ఆర్డీవో, ఎమ్మార్వో ఆఫీసులకు 117కొత్త భవనాలు
ABN , Publish Date - Jun 26 , 2026 | 05:16 AM
రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో ఆర్డీవో, ఎమ్మార్వో, పోలీస్‌స్టేషన్లు, మరికొన్ని ప్రభుత్వ విభాగాలకు కొత్త భవనాలు రానున్నాయి. కొత్త భవనాలను ...
రూ.263.25 కోట్ల నిధులతో పరిపాలనా అనుమతి
హైదరాబాద్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో ఆర్డీవో, ఎమ్మార్వో, పోలీస్‌స్టేషన్లు, మరికొన్ని ప్రభుత్వ విభాగాలకు కొత్త భవనాలు రానున్నాయి. కొత్త భవనాలను కొన్నిచోట్ల సమీకృత సముదాయం తరహాలో, మరికొన్ని చోట్ల ప్రస్తుత భవనాల స్థానంలోనే నిర్మించనున్నారు. అద్దె ప్రాతిపదికన/ శిథిలావస్థ భవనాలున్న 10 ఆర్డీవో, 107 ఎమ్మార్వో ఆఫీసులకు తొలుత కొత్త భవనాలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కోదానికి సగటున రూ.2.25 కోట్ల చొప్పున 117 భవనాలను రూ.263.25 కోట్లతో నిర్మించేందుకు పరిపాలనా అనుమతినిచ్చింది. ఈ భవనాల నిర్మాణ బాధ్యతను తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్‌కు అప్పగించింది. వీటికితోడు ఇప్పటికే పరిపాలనా అనుమతులు మంజూరైన ఖమ్మం రూరల్, యాదాద్రి జిల్లా పరిధిలో రెండు మండలాలు, సూర్యాపేట జిల్లాలో మూడు మండలాల్లో కొత్త భవనాల నిర్మాణాన్ని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖకు అప్పగించింది. వాస్తవానికి ప్రభుత్వ భవనాల నిర్మాణాలను ఆర్‌అండ్‌బీ పరిధిలోనే నిర్మిస్తారు. కానీ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 10 ఆర్డీవో, 107ఎమ్మార్వో కార్యాలయ భవనాల నిర్మాణ బాధ్యతను హౌసింగ్ కార్పొరేషన్‌కు అప్పగించింది. దీనితో కార్పొరేషన్‌కు వ్యాపారం జరిగినట్టు ఉంటుందన్న భావనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.