరే సీట్లు పెరగడం వల్ల స్థానిక విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది.