Share News

ప్రభుత్వ సలహాదారులుగా వీహెచ్‌, శివధర్‌రెడ్డి

ABN , Publish Date - May 01 , 2026 | 05:21 AM

రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఇద్దరిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వి.హన్మంత్‌రావు, గురువారమే డీజీపీగా పదవీ విరమణ చేసిన బి.శివధర్‌రెడ్డిలకు...

ప్రభుత్వ సలహాదారులుగా వీహెచ్‌, శివధర్‌రెడ్డి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఇద్దరిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వి.హన్మంత్‌రావు, గురువారమే డీజీపీగా పదవీ విరమణ చేసిన బి.శివధర్‌రెడ్డిలకు ఈ పదవులు కట్టబెట్టింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు వేర్వేరు ఉత్తర్వులను జారీ చేశారు. వి.హన్మంత్‌రావును బీసీ సంక్షేమం, అభివృద్ధి సలహదారుగా కేబినెట్‌ ర్యాంకు హోదాతో నియమించింది. వేతనం, ప్రత్యేక, ఆతిథ్య ఖర్చుల అలవెన్సులు మొత్తం కలిపి నెలకు రూ.లక్ష, ఇంటి అద్దెకు రూ.50 వేలు, వాహన అద్దెకు రూ.30వేలు, ఇంధన ఛార్జీల కింద రూ.15 వేల చెల్లింపు ఉంటుందని తెలిపింది. శివధర్‌రెడ్డిని రాష్ట్ర భద్రతా సలహాదారుగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) ర్యాంకు హోదాతో నియమించింది. ఆయన పోలీసు, శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, నేరాలు, మత్తు పదార్థాల నియంత్రణ, రహదారి భద్రత అంశాలపై సలహాలు, సూచనలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. ఆయన మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. నెలకు రూ.2.25లక్షల వేతనం, ఇంటి అద్దె కింద రూ.50 వేల చెల్లింపు ఉంటుందని తెలిపింది.

Updated Date - May 01 , 2026 | 05:21 AM