Share News

టీవీవీపీ ఆస్పత్రులకు వైద్యుల కళ

ABN , Publish Date - Apr 07 , 2026 | 05:26 AM

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పెషలిస్టు వైద్యుల కొరత తీరనుంది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ కేర్‌ (టీవీవీపీ) పరిధిలోని హాస్పిటళ్లలో ఖాళీగా....

టీవీవీపీ ఆస్పత్రులకు వైద్యుల కళ

  • 696 స్పెషలిస్టుల నియామకం

  • నేడు వైద్యమంత్రి చేతుల మీదగా నియామక పత్రాలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పెషలిస్టు వైద్యుల కొరత తీరనుంది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ కేర్‌ (టీవీవీపీ) పరిధిలోని హాస్పిటళ్లలో ఖాళీగా ఉన్న 692 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌(స్పెషలిస్ట్‌) పోస్టుల భర్తీ ప్రక్రియను మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు పూర్తిచేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను సోమవారం సాయంత్రం విడుదల చేసింది. ఏప్రిల్‌ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహా చేతుల మీదుగా ఈ నూతన వైద్యులకు నియామక పత్రాలను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపికైన వారిలో అత్యధికంగా గైనకాలజీ(247), అనస్థీషియా(226), పీడియాట్రిక్‌(219)విభాగాలకు చెందిన స్పెషలిస్టులు ఉన్నారు. వీరితో పాటు 174మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు కూడా నియామక పత్రాలు అందనున్నాయి. గతేడాది 1616 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌(స్పెషలిస్ట్‌), 607 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి మెడికల్‌ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అందులో మొదటివిడతగా గైనకాలజీ, అనస్థీషియా, పీడియాట్రిక్స్‌ వంటి విభాగాలకు సంబంధించి 692 పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన 924 పోస్టుల భర్తీ ప్రక్రియ మే నెలలో పూర్తికానుంది. కాగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీలపై దృష్టి సారించింది. గడిచిన రెండున్నరేళ్లలో 9,572 పోస్టులను భర్తీ చేసింది. మరో 7,562 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుండగా, మరో వారంలో 2,312 నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టుల ఫలితాలు కూడా విడుదల చేయనున్నట్లు బోర్డు ప్రకటించింది. దీంతో తాజాగా ఎంపికైన వారి సంఖ్యతో కలిపి భర్తీ చేసిన పోస్టుల సంఖ్య 12,750కి చేరుకోనుంది.

Updated Date - Apr 07 , 2026 | 05:26 AM